Skip to content
Opens in a new window

[1] “ఒక వ్యక్తి ఎద్దును గానీ గొర్రెను గానీ దొంగిలించి అమ్మినా, వధించినా ఎద్దుకు అయిదు ఎద్దులనూ గొర్రెకు నాలుగు గొర్రెలనూ చెల్లు వేయాలి.

[2] దొంగ కన్నం వేస్తూ ఉన్నప్పుడు వాణ్ణి ఎవరైనా చావుదెబ్బ కొడితే అది నరహత్యగా లెక్కలోకి రాదు.

[3] కానీ ప్రొద్దు పొడిచాక వాణ్ణి చావుదెబ్బ కొట్టడం హత్యే అని భావించాలి. ప్రతిక్రియ తప్పక చెయ్యాలి. బ్రతికి ఉన్న దొంగకు ఏమీ లేకపోతే వాడు దొంగతనం చేసినందుచేత వాణ్ణి అమ్మివేయాలి.

[4] వాడు దొంగిలించినది – అది ఎద్దు కానీ గాడిద కానీ గొర్రె కానీ – ప్రాణంతో వాడిదగ్గర దొరికితే వాడు రెండంతలు చెల్లించాలి.

[5] “ఒక వ్యక్తి పొలంలో గానీ ద్రాక్ష తోటలో గానీ తన పశువును మేపనిస్తే అది ఇంకో వ్యక్తి పొలంలో మేస్తుందనుకోండి. అలాంటప్పుడు అతడు తన పొలంలోనుంచి గానీ ద్రాక్షతోటలో నుంచి గానీ మంచిదాన్ని ఆ నష్టానికి ఇవ్వాలి.

[6] “అగ్ని రగిలి ముళ్ళ కంపలు అంటుకోవడంవల్ల మరో వ్యక్తి పంట కుప్ప గానీ పొలంలో ఉన్న పైరు గానీ ఆ పొలం గానీ కాలిపోతే నిప్పు అంటించినవాడు ఆ నష్టాన్ని ఇవ్వాలి.

[7] “ఒక వ్యక్తి డబ్బు గానీ ఏదైనా వస్తువు గానీ జాగ్రత్త పెట్టడానికి తన పొరుగువాడికి అప్పగిస్తాడనుకోండి. దాన్ని ఆ మనిషి ఇంటినుంచి దొంగిలించడం జరిగితే, ఆ దొంగ దొరికాడా, వాడు దానికి రెండంతలు చెల్లించాలి.

[8] దొంగ దొరకని పక్షంలో ఆ ఇంటి యజమానే తన పొరుగువాడి దాన్ని చేజిక్కించుకొన్నాడో లేదో నిర్ణయించేందుకు అతడు దేవుని ప్రతినిధుల దగ్గరికి రావాలి.

[9] ప్రతి విధమైన విశ్వాసభంగం విషయంలో – అది ఎద్దు గురించి గానీ గాడిద గురించి గానీ గొర్రె గురించి గానీ బట్ట గురించి గానీ – పోయినదాన్ని చూచి ఎవడో ఒకడు ‘ఇది నాది’ అని చెపితే, దాని గురించి వ్యాజ్యమాడేవారు ఇద్దరూ న్యాయాధిపతుల దగ్గరకు రావాలి. వారు ఎవడిని దోషి అని తీర్పు తీరుస్తారో వాడు రెండోవాడికి రెండంతలు చెల్లించాలి.

[10] “ఒక వ్యక్తి గాడిదను గానీ ఎద్దును గానీ గొర్రెను గానీ మరి ఏ జంతువునైనా జాగ్రత్త పెట్టడానికి తన పొరుగువాడికి అప్పగిస్తాడనుకోండి. అది చచ్చినా, దెబ్బతిన్నా, వారు చూడకుండా ఎవరైనా దాన్ని తోలుకుపోయినా,

[11] తన పొరుగువాడు ఆ ఆస్తిని దుర్వినియోగం చేయలేదని యెహోవా పేరట శపథం చేస్తే చాలు. ఆ ఆస్తిదారుడు ఆ శపథం అంగీకరించాలి. ఆ నష్టాన్ని ఇవ్వడం అనవసరం.

[12] ఒకవేళ అతడి దగ్గరనుంచి దాన్ని ఎవరైనా దొంగిలిస్తే అతడు ఆ ఆస్తిదారుడికి నష్టం భర్తీ చెయ్యాలి.

