[1] లేవీ వంశస్థుడొకడు లేవీ వంశంలో ఉన్న ఒకామెను పెళ్ళి చేసుకొన్నాడు.
[2] ఆమె గర్భవతి అయి కొడుకును కన్నది. వాడు అందగాడని మూడు నెలలు వాణ్ణి దాచింది.
[3] వాణ్ణి ఇంకా దాచిపెట్టలేక వాడికోసం జమ్ము గంప తీసుకొని దానికి జిగట మట్టినీ కీలునూ పూసింది. అందులో ఆ పిల్లవాణ్ణి ఉంచి నది ఒడ్డున ఉన్న జమ్ము గడ్డిలో దాన్ని పెట్టింది.
[4] వాడికి ఏం సంభవిస్తుందో చూడడానికి ఆ పిల్లవాడి అక్క కొంత దూరంగా నిలిచి ఉంది.
[5] ఫరో కూతురు నదికి స్నానానికి వచ్చింది. ఆమె చెలికత్తెలు నది ఒడ్డున విహరిస్తూ ఉన్నారు. ఆమె అక్కడి తుంగలో ఆ జమ్ము గంపను చూచి తన దాసిని పంపి దాన్ని తెప్పించింది.
[6] దాన్ని తెరచి ఆ పిల్లవాణ్ణి చూచింది. వాడు ఏడుస్తున్నాడు. ఆమెకు వాడిమీద జాలి వేసింది. “వీడు హీబ్రూ పిల్లల్లో ఒకడు” అంది.
[7] అప్పుడు వాడి అక్క ఫరో కూతురుతో, “మీ కోసం ఈ పిల్లవాడికి పాలివ్వడానికి నేను వెళ్ళి హీబ్రూ స్త్రీలలో ఒక దాదిని తీసుకురమ్మంటారా?” అని అడిగింది.
[8] ఫరో కూతురు ఆమెతో “సరే వెళ్ళు” అంది. ఆ అమ్మాయి వెళ్ళి ఆ పిల్లవాడి తల్లిని తీసుకువచ్చింది.
[9] ఫరో కూతురు ఆమెతో ఇలా అంది. “ఈ పిల్లవాణ్ణి తీసుకువెళ్ళి నా కోసం వీడికి పాలిచ్చి పెంచు. నేను నీకు జీతమిస్తాను”. ఆమె వాణ్ణి తీసుకువెళ్ళి అలాగే చేసింది.
[10] అబ్బాయి పెరిగాడు. ఆమె అతణ్ణి ఫరో కూతురు దగ్గరకు తీసుకువచ్చింది. అతడు చక్రవర్తి కూతురికి పెంపుడు కొడుకు అయ్యాడు. “నీళ్ళలోనుంచి అతణ్ణి తీశాను” అని చెప్పి ఆమె అతనికి ‘మోషే’ అనే పేరు పెట్టింది.
[11] మోషే పెద్దవాడయిన తరువాత ఒక రోజు తన సొంత ప్రజల దగ్గరకు వెళ్ళి వారి భారాలను చూశాడు. ఈజిప్ట్‌వాడొకడు ఒక హీబ్రూవాణ్ణి, అంటే తన సొంత ప్రజల్లో ఒకడిని కొట్టడం కూడా చూశాడు.
[12] అతడు అటూ ఇటూ పారచూచి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆ ఈజిప్ట్‌వాణ్ణి చంపి అతడి శవాన్ని ఇసుకలో కప్పి పెట్టాడు.
[13] మరుసటి రోజు కూడా అతడు వారి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు హీబ్రూవాళ్ళు ఇద్దరు దెబ్బలాడుతూ ఉన్నారు. మోషే తప్పు చేసిన వాడితో “నువ్వు నీ సాటివాణ్ణి ఎందుకు కొడుతున్నావు?” అని అడిగాడు.
[14] అతడిలా బదులు చెప్పాడు: “నిన్ను మామీద అధికారిగా తీర్పరిగా నియమించిందెవరు? ఆ ఈజిప్ట్‌వాణ్ణి చంపినట్టు నన్నూ చంపాలనుకొంటున్నావా?” మోషేకు భయం వేసింది. “ఈ సంగతి బయట పడిపోయిందే” అనుకొన్నాడు.
[15] ఫరో ఆ సంగతి విని మోషేను చంపడానికి ప్రయత్నించాడు గాని మోషే అతడి దగ్గరనుంచి మిద్యానులో ఉండేందుకు పారిపొయ్యాడు. అక్కడ ఒక బావిదగ్గర కూర్చున్నాడు.
[16] మిద్యానులో ఉన్న యాజికి ఏడుగురు కూతుళ్ళు. తమ తండ్రి మందకు నీళ్ళు పెట్టడానికి వాళ్ళు వచ్చి నీళ్ళు చేది తొట్లు నింపారు.
[17] మంద కాపరులు కొందరు వచ్చి వారిని వెళ్ళగొట్టారు గాని మోషే లేచి వారికి సహాయం చేసి వారి మందకు నీళ్ళు పెట్టాడు.
[18] వారు తమ తండ్రి “రగూయేల్” దగ్గరికి వచ్చినప్పుడు అతడన్నాడు: “ఈ వేళ మీరింత త్వరగా వచ్చారే, విశేషమేమిటి?” అని అడిగాడు.
[19] వారు జవాబిస్తూ “మంద కాపరుల చేతిలోనుంచి ఈజిప్ట్‌వాడొకడు మమ్మల్ని తప్పించాడు. మాకోసం నీళ్ళు చేది మందకు పెట్టాడు కూడా” అన్నారు.
[20] అందుకతడు తన కూతుళ్ళతో “అతడెక్కడ? అతణ్ణి విడిచి రావడం దేనికి? అతణ్ణి భోజనానికి పిలవండి” అన్నాడు.
[21] ఆ మనిషిదగ్గర నివసించడానికి మోషే నిశ్చయించు కొన్నాడు. అతడు తన కూతురును మోషేకు ఇచ్చి పెళ్ళి చేశాడు. ఆ అమ్మాయి పేరు సిప్పోరా.
[22] ఆమె ఒక కొడుకును కన్నది. మోషే “ఇది పరాయి దేశం. ఇక్కడ నేను పరాయి మనిషిని” అనుకొని వాడికి గెర్షోం అనే పేరు పెట్టాడు.
[23] చాలా రోజులు గడిచాయి. అంతలో ఈజిప్ట్ చక్రవర్తి మృతి చెందాడు గాని ఇస్రాయేల్ ప్రజలు దాస్యంలో ఉండి ఇంకా మూలుగుతూ మొరపెట్టుకొంటూ ఉన్నారు. వారు ఆ దాస్యాన్ని బట్టి చేసిన ఆక్రందన దేవుని సన్నిధానం చేరింది.
[24] దేవుడు వారి మూలుగులను విన్నాడు. అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన ఒడంబడిక గురించి తలచుకొన్నాడు.
[25] దేవుడు ఇస్రాయేల్‌ప్రజను సానుభూతితో చూశాడు.