Skip to content
Opens in a new window

[1] యెహోవా ఈజిప్ట్‌దేశంలో మోషే అహరోనులతో ఇలా అన్నాడు:

[2] “నెలల్లో ఈ నెల మీకు మొదటిదిగా ఉండాలి, మీ సంవత్సరానికి మొదటి నెల అన్నమాట.

[3] మీరు ఇస్రాయేల్ సర్వసమాజంలో ఈ విధంగా చెప్పాలి – ఈ నెల పదో రోజున వారిలో ప్రతి ఒక్కరూ తన కుటుంబంకోసం ఒక గొర్రెపిల్లను గానీ మేకపిల్లను గానీ తీసుకోవాలి. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కదాన్ని తీసుకోవాలి.

[4] ఒక్క కుటుంబం దాన్నంతా తినలేనంత చిన్నదైతే అతడూ అతడి పొరుగువాడూ, తమ కుటుంబాల్లో ఉన్నవారి సంఖ్య ప్రకారం, దాన్ని తీసుకోవాలి. ఒక్కొక్క వ్యక్తి ఎంత తినగలుగుతాడో దాని ప్రకారం లెక్కపెట్టి ఆ జంతువును తీసుకోవాలి.

[5] అది లోపం లేనిదై ఏడాది మగదై ఉండాలి. గొర్రెల్లో నుంచి గానీ మేకల్లోనుంచి గానీ దాన్ని తీసుకోవచ్చు.

[6] ఈ నెల పద్నాలుగో రోజువరకు దాన్ని ఉంచాలి. ఆ రోజు సాయంకాల సమయంలో ఇస్రాయేల్ సమాజ సమూహమంతా వాటిని చంపాలి.

[7] “అప్పుడు జంతువు రక్తంలో కొంత తీసుకొని దాని మాంసం ఏ ఇంట్లో తింటారో ఆ ఇంటి గుమ్మం రెండు నిలువు కమ్ములమీదా పైకమ్మిమీదా పూయాలి.

[8] ఆ రాత్రే వారు దాన్ని కాల్చి ఆ మాంసం తినాలి. పొంగజేసే పదార్థం లేకుండా చేసిన రొట్టెతోను చేదు కూరాకులతోను దాన్ని తినాలి.

[9] మాంసం పచ్చిగా ఉన్న దేన్నీ తినకూడదు, నీళ్ళతో వండి తిననేకూడదు. దాన్నీ దానితో దాని తలనూ కాళ్ళనూ లోపలి భాగాలనూ కాల్చి తినాలి.

[10] మీరు దానిలో దేన్నీ తెల్లవారేవరకు మిగల్చకూడదు. ఒకవేళ తెల్లవారేవరకు దానిలో మిగిలినది ఏదైనా ఉంటే దాన్ని పూర్తిగా కాల్చివేయాలి.

[11] “మీరు దాన్ని తినవలసిన విధమేమంటే, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ చేతికర్రలను పట్టుకొని దాన్ని త్వరగా తినాలి. అది యెహోవాకు పస్కాబలి.

[12] ఆ రాత్రి నేను ఈజిప్ట్‌దేశం గుండా వెళ్తూ ఈ దేశంలో ఉన్న మనుషుల్లోను జంతువుల్లోను మొదట పుట్టిన సంతానాన్నంతా హతమారుస్తాను. ఈజిప్ట్‌వాళ్ళ దేవుళ్ళందరి విషయంలో తీర్పు తీరుస్తాను. నేను యెహోవాను.

[13] మీరున్న ఇండ్లకు ఆ రక్తం గుర్తుగా ఉంటుంది. నేను ఆ రక్తాన్ని చూచి మిమ్ములను దాటిపోతాను. నేను ఈజిప్ట్‌దేశాన్ని దెబ్బ తీసినప్పుడు నాశనకరమైన ఆ విపత్తు మీమీదికి రాదు.

