Skip to content
Opens in a new window

[1] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు:

[2] “ఇదిగో విను, నేను ఊరీ కొడుకు బసెలేల్‌ను ప్రత్యేకించుకొన్నాను. అతడు యూదా గోత్రికుడు, హూరు మనుమడు.

[3] నేను అతణ్ణి దైవాత్మతో నింపాను; అతనికి జ్ఞానం, తెలివి, వివేకం ప్రసాదించాను.

[4] నేర్పుతో పనులను కల్పించడానికీ, బంగారం, వెండి, కంచుతో పని చెయ్యడానికీ,

[5] పొదగడంకోసం రత్నాలను సానపెట్టడానికీ, మ్రానులను చెక్కడానికీ, అన్ని విధాల పనులను చెయ్యడానికీ అతణ్ణి ప్రవీణుణ్ణి చేశానన్నమాట.

[6] అతనికి సహాయం చేయడానికి అహీసామాక్ కొడుకూ దానుగోత్రికుడూ అయిన అహోలీయాబును నియమించాను. నిపుణతగల పనివారందరికీ కూడా ఆంతర్యంలో నేర్పును ప్రసాదించాను. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ వారు చేస్తారు.

[7] అంటే, సన్నిధిగుడారం, శాసనాలపెట్టె, దానిమీద ప్రాయశ్చిత్తస్థానంగా ఉన్న మూత, గుడారం కోసం అన్ని పాత్రలు,

[8] బల్ల, దాని సామాను, మేలిమి బంగారు సప్తదీపస్తంభం, దాని సామానంతా, ధూపవేదిక,

[9] హోమ బలిపీఠం, దాని సామానంతా, గంగాళం, దాని పీఠం,

[10] నేసిన వస్త్రాలు, యాజులుగా సేవ చెయ్యడానికి అహరోనుయాజికోసం పవిత్ర వస్త్రాలూ అతని కొడుకులకోసం వస్త్రాలూ,

[11] అభిషేకతైలం, పవిత్ర స్థలంకోసం పరిమళ ధూపద్రవ్యం – ఇవన్నీ నేను నీకాజ్ఞాపించిన ప్రకారం వారు చేస్తారు.”

[12] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు:

[13] “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు – నేను నియమించిన విశ్రాంతి దినాలు మీరు ఆచరించితీరాలి. మిమ్ములను ప్రత్యేకించే యెహోవాను నేనే అని మీ తరతరాలవారు తెలుసుకొనేలా విశ్రాంతిదినం నాకూ మీకూ గురుతుగా ఉంటుంది.

[14] కనుక మీరు విశ్రాంతి దినం ఆచరించాలి. అది మీకు పవిత్ర దినంగా ఉంటుంది. దాన్ని అపవిత్రం చేసేవాణ్ణి చంపాలి. ఆ రోజున ఏ పని అయినా చేసేవాణ్ణి తన ప్రజలలో లేకుండా చేయాలి.

[15] ఆరు రోజులు పని చెయ్యవచ్చు గానీ ఏడో రోజు పూర్తిగా విశ్రమించవలసిన విశ్రాంతి దినం, యెహోవాకు పవిత్ర దినం. విశ్రాంతి దినాన ఏ పని అయినా చేసేవాణ్ణి తప్పక చంపాలి.

[16] “ఇస్రాయేల్‌ప్రజలు విశ్రాంతి దినం ఆచరించాలి. తరతరాలకూ అది పాటించాలి. అది నిత్యమైన ఒడంబడిక.

[17] అది నాకూ ఇస్రాయేల్‌ప్రజలకూ నిత్యమైన గురుతుగా ఉంటుంది. ఎందుకంటే ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాన్నీ భూమినీ చేసి ఏడో రోజున పని మాని విశ్రమించుకొన్నాడు.”

[18] యెహోవా సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడడం ముగించాక ఆయన అతనికి తన శాసనాలున్న రెండు పలకలను ఇచ్చాడు. దేవుని వ్రేలితో వ్రాసిన రాతి పలకలు అవి.

నిర్గమకాండం (దాస్యవిముక్తి) — Chapters