Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:57

[1] నువ్వు మొర్రపెట్టినప్పుడు నిన్ను ఆదుకున్నవాడు ఎవరైనా ఉంటారా? పరిశుద్ధ దూతల్లో ఎవరి వైపు నువ్వు చూస్తావు?

[2] తమ నికృష్ట స్థితిని బట్టి దుఃఖించడం వల్ల మూర్ఖులు నశిస్తారు. బుద్ధిహీనులు తమ అసూయ చేత మరణిస్తారు.

[3] మూర్ఖుడు వేరు పారడం నేను కనుగొన్నాను. అయితే వెంటనే అతని నివాసస్థలం శాపగ్రస్థమైనదని తెలుసుకున్నాను.

[4] అతని పిల్లలకు క్షేమం దూరం అవుతుంది. గుమ్మాల దగ్గరే వాళ్ళు నశించిపోతారు. వాళ్ళను విడిపించేవాడు ఎవ్వరూ లేరు.

[5] ఆకలితో ఉన్నవాళ్ళు అతని పంటను తినివేస్తారు. ముళ్ళ పొదల్లో ఉన్నదాని నుండి కూడా వాళ్ళు దోచుకుంటారు. వాళ్ళ ఆస్తి కోసం తహతహలాడే వాళ్ళు దాన్ని మింగేస్తారు.

[6] దుమ్ము నుండి కష్టాలు పుట్టవు. భూమిలోనుండి బాధ మొలవదు.

[7] నిప్పురవ్వలు పైకి ఎగిసినట్టు మనుషులు బాధలు అనుభవించడానికే పుడుతున్నారు.

[8] అయితే నేను నా దేవుడి ఆశ్రయం కోరేవాణ్ణి. నా సంగతులు దేవునికే అప్పగించే వాణ్ణి.

[9] ఆయన ఘనమైన అద్భుత కార్యాలు చేసేవాడు. ఆ ఆశ్చర్య క్రియలు లెక్కకు మించినవి.

[10] ఆయన భూమి మీద వానలు కురిపిస్తాడు. పంట పొలాల మీద నీళ్లు ప్రవహింపజేస్తాడు.

[11] ఆ విధంగా ఆయన దీనులను ఉన్నతమైన స్థలాల్లో ఉంచుతాడు. దుఃఖపడే వాళ్ళకు ఊరట కలిగిస్తాడు.

[12] వంచకులు చేసే కుట్రలు నెరవేరకుండా వాళ్ళ ఆలోచనలు భగ్నం చేస్తాడు.

[13] దేవుడు జ్ఞానుల యుక్తి మూలంగానే వాళ్ళను పట్టుకుంటాడు. కపట క్రియలు జరిగించేవాళ్ళ తలంపులు తారుమారు చేస్తాడు.

[14] వెలుగు ఉండే సమయంలో వాళ్లను చీకటి కమ్ముకుంటుంది. ఒకడు రాత్రిలో తడుములాడినట్టు వాళ్ళు మధ్యాహ్న సమయంలో తడుములాడతారు.

[15] బలాఢ్యుల నోటి నుంచి వచ్చే కత్తిలాంటి మాటల బారి నుండి, వాళ్ళ చేతి నుండి ఆయన దరిద్రులను రక్షిస్తాడు.

[16] కాబట్టి పేదవాళ్ళకు ఆశాభావం కలుగుతుంది. అన్యాయానికి నోరు మూతబడుతుంది.

[17] దేవుడు ఎవరిని గద్దించి శిక్షకు పాత్రునిగా చేస్తాడో వాడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడైన దేవుని క్రమశిక్షణకు విధేయత చూపించు.

[18] ఆయన గాయాలు రేపుతాడు, ఆయనే బాగు చేస్తాడు. ఆయన దెబ్బ తీస్తాడు, తన చేతులతో ఆయనే స్వస్థపరుస్తాడు.

[19] ఆరు కష్టాలు కలిగినప్పుడు వాటి నుండి నిన్ను విడిపిస్తాడు. ఏడు కష్టాలు వచ్చినా నీకు ఏ అపాయం కలుగదు.

[20] కరువుకాటకాల వల్ల కలిగే మరణం నుండి, యుద్ధ సమయంలో కత్తివాత నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు.

[21] దూషణ మాటల వల్ల కలిగే అవమానం నుండి నిన్ను తప్పిస్తాడు. నీపై వినాశనం విరుచుకుపడినా నువ్వు దానికి భయపడవు.

[22] కరువులు, ప్రళయాలు వచ్చినా నువ్వు వాటిని లక్ష్యపెట్టవు. క్రూర మృగాలకు నీవు భయపడవు.

[23] నీ పొలంలోని రాళ్ళతో కూడా నీవు ఒప్పందం చేసుకుంటావు. అడవి జంతువులతో సఖ్యంగా ఉంటావు.

[24] నువ్వు నివసించే నీ గుడారం క్షేమకరమని నువ్వు తెలుసుకుంటావు. నీ గొర్రెల దొడ్డిలోకి వెళ్తే ఒక్కటి కూడా తప్పిపోలేదని గ్రహిస్తావు.

[25] నీ సంతానం విస్తరిస్తుందనీ, నీ వారసులు భూమి మీద పచ్చికలాగా వృద్ధి చెందుతారనీ నీకు నిశ్చయత కలుగుతుంది.

[26] ధాన్యం పనలను కళ్ళానికి మోసుకు పోయినట్టు నిండు వృద్ధాప్యంలో నువ్వు సమాధికి చేరతావు.

[27] ఈ విషయాలన్నీ మేము తరచి తరచి పరిశీలించాం. ఇవన్నీ వాస్తవాలు. నీకు ఉపయోగపడే ఈ మాటలన్నీ జాగ్రత్తగా విని అర్థం చేసుకో.

యోబు — Chapters