Skip to content
Opens in a new window

[1] మోషే తన మామ యిత్రో మందను మేపాడు. (యిత్రో మిద్యానులో ఉన్న యాజి.) మందను ఎడారి అవతలి వైపుకు తోలుకొంటూ హోరేబు పర్వతం చేరాడు. అది దేవుని పర్వతం.

[2] అక్కడ యెహోవా దూత ఒక పొద నడుమ మంటల్లో మోషేకు ప్రత్యక్షమయ్యాడు. ఆ పొద మండుతూ ఉంది గానీ అది బూడిద కాలేదు. ఇది చూచి మోషే,

[3] “ఈ పొద ఎందుకు కాలిపోవడం లేదు? నేను ఆ వైపుకు వెళ్ళి ఈ గొప్ప వింత చూడాలి” అనుకొన్నాడు.

[4] దాన్ని చూడడానికి అతడు ఆ వైపు రావడం యెహోవా చూచినప్పుడు ఆ పొద మధ్యనుంచి దేవుడు అతణ్ణి పిలుస్తూ “మోషే! మోషే!” అన్నాడు. “చిత్తం ప్రభూ!” అన్నాడతడు.

[5] ఆయన “దగ్గరకు రావద్దు. నీ పాదరక్షలు విడువు; నీవు నిలుచున్నది పవిత్ర స్థలం” అన్నాడు.

[6] ఆయన ఇంకా “నేను నీ తండ్రియొక్క దేవుణ్ణి, అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి” అన్నాడు. మోషే దేవుని వైపు చూడడానికి భయపడి తన ముఖం కప్పుకొన్నాడు.

[7] అప్పుడు యెహోవా అన్నాడు, “ఈజిప్ట్‌లో ఉన్న నా ప్రజల బాధను నేను నిజంగా చూశాను. వారిని అణగద్రొక్కే అధికారుల కారణంగా వారు పెట్టే మొర నేను విన్నాను. వారి దుఃఖాలు నాకు తెలిసేవున్నాయి.

[8] ఇప్పుడు వారిని ఈజిప్ట్‌వాళ్ళ చేతిలోనుంచి విడిపించడానికి నేను దిగి వచ్చాను. ఆ దేశంనుంచి విశాలమైన మంచి దేశానికి, పాలు తేనెలు నదులై పారుతున్న దేశానికి వారిని తీసుకు వెళ్ళడానికి దిగివచ్చాను. ఆ దేశం కనానుజాతివాళ్ళకూ హిత్తి, అమోరీ, పెరిజ్జి, హివ్వి, యెబూసి జాతులవాళ్ళకూ నివాస స్థలం.

[9] ఇప్పుడు విను. ఇస్రాయేల్‌ప్రజల మొర నాకు చేరింది; ఈజిప్ట్‌వాళ్ళు వారిని పెట్టిన హింస చూశాను;

[10] గనుక ఇప్పుడు నిన్ను ఫరోదగ్గరకు పంపుతాను. నీవు ఇస్రాయేల్‌వారైన నా స్వప్రజను ఈజిప్ట్‌నుంచి తీసుకురావాలి.”

[11] దేవునితో మోషే అన్నాడు, “ఫరోదగ్గరికి వెళ్ళడానికీ ఇస్రాయేల్‌ప్రజను ఈజిప్ట్ నుంచి తీసుకురావడానికీ నేను ఏపాటివాణ్ణి?”

[12] దేవుడు “నేను తప్పక నీకు తోడుగా ఉంటాను. నీవు ఆ ప్రజను ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చిన తరువాత మీరు ఈ పర్వతందగ్గర దేవుణ్ణి ఆరాధిస్తారు. నిన్ను పంపినది నేనే అనడానికి ఇది నీకు రుజువుగా ఉంటుంది” అన్నాడు.

[13] దేవునితో మోషే “ఒకవేళ నేను ఇస్రాయేల్ ప్రజ దగ్గరికి వెళ్ళి వారితో ‘మీ పూర్వీకుల దేవుడు నన్ను మీదగ్గరికి పంపాడు’ అంటే వారు నన్ను ‘ఆయన పేరేమిటి?’ అని అడగవచ్చు. అలాంటప్పుడు వారితో నేనేం చెప్పాలి?” అన్నాడు.

[14] దేవుడు మోషేకు జవాబిస్తూ “నేను శాశ్వతంగా ఉన్నవాడను” అన్నాడు. ఆయన ఇంకా అన్నాడు, “నీవు ఇస్రాయేల్ ప్రజతో ‘ఉన్నవాడు’ నన్ను మీదగ్గరికి పంపాడు అనాలి.”

[15] దేవుడు మోషేతో ఇంకా అన్నాడు, “నీవు ఇస్రాయేల్ ప్రజతో ఈ విధంగా చెప్పాలి: ‘మీ దగ్గరికి నన్ను పంపినది యెహోవా, మీ పూర్వీకుల దేవుడు – అబ్రాహాముకు దేవుడు, ఇస్సాకుకు దేవుడు, యాకోబుకు దేవుడు,’ ఎల్లకాలం నా పేరు ఇదే. తరతరాలకు నా జ్ఞాపకార్థ నామమిదే.

[16] నీవు వెళ్ళి ఇస్రాయేల్ ప్రజల పెద్దలను సమకూర్చి వారితో ఇలా చెప్పు: మీ పూర్వీకుల దేవుడైన యెహోవా, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో చెప్పినదేమిటంటే, ‘నేను మిమ్ములను నిజంగా సందర్శించి ఈజిప్ట్‌లో మీకు సంభవిస్తున్నదాన్ని చూశాను.

[17] ఈజిప్ట్ బాధలనుంచి పాలు తేనెలు నదులై పారుతున్న దేశానికి మిమ్ములను రప్పిస్తానన్నాను. అది కనాను, హిత్తి, అమోరీ, పెరిజ్జీ, హివ్వి, యెబూసి జాతులవాళ్ళు కాపురమున్న దేశం.’

[18] “వారు నీ మాట వింటారు. తరువాత నీవూ ఇస్రాయేల్ ప్రజల పెద్దలూ ఈజిప్ట్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అతడితో ఇలా చెప్పాలి: ‘హీబ్రూవారి దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు. మా దేవుడైన యెహోవాకు బలులు సమర్పించేందుకు ఎడారిలో మూడు రోజుల ప్రయాణం చేయడానికి మాకు సెలవిప్పించండి.’

[19] బలవంతంమీద గాని ఈజిప్ట్ చక్రవర్తి మిమ్ములను వెళ్ళనియ్యడని నాకు తెలుసు.

[20] అయితే నా చెయ్యి చాపి ఈజిప్ట్‌లో నేను చేయబొయ్యే అద్భుతాలన్నిటివల్ల ఆ దేశాన్ని దండిస్తాను. ఆ తరువాత అతడు మిమ్ములను వెళ్ళనిస్తాడు.

[21] అంతేగాక, ఈజిప్ట్‌వాళ్ళు ఇస్రాయేల్‌ప్రజను దయగా చూచేలా చేస్తాను, గనుక మీరు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు.

[22] ప్రతి స్త్రీ తనదగ్గర ఉన్న స్త్రీని తన యజమానురాలినీ వెండి నగలూ బంగారు నగలూ వస్త్రాలూ ఇమ్మని అడగాలి. వాటిని మీ కొడుకులకూ కూతుళ్ళకూ ధరింపజేయాలి. ఇలా మీరు ఈజిప్ట్‌వాళ్ళను కొల్లగొట్టివేస్తారు.”

నిర్గమకాండం (దాస్యవిముక్తి) — Chapters