[1] దేవుడు మోషే కోసమూ తన ఇస్రాయేల్‌ప్రజలకోసమూ చేసినదంతా – యెహోవా ఇస్రాయేల్‌ప్రజలను ఈజిప్ట్‌నుంచి రప్పించిన సంగతి – మోషే మామ యిత్రోకు వినవచ్చింది.
[2] అంతకుముందు మోషే తన భార్య సిప్పోరాను తన మామ యిత్రోదగ్గరికి పంపాడు (యిత్రో మిద్యానుదేశ యాజి). అతడు ఆమెనూ ఆమె ఇద్దరు కొడుకులనూ స్వీకరించాడు.
[3] మోషే “నేను అన్యదేశంలో పరాయివాణ్ణి” అంటూ ఒక కొడుక్కు గెర్షోం అనే పేరు పెట్టాడు,
[4] “నా తండ్రియొక్క దేవుడు నాకు తోడై ఫరో ఖడ్గంనుంచి నన్ను తప్పించాడు” అంటూ రెండోవాడికి ఎలియాజరు అనే పేరు పెట్టాడు.
[5] యిత్రో మోషే భార్యనూ అతని కొడుకులనూ వెంటబెట్టుకొని బయలుదేరాడు. ఎడారిలో, దేవుని పర్వతం దగ్గర మోషే మకాం చేసిన స్థలానికి చేరుకొన్నాడు.
[6] యిత్రో “నేను నీ మామ యిత్రోను. నీ భార్య, ఇద్దరు కొడుకులతోకూడా నీ దగ్గరికి వస్తున్నాను” అని మోషేకు కబురు పంపాడు.
[7] మోషే తన మామను కలుసుకోవడానికి వెళ్ళి అభివందనం చేసి అతణ్ణి ముద్దుపెట్టుకొన్నాడు. ఒకరినొకరు కుశలప్రశ్నలడిగి గుడారంలోకి వెళ్ళారు.
[8] యెహోవా ఇస్రాయేల్ ప్రజల కోసం ఈజిప్ట్‌వాళ్ళకూ ఫరోకూ చేసినదంతా మోషే తన మామకు తెలియజేశాడు. ప్రయాణంలో సంభవించిన కష్టాలన్నీ యెహోవా వాటిలోనుంచి వారిని విడిపించిన సంగతి కూడా తెలిపాడు.
[9] యెహోవా ఇస్రాయేల్ ప్రజను ఈజిప్ట్‌వాళ్ళ చేతిలోనుంచి విడిపించడంలో వారికి చేసిన మేలు అంతటికీ యిత్రో సంతోషించాడు.
[10] “ఈజిప్ట్‌వాళ్ళ చేతిలోనుంచీ ఫరో చేతిలోనుంచీ మిమ్ములను విడిపించిన యెహోవాకు స్తుతి కలుగుతుంది గాక! గర్వంతో ఈ ప్రజలపట్ల వ్యవహరించిన ఈజిప్ట్‌వాళ్ళ వశంలోనుంచి వీరిని విడిపించాడు.
[11] దేవుళ్ళందరికంటే యెహోవా గొప్పవాడని ఇప్పుడు నాకు తెలుసు” అని యిత్రో అన్నాడు.
[12] అప్పుడు మోషే మామ యిత్రో హోమ బలి, ఇతర బలులు దేవునికి సమర్పించాడు. అనంతరం అహరోను, ఇస్రాయేల్ ప్రజల పెద్దలంతా మోషే మామతో దేవుని సన్నిధానంలో భోజనం చేయడానికి వచ్చారు.
[13] మరుసటి రోజు మోషే ప్రజలకు న్యాయం తీర్చడానికి కూర్చున్నాడు. ఉదయంనుంచి సాయంకాలంవరకు ప్రజలు మోషే చుట్టూరా నిలుచున్నారు.
