Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:53

[1] అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు.

[2] శక్తి లేని వాడికి నువ్వు ఎంత బాగా సహాయం చేశావు! బలం లేని చేతిని ఎంత బాగా రక్షించావు!

[3] జ్ఞానం లేని వాడికి నీ వెంత చక్కగా ఆలోచన చెప్పావు! సంగతిని ఎంత చక్కగా వివరించావు!

[4] నువ్వు ఎవరి ఎదుట మాటలు పలికావు? ఎవరి ఆత్మ నీలోనుండి బయలుదేరింది?

[5] బిల్దదు ఇలా అన్నాడు. జలాల కింద నివసించే వారు, మృతులు, నీడలు వణికిపోతారు.

[6] దేవుని దృష్టికి పాతాళం తెరిచి ఉంది. నాశనకూపం ఆయన ఎదుట బట్టబయలుగా ఉంది.

[7] ఉత్తర దిక్కున శూన్యమండలం మీద ఆకాశ విశాలాన్ని ఆయన పరిచాడు. శూన్యంపై భూమిని వేలాడదీశాడు.

[8] ఆయన తన కారు మేఘాల్లో నీళ్లను బంధించాడు. అయినా అవి పిగిలి పోవడం లేదు.

[9] దాని మీద మేఘాన్ని వ్యాపింపజేసి ఆయన తన సింహాసన కాంతిని కప్పి ఉంచాడు.

[10] వెలుగు చీకటుల మధ్య సరిహద్దుల దాకా ఆయన జలాలకు హద్దు నియమించాడు.

[11] ఆయన గద్దించగా ఆకాశ విశాల స్తంభాలు ఆశ్చర్యపడి అదిరిపోతాయి.

[12] తన బలం వలన ఆయన సముద్రాన్ని రేపుతాడు. తన వివేకం వలన రాహాబును నలగగొడతాడు.

[13] ఆయన ఊపిరి వదలగా ఆకాశ విశాలాలకు అందం వస్తుంది. ఆయన హస్తం పారిపోతున్న మహా సర్పాన్ని పొడిచింది.

[14] ఇవి ఆయన కార్యాల్లో స్వల్పమైనవి. ఆయన్ను గూర్చి మనకు వినబడుతున్నది ఎంతో మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే గదా. గర్జనలు చేసే ఆయన మహాబలం ఎంతో గ్రహించగలవాడెవడు?

యోబు — Chapters