[1] ఇస్రాయేల్‌ప్రజలు ఈజిప్ట్‌దేశం విడిచివచ్చిన మూడో నెల మొదటి రోజున వారు సీనాయి ఎడారి చేరుకున్నారు.
[2] రెఫిదీంనుంచి బయలుదేరి సీనాయి ఎడారికి వచ్చి ఆ ఎడారిలో మకాం చేశారు. ఇస్రాయేల్ ప్రజలు సీనాయి పర్వతం ఎదుటే మకాం చేశారు.
[3] మోషే దేవునిదగ్గరకు ఆ పర్వతమెక్కాడు. యెహోవా ఆ పర్వతంనుంచి అతణ్ణి పిలిచి ఇలా అన్నాడు: “యాకోబు వంశీయులతో మాట్లాడుతూ ఇస్రాయేల్‌ప్రజకు చెప్పవలసిన దేమిటంటే,
[4] ‘ఈజిప్ట్‌వాళ్ళకు నేనేమి చేశానో, గరుడపక్షి రెక్కలమీద మిమ్ములను మోస్తూ నాదగ్గరకు మిమ్ములను ఎలా చేర్చుకొన్నానో అదంతా మీరు చూశారు.
[5] ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని నా ఒడంబడికను ఆచరిస్తే మీరు అన్ని జనాలలో నాకు విశేషమైన సొత్తుగా ఉంటారు (భూలోకమంతా నాదే గదా).
[6] మీరు నాకు రాజ్యంగానూ యాజుల సమూహంగానూ పవిత్ర జాతిగానూ ఉంటారు.’ నీవు ఇస్రాయేల్ ప్రజలకు చెప్పవలసిన మాటలివే.”
[7] మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి తనకు యెహోవా ఆజ్ఞాపించిన మాటలన్నీ వారికి తెలియజేశాడు.
[8] అందుకు ప్రజలంతా “యెహోవా చెప్పినట్టెల్లా చేస్తాం” అంటూ ఏకీభావంతో జవాబిచ్చారు. మోషే ప్రజల జవాబు యెహోవాదగ్గరికి తీసుకుపొయ్యాడు.
[9] యెహోవా అతనితో “ఇదిగో నేను కారుమబ్బులో నీదగ్గరికి వస్తున్నాను. నేను నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజలు విని ఎప్పటికీ నిన్ను నమ్మాలని నా ఉద్దేశం” అన్నాడు. మోషే ప్రజల మాటలు యెహోవాకు చెప్పినప్పుడు యెహోవా అతనితో ఇలా అన్నాడు:
[10] “నీవు ప్రజల దగ్గరకు వెళ్ళి ఈ రోజూ రేపూ వారిని పవిత్రపరచు. వారు తమ బట్టలు ఉతుక్కొని మూడో రోజుకు సిద్ధంగా ఉండాలి.
[11] మూడో రోజున ప్రజలందరి కళ్ళెదుటే యెహోవా అనే నేనే సీనాయి పర్వతంమీదికి దిగివస్తాను.
[12] ప్రజలు దాటిరాకూడని మేరలు పర్వతం చుట్టూరా ఏర్పరచి వారితో ఈ విధంగా చెప్పాలి – ‘మీరు ఈ పర్వతం ఎక్కకూడదు, దీని సరిహద్దు కూడా తాకకూడదు, జాగ్రత్త సుమా. ఈ పర్వతం ఎవరైనా తాకితే వారికి మరణశిక్ష తప్పదు.
[13] అలాంటివారిని ఎవ్వరూ తాకకూడదు గాని రాళ్ళతో కొట్టాలి. లేకపోతే బాణం వేసి చంపాలి. అలాంటి మనిషి గానీ జంతువు గానీ బ్రతకకూడదు’. అయితే బూరధ్వని దీర్ఘంగా వినిపించినప్పుడు ప్రజలు పర్వతం దగ్గరకు రావాలి.”
[14] మోషే పర్వతం దిగి ప్రజల దగ్గరికి వచ్చి వారిని పవిత్రపరచాడు. వారు తమ బట్టలను ఉతుక్కొన్నారు.
[15] అతడు వారితో “మూడో రోజుకు సిద్ధంగా ఉండండి. పురుషులు స్త్రీలను ముట్టకూడదు” అన్నాడు.
[16] మూడో రోజున ఉదయమయినప్పుడే ఆ పర్వతంమీద ఉరుములూ మెరుపులూ దట్టమైన మబ్బూ వచ్చాయి. పొట్టేలు కొమ్ము బూర చాలా బిగ్గరగా ధ్వనించింది. శిబిరంలో ఉన్న ప్రజలంతా భయంతో కంపించారు.
[17] అప్పుడు దేవుణ్ణి కలుసుకోవడానికి మోషే ప్రజలను శిబిరంనుంచి బయటికి తీసుకువచ్చాడు. వారు పర్వతం దిగువ నిలబడ్డారు.
[18] యెహోవా మంటలతో సీనాయి పర్వతంమీదికి దిగివచ్చినందుచేత దానినంతా పొగ కమ్మింది. ఆ పొగ కొలిమి పొగలాగే లేస్తూ ఉంది. పర్వతమంతా తీవ్రంగా కంపిస్తూ ఉంది.
[19] పొట్టేలు కొమ్ము ఇంకా చాలా బిగ్గరగా వినిపిస్తూ ఉంటే మోషే మాట్లాడాడు, దేవుడు ఉరుములాంటి కంఠస్వరంతో అతనికి జవాబిచ్చాడు.
[20] యెహోవా సీనాయి పర్వతశిఖరం మీదికి దిగివచ్చి ఆ శిఖరంమీదికి రమ్మని మోషేను పిలిచాడు. మోషే దానిని ఎక్కిపొయ్యాడు.
[21] అప్పుడు యెహోవా మోషేతో “ఈ ప్రజలు యెహోవాను చూద్దామని హద్దుమీరి నాదగ్గరకు వచ్చి వారిలో చాలామంది నశించిపోకుండేలా నీవు దిగివెళ్ళి వారిని హెచ్చరించు.
[22] అంతే కాక యెహోవా తన సన్నిధికి ప్రవేశం గల యాజులపై పడకుండేలా వారు తమ్మును పవిత్రపరచుకోవాలి” అన్నాడు.
[23] అందుకు మోషే “పర్వతానికి మేరలను ఏర్పరచి దాన్ని పవిత్రపరచాలని నీవు మాకు ఆజ్ఞాపించావు గదా. గనుక ఈ ప్రజలు ఈ సీనాయి పర్వతం ఎక్కిరాలేరు” అన్నాడు.
[24] అతనితో యెహోవా అన్నాడు, “పర్వతం దిగివెళ్ళు. అహరోన్ను వెంటబెట్టుకొని తిరిగి రా. అయితే యెహోవా వారిపై పడకుండేలా యాజులూ ప్రజలూ హద్దుమీరి ఆయనదగ్గరకు ఎక్కి రాకూడదు.”
[25] మోషే ప్రజలదగ్గరికి వెళ్ళి ఆ మాట వారికి చెప్పాడు.