[1] అప్పుడు మోషే, ఇస్రాయేల్ ప్రజలు యెహోవాకు ఈ పాట పాడారు: “యెహోవాను గురించి గానం చేస్తాను. ఆయన ఘన విజయం సాధించాడు. గుర్రాన్నీ దాని రౌతునూ సముద్రంలో పడద్రోశాడు.
[2] యెహోవా నా బలం, నా గానం; ఆయనే నాకు రక్షణ కూడా అయ్యాడు. ఆయన నా దేవుడు, ఆయనను స్తుతిస్తాను; నా పూర్వీకుల దేవుడు, ఆయనను కీర్తిస్తాను.
[3] యెహోవా యుద్ధవీరుడు; ఆయన పేరు యెహోవా.
[4] ఫరో రథాలనూ అతడి సైన్యాన్నీ సముద్రంలో పడద్రోశాడు. అతడి నాయకుల్లో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు.
[5] వాళ్ళను జలాగాధం కప్పివేసింది. వాళ్ళు బండ్లలాగా సముద్రం లోతుల్లో మునిగిపొయ్యారు.
[6] యెహోవా, నీ కుడిచెయ్యి అధిక బలం గలది; యెహోవా, నీ కుడిచెయ్యి నీ శత్రువును చితగ్గొట్టివేస్తుంది.
[7] నీకు విరోధంగా లేచేవాళ్ళను నీ మహిమా ప్రకాశం వల్ల నాశనం చేస్తావు, నీ కోపాగ్నిని రగుల చేస్తావు. అది వాళ్ళను ఎండుగడ్డిలాగా కాల్చివేస్తుంది.
[8] నీ నాసికా రంధ్రాలలో నుంచి వచ్చిన ఊపిరి నీళ్ళను కుప్పగా సమకూర్చింది. ప్రవాహాలు ఆనకట్టలాగా నిలిచాయి. సముద్రం లోతులో జలం గడ్డ కట్టింది.
[9] శత్రువు ‘వాళ్ళను తరిమి అందుకుంటాం. కొల్లగొట్టి ఆ సొమ్ము పంచి ఇస్తాం. దానివల్ల నాకు తృప్తి కలుగుతుంది. నా ఖడ్గం దూసి నా హస్తంచేత వాళ్ళను నిర్మూలిస్తాను’ అన్నాడు.
[10] నీవు నీ గాలిని వీచేలా చేశావు. సముద్రం వాళ్ళను కప్పివేసింది. సీసంలాగా వాళ్ళు మహా జలాగాధంలో మునిగారు.
[11] యెహోవా, దేవుళ్ళలో నీవంటి వాడెవడు? నీ పవిత్రతనుబట్టి మహనీయుడవు. పొగడతగిన నీ ఘనకార్యాలు ఎంత భయభక్తులను కలిగిస్తాయి! నీవు అద్భుతాలు చేసేవాడవు. నీవంటి వాడెవడు?
[12] నీ కుడిచెయ్యి చాపావు– వాళ్ళను భూమి మింగివేసింది.
[13] నీవు విడిపించిన ఈ ప్రజకు నీ వాత్సల్యతతో వాళ్ళు వెళ్ళవలసిన త్రోవను చూపుతావు. నీ బలంచేత నీ పవిత్ర నివాసస్థలానికి వారిని తీసుకువెళ్తావు.
[14] ఈ సంగతి జనాలకు వినిపిస్తుంది. వాళ్ళు వణుకుతారు. ఫిలిష్తీయ దేశవాసులకు భయాందోళన కలుగుతుంది.
[15] ఏదోం దేశనాయకులు కంగారుపడతారు. మోయాబు దేశాధికారులు కంపిస్తారు. కనాను దేశవాసులందరికీ ధైర్యం లేకుండా పోతుంది. బీతి భయాలు వాళ్ళను ఆవరిస్తాయి.
[16] నీ బలమైన హస్తంచేత వాళ్ళు రాయిలాగా స్తంభించిపోతారు. యెహోవా, నీ ప్రజ అవతలకు చేరేవరకూ– నీవు కొనుక్కొన్న ప్రజ అవతలకు చేరేవరకూ అలా జరుగుతుంది.
[17] నీవు నీ ప్రజను తీసుకొని నీ సొంత పర్వతంమీద వారికి స్థిరనివాసం ప్రసాదిస్తావు. యెహోవా, నీవు నిర్మించుకొన్న నివాసస్థలంలో, ప్రభూ, నీ చేతులు స్థాపించిన పవిత్రస్థానంలో వారిని స్థిరులుగా చేస్తావు.
[18] యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు.”
[19] ఫరో గుర్రాలూ రథాలూ రౌతులూ సముద్రంలోకి వెళ్ళినప్పుడు యెహోవా వాళ్ళమీదికి సముద్రం నీళ్ళు మళ్ళించాడు. అయితే ఇస్రాయేల్‌ప్రజలు సముద్రం మధ్యలోగుండా ఆరిన నేలమీద నడిచారు.
[20] అహరోను అక్క మిర్యాం దేవునిమూలంగా పలికే స్త్రీ. ఆవిడ ఒక కంజరి చేతపట్టుకొంది. స్త్రీలంతా కంజరీలతోనూ నాట్యంతోనూ ఆమెను అనుసరించారు.
[21] మిర్యాం ఇలా పల్లవి ఎత్తి పాడితే వారంతా ఆమెతోకూడా పాడారు: “యెహోవాను గురించి గానం చెయ్యండి! ఆయన ఘన విజయం సాధించాడు. గుర్రాన్నీ దాని రౌతునూ సముద్రంలో పడద్రోశాడు.”
[22] ఆ తరువాత మోషే ఇస్రాయేల్ ప్రజను ఎర్ర సముద్రం నుంచి షూర్ ఎడారిలోకి ప్రయాణం చేయించాడు. వారంతా ఎడారిలోకి మూడు రోజులు పయనించారు. నీళ్ళు ఎక్కడా దొరకలేదు.
[23] వారు మారా దగ్గరకు చేరినప్పుడు దాని నీళ్ళు చేదుగా ఉండడంచేత వాటిని త్రాగలేకపోయారు. అందుచేతే ఆ స్థలానికి ‘మారా’ అనే పేరు పెట్టారు.
[24] ప్రజలు మోషేమీద సణుగుకొంటూ “మేమేం తాగాలి?” అన్నారు.
[25] అతడు యెహోవాకు ప్రార్థన చేశాడు. యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాడు. మోషే ఆ చెట్టు నీళ్ళలో వేస్తే అవి తియ్యనివయ్యాయి. అక్కడ యెహోవా వారికి ఒక శాసనాన్నీ న్యాయనిర్ణయాన్నీ ఇచ్చాడు, వారిని పరిశోధించాడు.
[26] “మీరు మీ దేవుడైన యెహోవా వాక్కును మనసారా వింటే, ఆయన దృష్టిలో సరిగా ప్రవర్తిస్తే ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన శాసనాలన్నీ పాటిస్తే నేను ఈజిప్ట్‌వాళ్ళకు కలిగించిన రోగాల్లో ఏదీ మీకు తగలనియ్యను. యెహోవా అనే నేనే మిమ్ములను బాగుచేసేవాణ్ణి.”
[27] ఆ తరువాత వారు ఏలీం చేరుకొన్నారు. అక్కడ పన్నెండు నీటి బుగ్గలూ డెబ్భై ఈతచెట్లూ ఉన్నాయి. అక్కడే వారు ఆ నీళ్ళ దగ్గర మకాం చేశారు.