Skip to content
Opens in a new window

[1] తరువాత ఇస్రాయేల్‌ప్రజల సమాజమంతా ఏలీంనుంచి ప్రయాణం సాగించి సీన్ ఎడారిలోకి వచ్చారు. సీన్ ఎడారి ఏలీంకూ సీనాయి పర్వతానికీ మధ్య ఉంది. వారు అక్కడ చేరింది ఈజిప్ట్‌దేశంనుంచి బయలుదేరి రెండో నెల పదిహేనో రోజు.

[2] ఆ ఎడారిలో ఇస్రాయేల్‌ప్రజల సమాజమంతా మోషేమీదా అహరోనుమీదా సణిగారు.

[3] ఇస్రాయేల్‌ప్రజ “ఈజిప్ట్‌దేశంలో మాంసంతో నిండిన కుండలదగ్గర మేము కూచున్నాం, కడుపునిండా భోంచేశాం. అప్పుడు యెహోవా చేతిలో మేము చనిపోయి ఉంటే ఎంతో బాగుండేది! ఈ సమాజమంతటినీ ఆకలిచేత చంపడానికి మీరు మమ్మల్ని ఎడారిలోకి తీసుకువచ్చారు!” అని వారితో అన్నారు.

[4] అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నేను మీకోసం ఆకాశంనుంచి ఆహారాన్ని కురిపించబోతున్నాను. ప్రతి రోజూ ప్రజలు వెళ్ళి ఆ రోజుకు చాలినంత సేకరించాలి. వారు నా ఉపదేశం ప్రకారం మెలగుతారో లేదో ఈ విధంగా వారిని పరిశోధిస్తాను.

[5] ఆరో రోజున వారు రెండింతలు సేకరించి తెచ్చి సిద్ధం చేయాలి.”

[6] మోషే అహరోనులు ఇస్రాయేల్‌ప్రజలందరికీ ఇలా చెప్పారు: “ఈజిప్ట్‌దేశంనుంచి మిమ్ములను తెచ్చినది యెహోవాయే అని ఈ సాయంకాల సమయంలో మీరు తెలుసుకొంటారు.

[7] రేపు ప్రొద్దున మీరు యెహోవా మహిమాప్రకాశం చూస్తారు. మీరు తనమీద సణగడం యెహోవా విన్నాడు. మీరు సణగడం యెహోవా మీదే గాని మామీద కాదు. మేము ఏపాటివారం?”

[8] మోషే ఇంకా అన్నాడు, “మీరు తినడానికి సాయంకాలాన మాంసమూ ప్రొద్దున ఆహారమూ యెహోవా మీకిచ్చేటప్పుడు మీరు ఇది తెలుసుకొంటారు. మీరు ఆయనమీద సణగడం యెహోవా వింటున్నాడు. మేము ఏపాటివారం? మీరు సణిగేది యెహోవామీదే గాని మామీద కాదు.”

[9] మోషే అహరోనుతో “ఇస్రాయేల్‌ప్రజల సమాజమంతటితో ఇలా చెప్పు: యెహోవా మీ సణుగులు విన్నాడు, గనుక యెహోవా సన్నిధానానికి రండి” అన్నాడు.

[10] ఇస్రాయేల్‌ప్రజల సమాజమంతటితో అహరోను మాట్లాడుతూ ఉండగానే వాళ్ళు ఎడారివైపు చూశారు. అప్పుటి కప్పుడే యెహోవా మహిమాప్రకాశం ఆ మేఘంలో కనిపించింది.

[11] యెహోవా మోషేతో ఇలా అన్నాడు:

[12] “ఇస్రాయేల్‌ప్రజల సణుగులు నాకు వినిపించాయి. వారితో ఈ విధంగా చెప్పు: సాయంకాలం మీరు మాంసం తింటారు; ప్రొద్దున ఆహారం కడుపునిండా తింటారు; యెహోవా అనే నేనే మీ దేవుడనని ఆ విధంగా మీరు తెలుసుకొంటారు.”

[13] అలానే జరిగింది. సాయంకాల సమయంలో పూరేడు పిట్టలు వచ్చి వారి శిబిరాన్ని కమ్మాయి. ప్రొద్దున శిబిరం చుట్టూ మంచు ఉంది.

[14] ఆ మంచు ఇంకిపొయ్యాక, ఎడారిలో నేలమీద సన్నని పొరలలాంటిదేదో కనిపించింది. అది నేలమీద గడ్డగట్టిన పొడి మంచంత సన్ననిది.

[15] దాన్ని ఇస్రాయేల్ ప్రజలు ఒకడితో ఒకడు, “అదేమిటి?” అని అడిగారు. అదేమిటో వారికి బొత్తిగా తెలియదు.

[16] మోషే వారితో “తినడానికి యెహోవా మీకిచ్చిన ఆహారం ఇదే. యెహోవా ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు: ప్రతి ఒక్కరు తన అక్కర ప్రకారం దాన్ని సేకరించాలి. తన గుడారంలో ఉంటున్న వారికోసం, ఒక్కొక్క వ్యక్తికి రెండేసి లీటర్లు సేకరించాలి.”

