Skip to content
Opens in a new window

[1] “లేని మాటలు పలకకూడదు, దుర్మార్గుడితో చేయి కలిపి క్రోధంతో అన్యాయమైన సాక్ష్యం చెప్పకూడదు.

[2] జనసమూహానికి లొంగిపోయి చెడుగు చెయ్యకూడదు. సమూహంతో చేరి వ్యాజ్యంలో న్యాయాన్ని తారుమారు చేసే సాక్ష్యం పలకకూడదు.

[3] వ్యాజ్యెమాడేవాడు బీదవాడైనా అతడిపట్ల పక్షపాతం చూపకూడదు.

[4] “మీ విరోధి ఎద్దు గానీ గాడిద గానీ తప్పిపోతుందనుకోండి. అది మీకు కనిపిస్తే దాన్ని తప్పకుండా అతడి దగ్గరకు తేవాలి.

[5] మీ పగవాడి గాడిద బరువుకింద పడి ఉండడం మీరు చూస్తే పక్కగా దాటిపోకుండా అతడితో కలిసి దాన్ని విడిపించితీరాలి.

[6] “బీదవాడి వ్యాజ్యెంలో న్యాయాన్ని తారుమారు చెయ్యకూడదు.

[7] అబద్ధాలకు దూరంగా ఉండాలి. నిర్దోషిని గానీ న్యాయవంతుణ్ణి గానీ చంపకూడదు. అలాంటి చెడుగు చేసేవాణ్ణి నిర్దోషి అని నేను ఎంచను.

[8] లంచం తీసుకోకూడదు. చూపుగలవాణ్ణి లంచం గుడ్డివాడుగా చేస్తుంది, న్యాయవంతుల మాటలను తారుమారు చేస్తుంది.

[9] “పరాయివాళ్ళను బాధించకూడదు. మీరు ఈజిప్ట్‌దేశంలో పరాయివాళ్ళుగా ఉన్నారు. గనుక పరాయివాళ్ళ మనస్సు మీకు తెలుసు గదా.

[10] “ఆరు సంవత్సరాలు మీ భూమిని విత్తి దాని పంట కూర్చుకోవచ్చు,

[11] గానీ ఏడో ఏట మీ ప్రజల్లో ఉన్న బీదవారికి దానిలో ఆహారం దొరికేలా దాన్ని బీడుగా విడిచిపెట్టాలి. వారి తరువాత మిగిలినదాన్ని అడవి జంతువులు తినవచ్చు. మీ ద్రాక్షతోట విషయం, ఆలీవ్‌తోట విషయంలో కూడా అలాగే చెయ్యాలి.

[12] “ఆరు రోజులు మీ పనులు చేసి ఏడో రోజున విశ్రమించాలి. మీ ఎద్దులూ మీ గాడిదలూ మీ దాసి కొడుకులూ విదేశీయులూ సేదదీర్చుకొనేలా ఈ విధంగా చెయ్యాలి.

[13] “నేను మీతో చెప్పే మాటలన్నీ జాగ్రత్తగా వినాలి. వేరే దేవుడి పేరు ఉచ్చరించకూడదు, అది మీ నోటనుంచి రానివ్వకూడదు.

[14] “సంవత్సరానికి మూడు సార్లు నాకు మహోత్సవం ఆచరించాలి.

[15] పొంగని రొట్టెల పండుగ ఆచరించాలి. ఆబీబ్ నెలలో ఈజిప్ట్‌నుంచి వచ్చారు, గనుక ఆ నెలలో నియామక కాలంలో నేను మీకు ఆజ్ఞ ఇచ్చినట్టే ఏడు రోజులు పొంగని రొట్టెలను తినాలి. నా సమక్షంలో ఎవ్వరూ వట్టి చేతులతో కనబడకూడదు.

[16] కోత పండుగ కూడా, పొలంలో విత్తిన మీ వ్యవసాయాల తొలిపంట సమయంలో, ఆచరించాలి. సంవత్సరాంతంలో పొలంలోనుంచి మీ వ్యవసాయ ఫలాలు కూడబెట్టినప్పుడు ఫలసేకరణోత్సవం కూడా ఆచరించాలి.

[17] సంవత్సరానికి మూడు సార్లు పురుషులంతా ప్రభువైన యెహోవా సన్నిధానంలో కనబడాలి.