[14] “ఈ రోజు మీకు జ్ఞాపకార్థంగా ఉండాలి. మీరు యెహోవాకు పండుగగా దాన్ని తరతరాలకు ఆచరిస్తూ ఉండాలి. ఇది ఎప్పటికీ నిలిచివుండే చట్టం.

[15] ఏడు రోజులపాటు మీరు పొంగజేసే పదార్థంలేని రొట్టెను తినాలి. మొదటి రోజున మీ ఇళ్ళలో పొంగచేసే పదార్థమంటూ లేకుండా చేయాలి. మొదటి రోజునుంచి ఏడో రోజువరకు ఎవరైనా సరే, పొంగజేసే పదార్థంతో చేసిన రొట్టెను తింటే ఆ వ్యక్తిని ఇస్రాయేల్‌ప్రజలో లేకుండా చేయాలి.

[16] ఆ మొదటి రోజున, ఆ ఏడో రోజున మీరు పవిత్రసభగా సమకూడాలి. ఆ రెండు రోజుల్లో అందరూ భోజనం సిద్ధం చేయవచ్చు గానీ వేరే పని ఏమీ చేయకూడదు.

[17] ఈ పొంగని రొట్టెల పండుగ మీరు ఆచరించాలి. ఎందుకంటే నేను మీ సేనలను ఈజిప్ట్‌దేశంనుంచి బయటికి తీసుకువచ్చే రోజు అదే. అందుచేత మీరు తరతరాలకూ ఈ రోజును ఆచరించాలి. ఇది ఎప్పటికీ నిలిచివుండే చట్టం.

[18] ఈ మొదటి నెల పద్నాలుగో రోజు సాయంకాల సమయంనుంచి ఇదే నెల ఇరవయ్యొకటో రోజు సాయంకాలంవరకు పొంగజేసే పదార్థంలేని రొట్టె మీరు తినాలి.

[19] ఏడు రోజులు మీ ఇండ్లలో పొంగజేసే పదార్థమేదీ ఉండకూడదు. పొంగజేసే పదార్థంతో చేసిన దాన్ని ఎవరైనా తింటే (అతడు మీ మధ్యలో నివసించే విదేశస్తుడు కానియ్యి, స్వదేశస్తుడు కానియ్యి), ఆ వ్యక్తిని ఇస్రాయేల్ సమాజంలో లేకుండా చేయాలి.

[20] మీరు పొంగజేసే పదార్థంతో చేసిన దేన్నీ తినకూడదు. మీ నివాసాలన్నిట్లో పొంగని రొట్టె తినాలి.”

[21] అప్పుడు మోషే ఇస్రాయేల్ ప్రజల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇలా చెప్పాడు: “మీరు మీ కుటుంబాలకోసం మందలోనుంచి గొర్రెపిల్లను గానీ మేకపిల్లను గానీ తీసుకొని పస్కాబలిని వధించండి.

[22] మీరు హిస్సోపు మొక్క గుబురు రెమ్మను తీసుకొని పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధానికి దాన్ని పూయాలి. తరువాత ఉదయంవరకు మీలో ఎవ్వరూ తలుపుగుండా బయటికి వెళ్ళకూడదు.

[23] ఈజిప్ట్‌వాళ్ళను సంహారం చేయడానికి యెహోవా ఈ దేశంగుండా వెళ్తూ ఉంటాడు. ఆయన ఆ ద్వారబంధం పైకమ్మిమీదా రెండు నిలువుకమ్ములమీదా ఉన్న రక్తం చూచి ఆ తలుపును దాటిపోతాడు. మీ ఇళ్ళలో ప్రవేశించడానికీ మిమ్ములను చంపడానికీ సంహారం చేసే దూతకు సెలవియ్యడు.

[24] అందుచేత మీరు ఈ ఆచారం అనుసరించాలి. ఇది మీకూ మీ సంతతివారికీ ఎప్పటికీ నిలిచివుండే చట్టం.