[17] ఇస్రాయేల్ ప్రజలు అలా చేశారు; కొందరు ఎక్కువగా, కొందరు తక్కువగా సేకరించారు.

[18] వారు లీటర్ల ప్రకారం కొలిచినప్పుడు ఎక్కువగా సేకరించినవారికి ఏమీ మిగలలేదు. తక్కువగా సేకరించినవారికి కొరత ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ తన అక్కర మేరకు దాన్ని సేకరించారు.

[19] మోషే వారితో “ఉదయంవరకు మీరు దానిలో ఏమీ మిగల్చుకోకూడదు” అన్నాడు.

[20] కానీ మోషే మాట వినకుండా కొంతమంది ఉదయంవరకు దానిలో కొంత మిగుల్చుకొన్నారు. అయితే అది పురుగులు పట్టి కంపుకొట్టింది. మోషేకు వారిమీద కోపం వచ్చింది.

[21] గనుక ప్రతి ఒక్కరూ తమ అక్కర ప్రకారం ప్రతి రోజూ ప్రొద్దున దాన్ని సేకరించారు. ఎండ ఎక్కువైనప్పుడు అది కరిగిపోయింది.

[22] ఆరో రోజున వారు ఒక్కొక్కరికి రెండంతలుగా – నాలుగు లీటర్లు – ఆహారం సేకరించారు. సమాజ నాయకులంతా మోషే దగ్గరికి వచ్చి ఈ సంగతి తెలియజేశారు.

[23] అతడు “యెహోవా చెప్పినది ఇదే: రేపు విశ్రాంతి దినం, యెహోవాకు ఆచరించవలసిన పవిత్ర విశ్రాంతి దినం. మీరు కాల్చాలనుకొన్నది కాల్చండి, ఉడకబెట్టి వండాలనుకొన్నది వండండి. మిగిలినది అంతా ఉదయంవరకు మీకోసం ఉంచండి” అని వారితో చెప్పాడు.

[24] మోషే ఇచ్చిన ఆదేశం ప్రకారం ఉదయంవరకు వారు అలా ఉంచారు; అది కంపు కొట్టలేదు. దానికి పురుగులు పట్టలేదు.

[25] అప్పుడు మోషే అన్నాడు, “ఈవేళ అది తినండి. ఈ రోజు యెహోవాకు ఆచరించవలసిన విశ్రాంతి దినం. ఈవేళ అది వెలుపట దొరకదు.

[26] మీరు ఆరు రోజులే దాన్ని సేకరించాలి. ఏడో రోజు విశ్రాంతి దినం. ఆ రోజు అది దొరకదు.”

[27] అయితే ఏడో రోజున జరిగినదేమిటంటే, ప్రజల్లో కొంతమంది దాన్ని సేకరించడానికి బయటికి వెళ్ళారుగాని వారికేమీ దొరకలేదు.

[28] అందుచేత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “మీరు నా ఆజ్ఞలనూ నా ఉపదేశాన్నీ పాటించడం ఎంతకాలం తిరస్కరిస్తారు?

[29] ఇదిగో వినండి. యెహోవా విశ్రాంతిదినం మీకిచ్చాడు. గనుక ఆరో రోజున రెండు రోజుల ఆహారమిస్తున్నాడు. ఏడో రోజున ప్రతి ఒక్కరూ తన స్థలంలోనే ఉండాలి. ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు.”

[30] అందుచేత ఏడో రోజున ప్రజలు విశ్రమించారు.

[31] ఇస్రాయేల్‌ప్రజలు ఆ పదార్థానికి మన్నా అనే పేరు పెట్టారు. అది ధనియాలలాగా, తెల్లగా ఉంది. దాని రుచి తేనెతో కలిపిన పిండి వంటకంలాంటిది.

[32] మోషే ఇలా అన్నాడు: “యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, దానితో ఓమెర్ పట్టే పాత్రను నింపి తరతరాలకూ మీ సంతతివారి కోసం దాన్ని ఉంచాలి. ఎందుకంటే నేను మిమ్ములను ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చి, ఎడారిలో మీకు ప్రసాదించిన ఆహారాన్ని వారు చూడాలి.”

[33] మోషే అహరోనుతో “ఒక జాడీని తీసుకొని అందులో ఓమెర్ మన్నాను పెట్టి మీ సంతతివారి కోసం తరతరాలుగా దాన్ని యెహోవా సన్నిధానంలో ఉంచాలి.”

[34] యెహోవా మోషేకిచ్చిన ఆజ్ఞప్రకారం అహరోను చేశాడు. తరువాత అది భద్రంగా ఉండాలని శాసనాలుండే స్థలం ఎదుట దాన్ని పెట్టాడు.

[35] తాము నివసించవలసిన దేశానికి చేరేవరకూ ఇస్రాయేల్ ప్రజలు నలభై ఏళ్ళు మన్నా తింటూ వచ్చారు. కనానుదేశం సరిహద్దులకు చేరేవరకు మన్నా తినేవాళ్ళు.

[36] (ఓమెర్ అంటే తూములో పదో భాగం.)

నిర్గమకాండం (దాస్యవిముక్తి) — Chapters