[14] మోషే ప్రజలకు చేసినదంతా అతని మామ చూచి “నువ్వు ఈ ప్రజలకు చేస్తున్నదేమిటి? ఉదయంనుంచి సాయంకాలంవరకు నువ్వొక్కడివే కూచుంటే ప్రజలంతా నీ చుట్టూరా నిలబడడం ఎందుకని?” అని అడిగాడు.
[15] అందుకు మోషే “దేవుని నిర్ణయమేదో విచారించి తెలుసుకోవడానికి ప్రజలు నాదగ్గరికి వస్తారు.
[16] వారికి కలహం ఏదైనా ఉంటే నాదగ్గరికి వస్తారన్నమాట. నేను వారి విషయం తీర్పు తీర్చి దేవుని శాసనాలూ చట్టాలూ వారికి తెలియజేస్తాను” అన్నాడు.
[17] మోషే మామ అతనికిలా బదులు చెప్పాడు: “నువ్వు అనుసరించిన ఈ పద్ధతి బాగా లేదు.
[18] ఈ పని నీకు ఎక్కువ కష్టంగా ఉంది. ఇది నువ్వొక్కడివే చేయలేవు. నువ్వూ నీదగ్గర ఉన్న ఈ ప్రజలూ తప్పక నలిగి నీరసించిపోతారు.
[19] నీకు సలహా చెపుతాను. నా మాట శ్రద్ధతో విను. దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు దేవుని ఎదుట ఈ ప్రజల ప్రతినిధిగా ఉండి వారి వ్యవహారాలు దేవునిదగ్గరికి తేవాలి.
[20] నువ్వు వారికి దేవుని శాసనాలూ చట్టాలూ బోధించాలి. వారు ఏం చెయ్యాలో, ఏ మార్గంలో నడవాలో వారికి తెలపాలి.
[21] అయితే దేవుడంటే భయభక్తులున్న సమర్థులను ప్రజలందరిలోనుంచి నువ్వు ఎన్నుకోవాలి. వారు యథార్థవంతులు, లంచాలను అసహ్యించుకొనేవారై ఉండాలి. అలాంటివారిని ప్రజలమీద నాయకులుగా నియమించాలి. వేయిమందికి ఒకడు, నూరుమందికి ఒకడు, యాభైమందికి ఒకడు, పదిమందికి ఒకడు ఉండాలి.
[22] వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయాధిపతులుగా ఉంటారు. వారు ముఖ్య వ్యాజ్యాలు నీదగ్గరికి తేవాలి, గానీ మామూలైన వాటిని వారే పరిష్కరించాలి. ఇలా వారు నీతోపాటు ఈ భారం వహిస్తారు; దానివల్ల నీభారం కొంచెం తేలిక అవుతుంది.
[23] ఈ విధంగా దేవుడు నీకు ఆదేశిస్తే, నువ్వు చేస్తే, నువ్వు క్రుంగిపోవు, ఈ ప్రజలంతా తమ నివాసాలకు క్షేమంగా వెళ్ళవచ్చు.”
[24] మోషే తన మామ మాట విని అతడు చెప్పినట్టెల్లా చేశాడు.
[25] ఇస్రాయేల్‌ప్రజలందరిలోనూ సమర్థులను ఎంచుకొని, వేయిమందికి ఒకణ్ణి, నూరుమందికి ఒకణ్ణి, యాభైమందికి ఒకణ్ణి, పదిమందికి ఒకణ్ణి నాయకులుగా నియమించి, వారికి ప్రజలమీద అధికారమిచ్చాడు.
[26] వారు ఎప్పుడూ ప్రజలకు న్యాయాధిపతులుగా ఉన్నారు. ముఖ్య వ్యాజ్యాలు వారు మోషేదగ్గరికి తెచ్చేవారు, గానీ మామూలైనవాటిని వారే పరిష్కరించేవారు.
[27] తరువాత మోషే తన మామను సాగనంపాడు. అతడు స్వదేశానికి వెళ్ళిపోయాడు.