[1] అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఇదిగో విను, నిన్ను ఫరోకు దేవుడుగా నియమించాను. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు.
[2] నేను నీకు ఆజ్ఞాపించేదంతా నీవు చెప్పాలి. ఫరో తన దేశంనుంచి ఇస్రాయేల్‌ప్రజను వెళ్ళనియ్యాలని నీ అన్న అహరోను అతనితో చెపుతాడు.
[3] ఫరో గుండె బండబారిపోయేలా నేను చేస్తాను. ఈజిప్ట్‌దేశంలో నా అద్భుతమైన సూచనలూ మహా క్రియలూ అనేకం చేస్తాను.
[4] అప్పుడు కూడా అతడు మీ మాట వినడు, గనుక నేను నా చెయ్యి ఈజిప్ట్‌మీద వేసి గొప్ప తీర్పు క్రియలు చేసి నా సేనలను, అంటే నా ప్రజ అయిన ఇస్రాయేల్‌వారిని ఈజిప్ట్‌దేశంనుంచి బయటికి తీసుకువస్తాను.
[5] నేనే ఈజిప్ట్‌మీద నా చెయ్యి చాపి వాళ్ళ మధ్యనుంచి ఇస్రాయేల్ ప్రజను బయటికి తీసుకువచ్చేటప్పుడు నేను యెహోవానని ఈజిప్ట్‌వాళ్ళు తెలుసుకొంటారు.”
[6] మోషే అహరోనులు తమకు యెహోవా ఆజ్ఞాపించినట్టే చేశారు.
[7] వారు ఫరోతో మాట్లాడిన కాలంలో మోషే ఎనభై ఏళ్ళవాడు, అహరోను ఎనభై మూడేళ్ళవాడు.
[8] యెహోవా మోషేతో, అహరోనుతో ఇలా అన్నాడు:
[9] “ఫరో మీతో ఏదైనా అద్భుతం చెయ్యమంటే, నీవు అహరోనుతో అతని చేతికర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమను. అది పామవుతుంది.”
[10] మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టే చేశారు. అహరోను ఫరో ఎదుటా అతడి పరివారం ఎదుటా తన చేతికర్రను పడవేసినప్పుడు అది పామయింది.
[11] అప్పుడు ఫరో జ్ఞానులనూ ఇంద్రజాలికులనూ పిలిపించాడు. ఈ ఈజిప్ట్ మాంత్రికులు కూడా తమ మంత్రవిద్య ద్వారా అహరోను చేసినట్టే చేశారు.
[12] వాళ్ళలో ప్రతి ఒక్కరూ తన చేతికర్ర పడవేసినప్పుడు అది పామయింది. అయితే అహరోను కర్ర వాళ్ళ కర్రలను మ్రింగివేసింది.
[13] అయినా ఫరో గుండె బండబారి పోయింది. యెహోవా చెప్పినట్టే, మోషే అహరోనుల మాట అతడు వినలేదు.
[14] తరువాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఫరో హృదయం కఠినం అయింది. అతడు ప్రజను వెళ్ళనియ్యడానికి ఒప్పుకోవడం లేదు.
[15] రేపు ప్రొద్దున్న ఫరో నది దగ్గరికి వెళ్తాడు. అప్పుడు నీవు అతని దగ్గరకు వెళ్ళు, పాముగా మారిన కర్రను చేతపట్టుకొని అతణ్ణి కలుసుకోవడానికి నది ఒడ్డున నిలబడు.
[16] నీవు అతనితో ఇలా అనాలి: ‘హీబ్రూవారి దేవుడైన యెహోవా నన్ను నీదగ్గరికి పంపాడు. ఆయన అంటున్నాడు – నా ప్రజ ఎడారిలో నన్ను ఆరాధించి సేవించడానికి వారిని వెళ్ళనియ్యి. ఇదివరకు నీవు నామాట వినలేదు.
[17] ఇప్పుడు యెహోవా చెప్పేదేమిటంటే, నేను యెహోవానని దీనివల్ల నీవు తెలుసుకొంటావు: ఇదిగో, నేను నా చేతిలో ఉన్న కర్రతో నది నీళ్ళను కొడతాను. అవి రక్తంగా మారుతాయి.
[18] నదిలో ఉన్న చేపలు చస్తాయి. నది కంపు కొడుతుంది. నది నీళ్ళు త్రాగడానికి ఈజిప్ట్‌వాళ్ళకు అసహ్యమనిపిస్తుంది.’”
[19] యెహోవా మోషేతో అన్నాడు, “నీవు అహరోనుతో ఇలా చెప్పు – ‘ఈజిప్ట్ నీళ్ళు రక్తం అయ్యేలా నీ కర్రను చేతపట్టుకొని వాటిమీద, అంటే వాళ్ళ నదులమీదా కాలువల మీదా చెరువులమీదా అన్ని జలధారలమీదా నీ చెయ్యి చాపు.’ ఈజిప్ట్‌దేశంలో అంతటా చెక్క తొట్లలోను రాతి పాత్రల్లోను సహా రక్తం ఉంటుంది.”
[20] యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే మోషే అహరోనులు చేశారు. ఫరో, అతడి పరివారమూ చూస్తుండగానే అహరోను తన కర్రను ఎత్తి నది నీళ్ళను కొట్టాడు. నది నీళ్ళంతా రక్తంగా మారింది.
[21] నదిలో ఉన్న చేపలు చచ్చాయి. నది కంపు కొట్టింది. ఆ నది నీళ్ళు ఈజిప్ట్‌వాళ్ళు త్రాగలేకపొయ్యారు. ఆ రక్తం ఈజిప్ట్‌దేశంలో అంతటా ఉంది.
[22] అయితే ఈజిప్ట్ మాంత్రికులు కూడా వాళ్ళ మంత్రవిద్య ద్వారా అదే పని చేశారు, గనుక యెహోవా చెప్పినట్టు ఫరో గుండె బండబారిపోయింది. అతడు వారి మాట వినలేదు.
[23] జరిగిన దాన్ని లక్ష్యపెట్టకుండా ఫరో తిరిగి తన భవనంలోకి వెళ్ళాడు.
[24] ఈజిప్ట్ వాళ్ళంతా నది నీళ్ళు త్రాగలేక త్రాగే నీళ్ళకోసం నదికి అటూ ఇటూ చెలమలు త్రవ్వుకొన్నారు.
[25] యెహోవా నదిని కొట్టి ఏడు రోజులయ్యాయి.