Skip to content
Opens in a new window

[1] అప్పుడు యెహోవా మోషేతో “నీవు, అహరోను, నాదాబు, అబీహు, ఇస్రాయేల్‌ప్రజల పెద్దలు డెబ్భైమంది యెహోవాదగ్గరికి పర్వతం ఎక్కివచ్చి దూరంగా ఆరాధించాలి.

[2] మోషే ఒక్కడే యెహోవాను సమీపించాలి. వారు సమీపించకూడదు. అతనితోపాటు ప్రజలు ఎక్కిరాకూడదు” అన్నాడు.

[3] మోషే ప్రజలదగ్గరికి వచ్చి యెహోవా చెప్పిన మాటలన్నీ న్యాయ నిర్ణయాలన్నీ వారికి తెలియజేశాడు. అందుకు ప్రజలంతా ఏకగ్రీవంగా జవాబిస్తూ, “యెహోవా చెప్పిన అన్ని మాటల ప్రకారం చేస్తాం” అన్నారు.

[4] యెహోవా మాటలన్నీ మోషే వ్రాశాడు. ఉదయం కాగానే లేచి ఆ పర్వతం దిగువ ఒక బలిపీఠం కట్టాడు. ఇస్రాయేల్ ప్రజల పన్నెండు గోత్రాల ప్రకారం పన్నెండు స్తంభాలను నిలిపాడు.

[5] అప్పుడు, ఇస్రాయేల్ ప్రజల్లో కొందరు యువకులను పంపగా వారు హోమ బలులు సమర్పించి యెహోవాకు శాంతిబలులుగా కోడెలను వధించారు.

[6] వాటి రక్తంలో సగం మోషే తీసుకొని పళ్ళెంలో పోశాడు. సగం బలిపీఠంమీద కుమ్మరించాడు.

[7] అప్పుడతడు ఒడంబడిక వ్రాతప్రతిని చేతపట్టుకొని ప్రజలకు చదివి వినిపించాడు. వారు “యెహోవా చెప్పినట్లెల్లా చేస్తాం. విధేయత చూపుతాం” అన్నారు.

[8] మోషే ఆ రక్తం తీసుకొని ప్రజలమీద చిలకరించి “ఇదిగో ఇది ఒడంబడిక రక్తం. ఈ మాటలన్నిటి ప్రకారం యెహోవా మీతో ఈ ఒడంబడిక చేశాడు” అన్నాడు.

[9] ఆ తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇస్రాయేల్ ప్రజల పెద్దలు డెబ్భైమంది కొంతదూరం పర్వతమెక్కి వెళ్ళారు.

[10] అక్కడ వారికి ఇస్రాయేల్ ప్రజల దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆయన పాదాలక్రింద ఆకాశమంత స్వచ్ఛమైన నీలాలతో అలికినట్టుగా ఉంది.

[11] ఇస్రాయేల్‌ప్రజల ప్రముఖుల మీదికి ఆయన తన చెయ్యి ఎత్తలేదు. వారు దేవుని దర్శనం చూశారు. భోజనపానాలు పుచ్చుకొన్నారు.

[12] అప్పుడు యెహోవా మోషేతో “పర్వతం మీదికెక్కి నాదగ్గరకు వచ్చి ఇక్కడ ఉండు. వారి ఉపదేశంకోసం నేను ఆజ్ఞలనూ ధర్మశాస్త్రాన్నీ వ్రాశాను. వాటిని రాతి పలకలతోపాటు నీకిస్తాను” అన్నాడు.

[13] మోషే, అతని అనుచరుడు యెహోషువ లేచారు. మోషే ఆ పెద్దలతో,

[14] “మేము మీదగ్గరకు తిరిగి వచ్చేవరకు ఇక్కడే ఉండండి. ఇరుగో అహరోను, హూరు మీతో ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యెముంటే వారిదగ్గరకు రావచ్చు” అని చెప్పి దేవుని పర్వతం మీదికెక్కాడు.

[15] అతడు ఎక్కినప్పుడు దేవుని మేఘం పర్వతాన్ని కమ్మింది.

[16] యెహోవా మహిమాప్రకాశం సీనాయి పర్వతంమీద నిలిచింది. ఆ మేఘం ఆరు రోజులు పర్వతాన్ని కమ్మింది. ఏడో రోజున ఆ మేఘంలోనుంచి యెహోవా మోషేను పిలిచాడు.

[17] యెహోవా మహిమాప్రకాశం ఆ పర్వత శిఖరంమీద దహించే మంటల్లాగా ఇస్రాయేల్‌ప్రజల కళ్ళకు కనిపించింది.

[18] మోషే ఆ మేఘంలో ప్రవేశించి పర్వతం మీదికెక్కాడు. మోషే ఆ పర్వతంమీద నలభై పగళ్ళూ నలభై రాత్రులూ ఉండిపొయ్యాడు.

నిర్గమకాండం (దాస్యవిముక్తి) — Chapters