[1] దేవుడు ఈ మాటలన్నీ పలికాడు:
[2] “నేను యెహోవాను. ఈజిప్ట్‌దేశం నుంచి – ఆ దాస్య గృహంలోనుంచి – మిమ్ములను తీసుకువచ్చిన మీ దేవుణ్ణి.
[3] “నేను గాక వేరే దేవుడు మీకు ఉండకూడదు.
[4] “మీ కోసం ఏ విగ్రహమూ చేసుకోకూడదు; పైన ఆకాశంలో గానీ క్రింద భూమిమీద గానీ భూమిక్రింద నీళ్ళలో గానీ ఉన్న దేని రూపమూ చేసుకోకూడదు. అలాంటివాటికి సాగిలపడ కూడదు, వాటిని పూజించకూడదు.
[5] ఎందుకంటే, మీ దేవుడైన యెహోవానైన నేను రోషంగల దేవుణ్ణి. నన్ను ద్వేషించేవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు తండ్రుల నేరాలు కొడుకులమీదికి రప్పిస్తాను.
[6] నన్ను ప్రేమిస్తూ నా ఆజ్ఞల ప్రకారం ప్రవర్తిస్తూ ఉండేవారిమీద వెయ్యి తరాలవరకు అనుగ్రహం చూపుతాను.
[7] “మీ దేవుడైన యెహోవా పేరు వ్యర్థంగా పలకకూడదు. యెహోవా తన పేరు వ్యర్థంగా పలికేవారిని శిక్షించకుండా ఉండడు.
[8] “విశ్రాంతి దినం పవిత్ర దినంగా ఆచరించడానికి జ్ఞాపకముంచుకోవాలి.
[9] ఆరు రోజులు పాటుపడి మీ పని అంతా చెయ్యాలి.
[10] అయితే ఏడో రోజు మీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో మీరు ఎలాంటి పనీ చెయ్యకూడదు. ఆ రోజున మీరు, మీ కొడుకులు, మీ కూతుళ్ళు, మీ దాసులు, మీ దాసీలు, మీ పశువులు, మీదగ్గర నివసించే పరదేశులు ఎలాంటి పనీ చెయ్యకూడదు.
[11] ఆరు రోజులలో యెహోవా ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించి ఏడో రోజున ఆ పని మానుకొన్నాడు. అందుచేత యెహోవా ఆ విశ్రాంతి దినాన్ని దీవించి ప్రత్యేక దినంగా ప్రతిష్ఠించాడు.
[12] “మీ దేవుడైన యెహోవా మీకిచ్చే దేశంలో మీరు దీర్ఘకాలం బ్రతికేలా తండ్రినీ తల్లినీ సన్మానించాలి.
[13] “నరహత్య చెయ్యకూడదు.
[14] “వ్యభిచారం చెయ్యకూడదు.
[15] “దొంగతనం చెయ్యకూడదు.
[16] “మీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యం పలుకకూడదు.
[17] “మీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. మీ పొరుగువాని భార్యను గానీ దాసుణ్ణి గానీ దాసిని గానీ ఎద్దును గానీ గాడిదను గానీ మీ పొరుగువానికి ఉన్న దేనినీ గానీ ఆశించకూడదు.”
[18] ప్రజలంతా ఆ ఉరుములు, ఆ పొట్టేలు కొమ్ము ధ్వని విని, ఆ మెరుపులు, పర్వతంనుంచి లేస్తూవున్న పొగ చూచి భయకంపితులై దూరంగా నిలిచారు.
[19] మోషేతో వారు “నీవే మాతో మాట్లాడు. మేము వింటాం. కానీ దేవుడు మాట్లాడితే చచ్చిపోతాం” అన్నారు.
[20] అందుకు మోషే “భయపడకండి. మిమ్ములను పరీక్షించడానికే దేవుడు వచ్చాడు. మీరు ఆయనమీద భయభక్తులు ఉంచి పాపాలు చెయ్యకుండా ఉండాలని ఆయన ఉద్దేశం” అన్నాడు.
[21] ప్రజలు దూరంగా నిలబడుతూ ఉంటే, దేవుడున్న కారుమబ్బులను మోషే సమీపించాడు.
[22] అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ మాటలు చెప్పు: ‘నేను ఆకాశంనుంచి మీతో మాట్లాడాను, మీరే సాక్షులు.’
[23] నన్నువలె ఆరాధించడానికి మీకోసం వెండి దేవుళ్ళను గానీ బంగారు దేవుళ్ళను గానీ చేసుకోకూడదు.
[24] మట్టి బలిపీఠం నాకోసం చేసి దానిమీద మీ హోమబలులనూ శాంతిబలులనూ మీ మేకలనూ గొర్రెలనూ ఎద్దులనూ సమర్పించాలి. నా పేరు స్మరణకు వచ్చేలా నేను దాన్ని ఉంచిన ప్రతి స్థలంలో మీదగ్గరికి వస్తాను, మిమ్ములను దీవిస్తాను.
[25] ఒకవేళ మీరు నాకు రాళ్ళతో బలిపీఠం చేస్తే చెక్కిన రాళ్ళతో దాన్ని కట్టకూడదు. పనిముట్టు తగిలితే బలిపీఠం అపవిత్రం అవుతుంది.
[26] అంతే గాక, నా బలిపీఠంమీద నగ్నత కనిపించకూడదు గనుక మెట్లమీదుగా దాన్ని ఎక్కకూడదు.”