Skip to content
Opens in a new window

[1] యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “మొదటి పలకలవంటి మరి రెండు రాతిపలకలు చెక్కు. నీవు పగలగొట్టిన ఆ మొదటి పలకలమీద ఉన్న మాటలు ఈ పలకలమీద వ్రాస్తాను.

[2] “ఉదయానికి నీవు సిద్ధంగా ఉండి ఉదయమే సీనాయి పర్వతమెక్కి దాని శిఖరంమీద నా సన్నిధానంలో నిలబడు.

[3] నీతోపాటు ఎవ్వరూ రాకూడదు, ఈ పర్వతంమీద ఎవ్వరూ ఎక్కడా కనిపించకూడదు. పర్వతం ఎదుట గొర్రెలు గొడ్డు గోదలు మేయకూడదు.”

[4] ఆ మొదటి పలకలవంటివి ఇంకా రెండు పలకలు మోషే చెక్కాడు. యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఉదయం కాగానే లేచి ఆ రెండు రాతిపలకలు చేతపట్టుకొని సీనాయి పర్వతమెక్కాడు.

[5] యెహోవా ఆ మేఘంలో దిగివచ్చి, అక్కడ మోషే దగ్గర నిలబడి యెహోవా పేరును ప్రకటించాడు.

[6] యెహోవా అతనికి ముందుగా అతని దగ్గర దాటివెళుతూ ఇలా ప్రకటించాడు: “యెహోవా, దేవుడైన యెహోవా వాత్సల్యం, దయ గల దేవుడు. త్వరగా కోపపడేవాడు కాక అత్యంత కృప, సత్యం గలవాడు.

[7] వేలాదివేల మందికి కృప చూపుతూ అపరాధం, అతిక్రమం, పాపాలను క్షమించేవాడు, అయితే దోషులను శిక్షించకుండా ఉండేవాడు కాక, మూడు నాలుగు తరాలకు తండ్రుల పాప ఫలితం వారి సంతానంమీదికి రప్పించేవాడు.”

[8] మోషే త్వరపడి సాష్టాంగ నమస్కారాలు చేసి ఇలా అన్నాడు:

[9] “ప్రభూ, నీవు నన్ను దయ చూస్తూ ఉంటే నా మనవి ఆలకించు. ప్రభూ, మా మధ్యలో ఉండి మాతోకూడా రావాలి. ఇది తలబిరుసుగా ఉన్న ప్రజ – నిజమే గానీ మా అపరాధం, మా పాపం క్షమించు. మమ్ములను నీ సొత్తుగా స్వీకరించు.”

[10] అప్పుడు యెహోవా చెప్పినదేమిటంటే, “ఇప్పుడు నేను నీతో ఒడంబడిక చేస్తున్నాను. నీ ప్రజల ఎదుట నేను అద్భుత క్రియలు చేస్తాను. అలాంటి అద్భుతాలు ఏ ప్రజ మధ్య భూమిమీద ఎక్కడా జరగలేదు. నీవు ఏ ప్రజ మధ్య ఉన్నావో వారంతా యెహోవా చేసే క్రియ చూస్తారు. నేను నీతో చెయ్యబోయేది భయంకరమైనది.

[11] ఈ రోజున నేను నీకు ఆజ్ఞాపించేదాన్ని నీవు పాటించాలి. నేను మీ ఎదుటనుంచి అమోరీ, కనాను, హిత్తి, పెరిజ్జి యోబూసి జాతులవారిని వెళ్ళగొట్టివేస్తాను.

[12] మీరు వెళ్ళే దేశవాసులతో ఒడంబడిక చేసుకోకూడదు సుమా. చేసుకొంటే అది మీకు ఉరిగా ఉంటుంది.

[13] మీరు వాళ్ళ బలిపీఠాలను పడగొట్టాలి. వాళ్ళ విగ్రహాలను పగులగొట్టాలి. వాళ్ళ అషేరాదేవి స్తంభాలను నరికివేయాలి.

[14] మీరు వేరొక దేవునికి మొక్కకూడదు. యెహోవా అనే నేను రోషం గల దేవుణ్ణి, నా పేరు అదే.

[15] ఆ దేశవాసులతో ఒడంబడిక చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రజలు వారి దేవుళ్ళ విషయం వ్యభిచారుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఆ దేవుళ్ళకు బలులు సమర్పించేటప్పుడు ఎవరైనా ఒకరు నిన్ను పిలవవచ్చు. మీరు వారి బలి మాంసం తినకూడదు సుమా.

[16] మీరు మీ కొడుకులకు వారి కూతుళ్ళను పెళ్ళి చేయకూడదు. చేస్తే ఆ పిల్లలు తమ దేవుళ్ళను పూజించి మీ కొడుకులను ఆ దేవుళ్ళను పూజించేలా చేస్తారేమో జాగ్రత్త.

[17] “పోత పోసిన దేవుళ్ళను చేసుకోకూడదు.

[18] “మీరు పొంగని రొట్టెల పండుగ ఆచరించాలి. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం అబీబ్ నెలలో నియామక కాలంలో ఏడు రోజులు పొంగని రొట్టెలు తినాలి. అబీబ్ నెలలో మీరు ఈజిప్ట్‌నుంచి వచ్చారు గదా.

