[1] యెహోవా మోషేతో ఇలా అన్నాడు:
[2] “నాకు కానుక తీసుకురావాలని ఇస్రాయేల్ ప్రజలతో చెప్పు. మనసారా ఇచ్చే ప్రతి ఒక్కరి కానుక తీసుకో.
[3] వారిదగ్గర తీసుకోవలసినవి బంగారం, వెండి, కంచు,
[4] నీల, ఊదా, ఎర్ర రంగులు గల దారం, శ్రేష్ఠమైన సన్న నారబట్ట, మేకవెండ్రుకలు,
[5] ఎర్రరంగు వేసిన పొట్టేళ్ళ తోళ్ళు, గండుచేప తోళ్ళు, తుమ్మకర్రలు,
[6] దీపంకోసం నూనె, అభిషేక తైలంకోసమూ పరిమళ ధూపంకోసమూ సుగంధద్రవ్యాలు,
[7] ఏఫోదు కోసమూ వక్షపతకం కోసమూ మిశ్రిత వర్ణ రత్నాలు, వివిధమైన చెక్కినరత్నాలు.
[8] నేను వారిమధ్య నివసించేలా వారు నాకు పవిత్ర నివాసం నిర్మించాలి.
[9] ఆ నివాసం, దాని సామానంతా ఎలా ఉండాలో నేను నీకు చూపిస్తాను. ఆ నమూనా ప్రకారమే అంతా నిర్మించాలి.
[10] “వారు తుమ్మకర్రతో ఒక పెట్టెను చెయ్యాలి. దాని పొడుగు రెండున్నర మూరలు, దాని వెడల్పు మూరెడున్నర, దాని ఎత్తు మూరెడున్నర ఉండాలి.
[11] దానికి మేలిమి బంగారు తొడుగు చెయ్యాలి. లోపలా వెలుపలా తొడుగు చెయ్యాలి. దాని అంచుకు చుట్టు బంగారు అలంకారం చెయ్యాలి.
[12] ఆ పెట్టెకు నాలుగు బంగారు ఉంగరాలను పోతపోసి దాని నాలుగు కాళ్ళకు వాటిని అంటించాలి – రెండు ఒక పక్కకు, రెండు ఎదుటి పక్కకు.
[13] తుమ్మకర్రతో కర్రలు చేసి వాటికి బంగారు తొడుగు చెయ్యాలి.
[14] వాటితో ఆ పెట్టెను మోయడానికి దాని ప్రక్కలకు ఉన్న ఉంగరాలలో ఆ కర్రలను ఉంచాలి.
[15] ఆ కర్రలు ఆ పెట్టె ఉంగరాలలోనే ఉండాలి. వాటిని ఎన్నడూ తీయకూడదు.
[16] నేను నీకిచ్చే శాసనాలను ఆ మందసంలో ఉంచాలి.
[17] “ఆ మందసం కోసం మేలిమి బంగారంతో ప్రాయశ్చిత్తస్థానంగా మూత చెయ్యాలి. దాని పొడుగు రెండున్నర మూరలు, దాని వెడల్పు మూరెడున్నర ఉండాలి.
[18] రెండు కెరూబు రూపాలను బంగారంతో చెయ్యాలి. రేకుగా సాగగొట్టిన బంగారంతో చేయాలి. అవి ఆ మూత రెండు కొనలకు ఉండాలి.
[19] ఈ కొనకోసం ఒక కెరూబును, ఆ కొనకోసం ఒక కెరూబును చెయ్యాలి. ఆ రెండు కొనలకు ఉండే కెరూబులు ఆ మూతతో ఏకాండంగా చెయ్యాలి.
[20] ఆ కెరూబులు రెక్కలు పైకి విప్పి ఉండాలి. అవి ఆ మూతను మరుగు చెయ్యాలి. ఆ కెరూబుల ముఖాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండాలి. అవి ఆ మూతవైపు ఉండాలి.
[21] నీవు ఆ మూత ఆ పెట్టెమీద ఉంచాలి. నేను నీకిచ్చే శాసనాలను పెట్టెలో ఉంచాలి.
