Skip to content
Opens in a new window

[1] “నీవు పది తెరలతో ఆ నివాసాన్ని చెయ్యాలి. ఆ తెరలు పేనిన సన్నమైన నార బట్టలతో చెయ్యాలి. నీల, ఊదా, ఎర్ర రంగుల దారాలు కూడా ఉపయోగించాలి. వాటికి నేర్పుగలవానిచేత కెరూబు రూపాలను బుట్టాలు వేయించాలి.

[2] ప్రతి తెర పొడుగు ఇరవై ఎనిమిది మూరలు. ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటికి ఒకటే కొలత.

[3] అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చాలి. మిగతా అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చాలి.

[4] ఒక తెర వరుసలో చివరి తెర అంచున నీలి దారంతో ఉంగరాలు చెయ్యాలి. రెండో తెరల వరుసలో చివరి తెర అంచున కూడా అలా చెయ్యాలి.

[5] ఒక తెరకు యాభై అల్లిక ఉంగరాలు చెయ్యాలి; ఆ రెండో వరుసలోని తెర అంచున యాభై ఉంగరాలు చెయ్యాలి. ఆ ఉంగరాలు ఈ ఉంగరాలకు ఎదురుగా ఉండాలి.

[6] యాభై కొలుకులను కూడా చెయ్యాలి. దైవనివాసం ఒకటే అయ్యేలా ఆ తెరలను ఈ తెరలకు ఆ కొలుకులతో తగిలించాలి.

[7] “ఆ నివాసంమీద పైకప్పుగా మేక వెండ్రుకలతో తెరలను చెయ్యాలి. మొత్తం పదకొండు తెరలను చెయ్యాలి.

[8] ప్రతి తెర పొడుగు ముప్ఫయి మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు. పదకొండు తెరల కొలత ఒకటే.

[9] అయిదు తెరలను ఒకటిగానూ, ఆరు తెరలను ఒకటిగానూ ఒకదానికొకటి కూర్చాలి. ఆరో తెరను గుడారం ఎదుటి భాగాన మడవాలి.

[10] ఒక తెరల వరుసలో చివరి తెర అంచున యాభై అల్లిక ఉంగరాలు చెయ్యాలి; రెండో తెరల వరుసలో చివరి తెర అంచున యాభై ఉంగరాలు చెయ్యాలి;

[11] యాభై కంచు కొలుకులను కూడా చేసి గుడారం ఒకటే అయ్యేలా ఆ కొలుకులను ఆ ఉంగరాలకు తగిలించి దాన్ని కూర్చాలి.

[12] ఆ గుడారం తెరలో మిగిలిన వ్రేలాడేభాగం – మిగిలిన సగం తెర – దైవనివాసస్థలం వెనుకమీదనుంచి వ్రేలాడాలి.

[13] గుడారం తెరల పొడుగులో మిగిలినది – ఈ పక్క ఒక మూర – ఆ పక్క ఒక మూర నివాసస్థలం కప్పడానికి దాని ఇరువైపుల పక్కలమీద వ్రేలాడాలి.

[14] ఎర్రరంగు వేసిన పొట్టేళ్ళ తోళ్ళతో పైకప్పును చెయ్యాలి. దానిమీద ఉండడానికి గండుచేప తోళ్ళతో పైకప్పును చెయ్యాలి.

[15] “ఆ దైవనివాసం కోసం తుమ్మకర్రతో నిలువు పలకలను చెయ్యాలి.

[16] పలక పొడుగు పది మూరలు, పలక వెడల్పు మూరెడున్నర ఉండాలి.

[17] ప్రతి పలకలో ఒకదానికొకటి సరైన రెండు కుసులు ఉండాలి. ఆ నివాసం పలకలన్నిటికీ అలా చెయ్యాలి.

[18] నివాసం కుడిప్రక్కకోసం అంటే దక్షిణ దిక్కుకోసం, నా గుడారానికి ఇరవై పలకలను చెయ్యాలి.

[19] ఒక్కొక్క పలకక్రింద దాని దాని రెండు కుసులకు రెండు వెండి గూళ్ళు, ఆ ఇరవై పలకలక్రింద నలభై గూళ్ళు చెయ్యాలి.