[25] తాను ఇచ్చిన వాగ్దానం ప్రకారం యెహోవా మీకు ప్రసాదించబోయే దేశంలో మీరు ప్రవేశించిన తరువాత మీరు ఈ ఆచారక్రియ ఆచరించాలి.

[26] అప్పుడు మీ పిల్లలు ‘ఈ ఆచారక్రియ భావమేమిటి?’ అని మిమ్ములను అడిగితే,

[27] మీరు ఇలా అనాలి: ‘ఇది యెహోవాకు పస్కాబలి. ఈజిప్ట్‌లో యెహోవా ఈజిప్ట్‌వాళ్ళను సంహారం చేసినప్పుడు ఇస్రాయేల్‌ప్రజల ఇండ్లను దాటిపోయాడు. మన ఇండ్లను కాపాడాడు.’”

[28] అది విని ప్రజలు తలలు వంచుకొని దేవుణ్ణి ఆరాధించారు. అప్పుడు ఇస్రాయేల్ ప్రజలు వెళ్ళి విధేయులయ్యారు; మోషేకూ అహరోనుకూ యెహోవా ఇచ్చిన ఆజ్ఞప్రకారమే వారు చేశారు.

[29] మధ్యరాత్రివేళ ఈజిప్ట్‌దేశంలో ఉన్న మొదటపుట్టిన సంతానాన్నంతా యెహోవా హతం చేశాడు. తన సింహాసనంమీద కూర్చుండే చక్రవర్తి మొదలుకొని చెరసాలలో ఉండే ఖైదీవరకు వాళ్ళకు మొదట పుట్టిన సంతానాన్నంతా, పశువుల తొలిపిల్లలను కూడా, సంహారం చేశాడు.

[30] ఆ రాత్రి చక్రవర్తి, అతడి సేవకులంతా, ఈజిప్ట్‌వాళ్ళంతా లేచారు. శవం లేని ఇల్లంటూ ఒక్కటీ లేదు, గనుక ఈజిప్ట్‌లో గొప్ప ఏడ్పు పుట్టింది.

[31] ఆ రాత్రి చక్రవర్తి మోషేనూ అహరోన్నూ పిలిపించి ఇలా అన్నాడు: “మీరూ ఇస్రాయేల్ ప్రజలంతా లేచి నా ప్రజల మధ్యనుంచి వెళ్ళిపోండి. మీరు కోరుకున్నట్టు యెహోవాను ఆరాధించి సేవించండి.

[32] మీరు చెప్పినట్టే మీ మందలనూ పశువులనూ తీసుకువెళ్ళిపోండి. నన్ను దీవించండి కూడా.”

[33] ఈజిప్ట్‌వాళ్ళు “మేమంతా చచ్చిపోతాం” అనుకొని ఇస్రాయేల్ ప్రజలను దేశంనుంచి త్వరగా వెళ్ళిపోండని వారిని బలవంతం చేశారు.

[34] ప్రజలు పొంగజేసే పదార్థం లేని తమ పిండిముద్దలనూ పిండి పిసికే పళ్ళేలనూ మూటకట్టుకొని తమ భుజాలపై పెట్టుకొన్నారు.

[35] అంతకుముందు ఇస్రాయేల్ ప్రజలు మోషే మాట ప్రకారం చేసి ఈజిప్ట్‌వాళ్ళ దగ్గర వెండి బంగారు నగలనూ వస్త్రాలనూ అడిగి తీసుకొన్నారు.

[36] ఈజిప్ట్‌వాళ్ళు ఇస్రాయేల్‌ప్రజలను దయచూచేలా యెహోవా చేశాడు గనుక వారేమేమి కోరారో వాటిని వారికిచ్చారు. ఈ విధంగా వారు ఈజిప్ట్‌వాళ్ళను దోచుకొన్నారు.