[19] “ప్రతి తొలిచూలు పిల్ల నాది. మీ పశువులలో తొలిచూలు ప్రతి మగదీ, అది దూడ గానీ పొట్టేలు గానీ, నాది.

[20] గొర్రెపిల్లను విడుదల వెలగా అర్పించి గాడిద తొలిపిల్లను విడిపించాలి. అలా చెయ్యడం మీకిష్టం లేకపోతే ఆ గాడిదపిల్ల మెడను విరగదీయాలి. మీ కొడుకులలో మొదట పుట్టినవాణ్ణి వెల ఇచ్చి విడిపించాలి. “నా సన్నిధానంలోకి వట్టి చేతులతో ఎవ్వరూ రాకూడదు.

[21] “ఆరు రోజులు మీరు పని చెయ్యాలి గాని, ఏడో రోజున విశ్రమించాలి. దున్నే కాలంలో, కోతకాలంలో కూడా ఏడో రోజున విశ్రమించాలి.

[22] “మీరు ‘వారాల పండుగ’, అంటే మొదటి గోధుమ కోత పండుగ ఆచరించాలి. సంవత్సరాంతంలో పంట కూర్చే పండుగ కూడా ఆచరించాలి.

[23] సంవత్సరానికి మూడు సార్లు పురుషులంతా ప్రభు సన్నిధానంలో అంటే ఇస్రాయేల్‌ప్రజల దేవుడైన యెహోవా సన్నిధిలో కనబడాలి.

[24] సంవత్సరానికి మూడు సార్లు మీరు మీ దేవుడైన యెహోవా సన్నిధానంలో కనబడడానికి వెళ్ళేటప్పుడు మీ భూమిని ఎవ్వరూ ఆశించరు. ఎందుకంటే మీ ఎదుటనుంచి నేను జనాలను వెళ్ళగొట్టి మీ సరిహద్దులు విశాలం చేస్తాను.

[25] “పొంగని రొట్టెతోపాటు నా బలి రక్తాన్ని అర్పించకూడదు. పస్కా పండుగలోని బలి మాంసం ఉదయంవరకు ఉంచకూడదు.

[26] “పొలం పంటలోని ప్రథమ ఫలంలో శ్రేష్ఠమైనదాన్ని మీ దేవుడైన యెహోవా నివాసానికి తేవాలి. “మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు.”

[27] యెహోవా మోషేతో, “ఇప్పుడు చెప్పిన ఈ మాటలు వ్రాసుకో. ఎందుకంటే, ఈ మాటలప్రకారం నేను నీతోనూ ఇస్రాయేల్ ప్రజతోనూ ఒడంబడిక చేశాను” అన్నాడు.

[28] మోషే నలభై రాత్రింబగళ్ళు యెహోవాతోకూడా అక్కడ ఉన్నాడు. అతడు భోజనం చెయ్యలేదు, నీళ్ళు త్రాగలేదు. అంతలో ఆ ఒడంబడిక వాక్కులు, అంటే పది ఆజ్ఞలు ఆ పలకలమీద వ్రాశాడు.

[29] మోషే శాసనాలున్న ఆ రెండు పలకలు చేతపట్టుకొని సీనాయి పర్వతం దిగివచ్చాడు. యెహోవా అతనితో మాట్లాడడంవల్ల అతని ముఖ చర్మం ప్రకాశించింది గాని పర్వతం దిగివస్తూ ఉన్న మోషేకు అది తెలియలేదు.

[30] అయితే అహరోను, ఇస్రాయేల్‌ప్రజలంతా మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మం ప్రకాశిస్తూ ఉంది. వారు అతనిదగ్గరికి రావడానికి భయపడ్డారు.

[31] మోషే వారిని పిలిచినప్పుడు అహరోను, సమాజ ప్రముఖులందరూ అతని దగ్గరకు మళ్ళీ వచ్చారు. మోషే వారితో మాట్లాడాడు.

[32] ఆ తరువాత ఇస్రాయేల్ ప్రజలంతా దగ్గరికి వచ్చారు. యెహోవా సీనాయి పర్వతంమీద తనతో చెప్పిన విషయాలన్నీ మోషే వారికి ఆజ్ఞాపించాడు.

[33] మోషే వారితో మాట్లాడడం ముగించాక తన ముఖంమీద ముసుకు వేసుకొన్నాడు.

[34] కానీ అతడు యెహోవాతో మాట్లాడడానికి ఆయన సన్నిధానంలోకి ప్రవేశించినప్పుడెల్లా ముసుకు తీసివేసి వెలుపలికి వచ్చేవరకు ముసుకు లేకుండా ఉన్నాడు. వెలుపలికి వచ్చినప్పుడు యెహోవా తనకు ఆజ్ఞాపించినదానిని అతడు ఇస్రాయేల్‌ప్రజలతో చెప్పేవాడు.

[35] ఇస్రాయేల్‌ప్రజలు మోషే ముఖ చర్మాన్ని చూచినప్పుడు అది ప్రకాశిస్తూ ఉంది గనుక తాను యెహోవాతో మాట్లాడడానికి లోపలికి ప్రవేశించేవరకూ మోషే తన ముఖంమీద ఆ ముసుకు వేసుకొనేవాడు.

నిర్గమకాండం (దాస్యవిముక్తి) — Chapters