[20] అలాగే ఆ నివాసం రెండో పక్కకోసం అంటే ఉత్తర దిక్కుకోసం ఇరవై పలకలనూ

[21] వాటి నలభై వెండి గూళ్ళనూ చెయ్యాలి. ఒక్కొక్క పలకక్రింద రెండు గూళ్ళు ఉండాలి.

[22] నివాసం వెనుకభాగం కోసం, అంటే పశ్చిమ దిక్కున ఉన్న భాగంకోసం ఆరు పలకలను చెయ్యాలి.

[23] వెనుకభాగం కోసం నివాసం మూలలకు రెండు పలకలను చెయ్యాలి.

[24] అవి అడుగున కూర్చి ఉండాలి; పై భాగాన మొదటి ఉంగరంవరకు ఒకదానితో ఒకటి అతికి ఉండాలి. రెండు మూలలకు ఉండవలసిన ఆ రెంటికీ అలా ఉండాలి.

[25] పలకలు ఎనిమిది; వాటి వెండి గూళ్ళు పదహారు. ఒక్కొక్క పలకక్రింద రెండు గూళ్ళు ఉండాలి.

[26] “తుమ్మకర్రతో అడ్డకర్రలను చెయ్యాలి.

[27] నివాసానికి ఒకపక్క పలకలకోసం అయిదు అడ్డకర్రలనూ రెండో పక్క పలకలకోసం అయిదు అడ్డకర్రలనూ పశ్చిమ దిక్కున గుడారం వెనుక భాగంకోసం అయిదు అడ్డకర్రలనూ చెయ్యాలి.

[28] ఆ పలకలమధ్య ఉండే నడిమి అడ్డకర్ర ఈ కొననుంచి ఆ కొనవరకు ఉండాలి.

[29] పలకలకు బంగారు తొడుగు చెయ్యాలి. వాటి అడ్డకర్రలను పట్టే ఉంగరాలను బంగారంతో చెయ్యాలి. అడ్డకర్రలకు బంగారు తొడుగు చెయ్యాలి.

[30] పర్వతంమీద నీకు కనపరచినట్లే దైవనివాసాన్ని నిలబెట్టాలి.

[31] “పేనిన సన్నని నారబట్టతోనూ, నీల ఊదా ఎర్రరంగుల దారాలతోనూ వేరొక తెరను చెయ్యాలి. దానికి నేర్పుగలవానిచేత కెరూబు రూపాలను బుట్టాలను వేయించాలి.

[32] తుమ్మకర్రతో నాలుగు స్తంభాలను చేసి వాటికి బంగారు తొడుగు చేసి ఆ తెరను వాటిమీద వ్రేలాడదీయాలి. వాటి గూళ్ళు వెండివీ, వాటి కొక్కేలు బంగారువి కావాలి.

[33] ఆ తెరను ఆ కొలుకులక్రింద వ్రేలాడదీయాలి. తెర చాటున లోపలికి శాసనాల పెట్టెను తేవాలి. ఆ తెర పవిత్ర స్థలాన్నీ అతి పవిత్ర స్థలాన్నీ వేరు చేస్తుంది.

[34] శాసనాల పెట్టెమీద ప్రాయశ్చిత్తస్థానంగా ఉన్న మూత అతి పవిత్రస్థలంలో ఉంచాలి.

[35] తెర వెలుపల ఆ బల్లను ఉంచాలి. నివాసం దక్షిణ దిక్కున, ఆ బల్ల ఎదుట, సప్తదీపస్తంభాన్ని ఉంచాలి. బల్ల ఉత్తరదిక్కుగా ఉంటుంది.

[36] “గుడారం ద్వారానికి మరో తెరను నీలి ఊదా ఎర్ర రంగుల దారాలతోనూ పేనిన సన్నని నార బట్టతోనూ నేతపని చేసేవానిచేత చేయించాలి.

[37] ఆ తెరకోసం తుమ్మకర్రతో అయిదు స్తంభాలను చేసి వాటికి బంగారు తొడుగు చెయ్యాలి. వాటి కొక్కేలు బంగారువి కావాలి. వాటికి అయిదు కంచు గూళ్ళను పోతపోయాలి.

నిర్గమకాండం (దాస్యవిముక్తి) — Chapters