[18] “నా బలుల రక్తాన్ని పొంగజేసే పదార్థంతో చేసినదానితో సమర్పించకూడదు. నా పండుగల్లో సమర్పించిన క్రొవ్వు రాత్రంతా తెల్లవారేవరకూ ఉండకూడదు.

[19] మీ పొలం ప్రథమ ఫలాల్లో శ్రేష్ఠమైనవి మీ దేవుడైన యెహోవా ఆలయానికి తేవాలి. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు.

[20] “ఇదిగో వినండి. త్రోవలో మిమ్ములను కాపాడుతూ, నేను సిద్ధం చేసిన స్థలానికి తీసుకుపోవడానికి ఒక దూతను మీకు ముందుగా పంపుతున్నాను.

[21] ఆయన సముఖంలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి. తిరగబడకూడదు సుమా. మీ ఎదిరింపులు ఆయన క్షమించడు; ఎందుకంటే నా పేరు ఆయనకు ఉంది.

[22] అయితే ఆయన మాట జాగ్రత్తగా విని, నేను చెప్పినట్లెల్లా మీరు చేస్తే, మీ శత్రువులకు నేను శత్రువుగాను, మీ విరోధులకు విరోధిగాను ఉంటాను.

[23] ఎలాగంటే, నా దూత మీకు ముందుగా సాగిపోతూ, అమోరీ, హిత్తి, పెరిజ్జి, కనాను, హివ్వి, యోబూసి జాతులవారు ఉన్న స్థలానికి మిమ్ములను తీసుకువస్తాడు, నేను వాళ్ళను నాశనం చేస్తాను.

[24] మీరు వాళ్ళ దేవుళ్ళకు సాగిలపడకూడదు, మొక్కనూ కూడదు. వాళ్ళు చేసే పనులు చేయకూడదు. వాళ్ళ విగ్రహాలను తప్పక పడద్రోయాలి, వాళ్ళ పుణ్యశిలలను పగలగొట్టాలి.

[25] మీరు మీ దేవుడైన యెహోవానే ఆరాధించి సేవించాలి. అప్పుడు ఆయన ఆశీస్సులు ఆహారంమీద నీళ్ళమీద ఉంటాయి. అప్పుడు మీ మధ్యనుంచి రోగం తొలగిస్తాను.

[26] మీ దేశంలో గర్భస్రావం, గొడ్డుతనం ఏమీ ఉండవు. మీ రోజుల లెక్క పూర్తి చేస్తాను.

[27] “మీ ఎదుట ఇతరులకు నన్ను గురించిన భయాన్ని కలిగిస్తాను. మీరు వెళ్ళే దేశాల ప్రజలందరినీ చిందరవందర చేసి మీ శత్రువులనందరినీ మీ ఎదుటనుంచి పరుగెత్తిస్తాను.

[28] మీకు ముందుగా కందిరీగలను పంపిస్తాను. అవి మీ ఎదుటనుంచి హివ్వి, కనాను, హిత్తి జాతులవారిని వెళ్ళగొట్టివేస్తాయి.

[29] అయితే వాళ్ళను ఒకే సంవత్సరంలో మీ ఎదుటనుంచి వెళ్ళగొట్టను. అలా చేస్తే ఆ దేశం నిర్జనమై పాడైపోయి, మీకు హానికరమైన అడవి మృగాలు ఎక్కువ అవుతాయి.

[30] మీరు అభివృద్ధి పొంది ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొనేవరకు మీ ఎదుటనుంచి వాళ్ళను కొంచెం కొంచెంగా వెళ్ళగొట్టివేస్తాను.

[31] మీ సరిహద్దులను ఎర్ర సముద్రంనుంచి ఫిలిష్తీయవాళ్ళ సముద్రంవరకూ, ఎడారినుంచి యూఫ్రటీస్ నదివరకూ ఏర్పరుస్తాను. ఆ దేశవాసులను మీ చేతికప్పగిస్తాను. మీరు మీ ఎదుటనుంచి వాళ్ళను వెళ్ళగొట్టివేస్తారు.

[32] వాళ్ళతో గానీ వాళ్ళ దేవుళ్ళతో గానీ ఏ ఒడంబడికా చెయ్యకూడదు.

[33] వాళ్ళ దేవుళ్ళను పూజిస్తే అది మీకు ఉరిగా ఉంటుంది గనుక వాళ్ళు మీచేత నాకు విరోధంగా పాపాలు చేయించకుండేలా వాళ్ళు మీ దేశంలో నివసించకూడదు.”

నిర్గమకాండం (దాస్యవిముక్తి) — Chapters