[37] అప్పుడు ఇస్రాయేల్‌ప్రజలు రామసేసునుంచి సుక్కోతు దిక్కుకు తరలివెళ్ళారు. పిల్లలు కాక కాలినడకన వెళ్ళిన పురుషులే ఆరు లక్షలమంది.

[38] అంతేకాకుండా వేరు వేరు జాతులవారు అనేకులు వారితో వచ్చారు. పెద్ద పెద్ద మందలూ గొప్ప పశుసంపదా కూడా వచ్చాయి.

[39] తరువాత, వారు ఈజిప్ట్‌నుంచి తెచ్చిన పిండి ముద్దలతో పొంగజేసే పదార్థం వేయకుండా రొట్టెలు కాల్చారు. ఆ పిండి ముద్దల్లో పొంగజేసే పదార్థం ఏమీ లేదు. తమను ఈజిప్ట్‌నుంచి వెళ్ళగొట్టడం జరిగినందుకు వ్యవధి లేకపోవడంచేత తమకోసం వేరే ఆహారం సిద్ధం చేసుకోలేదు.

[40] ఇస్రాయేల్ ప్రజలు ఈజిప్ట్‌లో నివసించిన కాలం నాలుగు వందల ముప్ఫయి సంవత్సరాలు.

[41] ఆ నాలుగు వందల ముప్ఫయి సంవత్సరాలు గడిచాక ఆ కాలం ముగిసిన రోజే ఈజిప్ట్‌దేశంనుంచి యెహోవా సేనలన్నీ తరలివెళ్ళాయి.

[42] ఆయన వారిని ఈజిప్ట్‌దేశంనుంచి తీసుకువచ్చిన రాత్రి యెహోవాకు జాగరణ చేయవలసిన రాత్రి గనుక ఇస్రాయేల్ ప్రజలందరూ తరతరాలకూ ఆ రాత్రి యెహోవాకు జాగరణ చేయవలసినదే.

[43] యెహోవా మోషే అహరోనులకు ఇలా చెప్పాడు: “పస్కాపండుగ బలి చట్టం ఇదే – పరాయివాడెవ్వడూ దాన్ని తినకూడదు.

[44] అయితే మీలో ఎవరైనా డబ్బిచ్చి కొనుక్కొన్న దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చు.

[45] కాని, విదేశీయులూ జీతానికి వచ్చిన పనివాళ్ళూ దాన్ని తినకూడదు.

[46] ఏ ఇంటివారు ఆ ఇంట్లోనే దాన్ని తినాలి. దాని మాంసంలో కొంచెమైనా ఇంట్లోనుంచి బయటికి తీసుకుపోకూడదు. దాని ఎముకల్లో ఒక్కటి కూడా విరువకూడదు.

[47] ఇస్రాయేల్ సమాజమంతా ఈ పండుగను ఆచరించాలి.

[48] మీ దగ్గర విదేశీయుడు నివసిస్తూ పస్కాపండుగను యెహోవాకు ఆచరించడానికి ఇష్టపడితే అతడి కుటుంబంలో ఉన్న ప్రతి మగవాడూ సున్నతి పొందాలి. ఆ తరువాత అతడు పండుగలో పాల్గొనవచ్చు. అలాంటివారు ఇస్రాయేల్‌దేశ పౌరుడితో సమానుడు. సున్నతి పొందనివాడైతే పస్కాబలి మాంసం తినకూడదు.

[49] మీ దేశంలో పుట్టినవాడికీ మీ మధ్యలో కాపురం చేసే విదేశస్తులకూ విధించిన చట్టం ఒకటే.”

[50] ఇస్రాయేల్‌ప్రజలంతా విధేయులయ్యారు. మోషే అహరోనులకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే వారు చేశారు.

[51] ఆ రోజే యెహోవా ఇస్రాయేల్ ప్రజలను వారి వారి సేనలతో ఈజిప్ట్‌దేశంనుంచి తీసుకువచ్చాడు.

నిర్గమకాండం (దాస్యవిముక్తి) — Chapters