[22] అక్కడ నేను నిన్ను కలుసుకొంటాను; ఆ మూతమీదనుంచీ శాసనాల పెట్టెమీద ఉండు రెండు కెరూబుల మధ్యనుంచీ నీతో మాట్లాడుతూ, ఇస్రాయేల్ ప్రజ కోసం నా ఆజ్ఞలన్నీ నీకిస్తాను.
[23] “నీవు తుమ్మకర్రతో ఒక బల్లను కూడా చెయ్యాలి. దాని పొడుగు రెండు మూరలు, దాని వెడల్పు ఒక మూర, దాని ఎత్తు మూరెడున్నర.
[24] దానిని మేలిమి బంగారు తొడుగు చెయ్యాలి.
[25] దానికి చుట్టు బెత్తెడు ఓరను చేసి ఆ ఓరకు చుట్టూ బంగారు అలంకారం చెయ్యాలి.
[26] ఆ బల్లకు నాలుగు బంగారు ఉంగరాలను చేసి దాని నాలుగు కాళ్ళకు ఉండే నాలుగు మూలల్లో ఆ ఉంగరాలను తగిలించాలి.
[27] బల్ల మోయడానికి కర్రల కోసం ఆ ఉంగరాలు ఓరదగ్గరే ఉండాలి.
[28] ఆ కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు తొడుగు చెయ్యాలి. వాటితో ఆ బల్లను మోయాలి.
[29] దాని పళ్ళేలనూ ధూపార్తులనూ గిన్నెలనూ పానీయార్పణకు పాత్రలనూ మేలిమి బంగారంతో చెయ్యాలి.
[30] నా సన్నిధిలో ఉండవలసిన రొట్టెలు ఈ బల్లమీద నా ఎదుట ఎల్లప్పుడూ ఉండాలి.
[31] “నీవు మేలిమి బంగారంతో సప్తదీపస్తంభం ఒకదానిని చేయాలి. దాని నిలువుభాగాన్నీ అడుగుభాగాన్నీ రేకుగా సాగగొట్టిన బంగారంతో చెయ్యాలి. దాని కలశాలూ పుష్పకోశాలూ పుష్పదళాలూ దానితో ఏకాండంగా ఉండాలి.
[32] ఆ దీపస్తంభం పక్కలనుంచి ఆరు కొమ్మలు నిగుడాలి – ఆ పక్కనుంచి మూడు, ఈ పక్కనుంచి మూడు.
[33] ఒక కొమ్మమీద మూడు కలశాలు, రెండో కొమ్మమీద మూడు కలశాలు ఉండాలి. ఈ విధంగా సప్తదీపస్తంభం నుంచి నిగిడే ఆరు కొమ్మలమీద అవి ఉండాలి. ఆ కలశాలకు పుష్ప కోశాలూ పుష్పదళాలూ గల బాదం పువ్వుల రూపం ఉండాలి.
[34] దీపస్తంభానికి బాదం పువ్వుల్లాంటి నాలుగు కలశాలు, దాని పుష్పకోశాలతో పుష్ప దళాలతో ఉండాలి.
[35] దీపస్తంభం నిలువుభాగంనుంచి నిగిడే ఆరు కొమ్మలకు రెండేసి కొమ్మలక్రింద ఒక్కొక్క పుష్పకోశం ఉండాలి. అవి ఆ కొమ్మలతో ఏకాండంగా ఉండాలి.
[36] ఆ పుష్ప కోశాలూ ఆ కొమ్మలూ దీపస్తంభంతో ఏకాండంగా ఉండాలి. అదంతా రేకుగా కొట్టిన మేలిమి బంగారంతో చేసిన ఏకాండమైన పనిగా ఉండాలి.
[37] దానికి ఏడు దీపాలను చెయ్యాలి. దానికి ముందు వెలిగివ్వడానికి దాని దీపాలను వెలిగించాలి.
[38] దాని కత్తెరను కత్తెర చిప్పనూ మేలిమి బంగారంతో చెయ్యాలి.
[39] దీపస్తంభాన్నీ దాని సామానంతా చెయ్యడంలో ముప్ఫయి నాలుగు కిలోగ్రాముల మేలిమి బంగారం ఉపయోగించాలి.
[40] ఈ పర్వతంమీద నీవు చూచినవాటి నమూనా ప్రకారమే వాటిని చెయ్యాలి సుమా.