[13] ఒకవేళ మృగాలు దాన్ని చీలిస్తే అతడు రుజువుకోసం దాన్ని తీసుకురావాలి. అలా చీలిపోయినదాని నష్టం పూర్తి చేయనక్కరలేదు.

[14] “ఒక వ్యక్తి తన పొరుగువాని దగ్గర ఏదైనా బదులు తీసుకొంటే, దాని యజమాని దానిదగ్గర లేనప్పుడు దానికి హాని కలిగినా, అది చచ్చినా ఆ వ్యక్తి దాని నష్టం తప్పకుండా పూర్తి చెయ్యాలి.

[15] దాని యజమాని దానితో ఉంటే దాని నష్టం భర్తీ చెయ్యనక్కరలేదు. అది అద్దెదైతే ఆ అద్దె దాని యజమానికి రావాలి.

[16] “పెళ్ళికి వాగ్దత్తం చేయని కన్యను ఒక వ్యక్తి మరులుకొలిపి ఆమెతో పోతే ఆమెకోసం కట్నం ఇచ్చి ఆమెను పెళ్ళి చేసుకోవాలి.

[17] ఆమె తండ్రి ఆమెను అతడికివ్వడానికి ఏమాత్రం ఒప్పుకోకపోతే అతడు కన్యల కట్నం ప్రకారం డబ్బివ్వాలి.

[18] “మంత్రకత్తెను బ్రతకనివ్వకూడదు.

[19] “జంతువులతో సంపర్కం చేసే ప్రతి ఒక్కరికీ మరణశిక్ష పడవలసిందే.

[20] “యెహోవాకు గాక వేరే దేవుడికి బల్యర్పణ చేసేవాడు నాశనానికి గురి అవుతాడు.

[21] “పరాయివారిని పీడించకూడదు, హింసించకూడదు. ఈజిప్ట్‌దేశంలో మీరు పరాయివారుగా ఉన్నారు గదా.

[22] “విధవరాలిని గానీ తండ్రిలేని పిల్లను గానీ బాధపెట్టకూడదు.

[23] వారు మీచేత ఏ విధంగానైనా బాధపడి నాకు ఆక్రందన చేస్తే వారి మొర నేను తప్పక వింటాను.

[24] నా కోపాగ్ని రగులుకొంటుంది. మిమ్ములను ఖడ్గంచేత చంపిస్తాను; మీ భార్యలు విధవరాళ్ళవుతారు, మీ పిల్లలు తండ్రి లేనివారవుతారు.

[25] “నా ప్రజల్లో మీదగ్గర ఉండే బీదవారిలో ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు అతడిపట్ల సాహుకారిలాగా వ్యవహరించకూడదు, అతడిదగ్గర వడ్డీ తీసుకోకూడదు.

[26] ఒకవేళ మీరెప్పుడైనా మీ పొరుగువాడి బట్టను తాకట్టుగా తీసుకుంటే, ప్రొద్దు క్రుంకేముందే దాన్ని అతడికి మళ్ళీ అప్పగించాలి.

[27] అతడు కప్పుకొనేది అదే. అదే అతడి శరీరానికి వస్త్రం. అతడు మరి ఏమి కప్పుకొని పడుకొంటాడు? అతడు నాకు మొర పెడితే నేను వింటాను. నేను దయగలవాణ్ణి.

[28] “దేవుణ్ణి దూషించకూడదు, మీ ప్రజల అధికారుల్లో ఎవరినీ శపించకూడదు.

[29] “మీ మొదటి కోతలోను ద్రాక్షరసంలోను నైవేద్యాలు అర్పించడానికి ఆలస్యం చెయ్యకూడదు. మీ కొడుకులలో మొదటివాణ్ణి నాకు ప్రతిష్ఠించాలి.

[30] అలాగే మీ ఎడ్లనూ మీ గొర్రెలనూ అర్పించాలి. మీరు ప్రతిష్ఠించిన జంతువు ఏడు రోజులు దాని తల్లిదగ్గర ఉండాలి. ఎనిమిదో రోజున దాన్ని నాకివ్వాలి.

[31] “మీరు నాకు పవిత్రమైనవారై ఉండాలి. గనుక పొలంలో మృగాలు చీల్చిన జంతువు మాంసం తినకుండా దాన్ని కుక్కలకు పారవెయ్యాలి.

నిర్గమకాండం (దాస్యవిముక్తి) — Chapters