Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:08

[1] అప్పుడు నయమాతీయుడు జోఫరు ఇలా జవాబు చెప్పాడు,

[2] నువ్వు అలా చెప్పినందువల్ల నాలో కలిగిన ఆత్రుత నీకు తగిన జవాబు చెప్పాలని తొందర చేస్తున్నది.

[3] నన్ను అవమానపరిచే నింద నీ నుండి వినవలసి వచ్చింది గనుక తెలివిగల నా మనసు జవాబు చెప్పేందుకు నన్ను పురిగొల్పుతున్నది.

[4] ఆదిలో మనుషులు భూమి మీద నివసించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇలాగే జరుగుతున్నదని నీకు తెలియదా?

[5] దుర్మార్గులకు దక్కే విజయం అశాశ్వితం. భక్తిహీనులకు లభించే సంతోషం క్షణకాలం మాత్రం ఉండేది.

[6] వాళ్ళ గొప్పదనం ఆకాశం కన్నా ఎత్తుగా ఎదిగి, మేఘాల కంటే ఎత్తుగా తలెత్తుకుని తిరగవచ్చు.

[7] అయితే వాళ్ళ మలం లాగా వాళ్ళు ఎప్పటికీ కనబడకుండా కనుమరుగైపోతారు. అంతకు ముందు వాళ్ళను చూసిన వాళ్ళు “వాళ్ళంతా ఏమయ్యారు?” అని అడుగుతారు.

[8] కల లాగా వాళ్ళు కరిగి పోయి మళ్ళీ కనబడకుండా పోతారు. రాత్రివేళ వచ్చే కలలాగా వాళ్ళు చెదరిపోతారు.

[9] వాళ్ళను చూసిన కళ్ళు ఇకపై వాళ్ళను చూడవు. అతని నివాసం అతన్నిక చూడదు.

[10] వాళ్ళ సంతతి వాళ్ళు కనికరించమని దరిద్రులను వేడుకుంటారు. వారి చేతుల్లో ఉన్న ఆస్తిని తిరిగి ఇచ్చివేస్తారు.

[11] వాళ్ళ ఎముకల్లో యవ్వన శక్తి నిండి ఉన్నప్పటికీ అది కూడా వాళ్ళతో కలసి మట్టిలో నిద్రిస్తుంది.

[12] చెడుతనం వాళ్ళ నోటికి తియ్యగా ఉంది. వాళ్ళ నాలుకల కింద దాన్ని దాచి ఉంచారు.

[13] దాన్ని జాగ్రత్త చేసుకుని తమలోనే ఉంచుకున్నారు. తమ నోట్లోనే భద్రం చేసుకున్నారు.

[14] అయితే వాళ్ళ కడుపులో ఉన్నదంతా పులిసిపోతుంది. వాళ్ళ శరీరంలో అది నాగుపాము విషంగా మారుతుంది.

[15] వాళ్ళు దిగమింగిన ధనాన్ని ఇప్పుడు కక్కివేస్తారు. దేవుడే వాళ్ళ కడుపులోనుండి కక్కివేసేలా చేస్తాడు.

[16] వాళ్ళు కట్లపాముల విషం లోపలికి పీల్చుకునేవాళ్ళు. నాగుపాము కోరలు వాళ్ళను చంపివేస్తాయి.

[17] తేనెధారలు, వెన్నపూస ఏరులై పారుతున్నప్పటికీ వాళ్ళు సంతోషించరు.

[18] వాళ్ళు సంపాదించిన ఆస్తి మేరకు కష్టాలు పెరుగుతాయి. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నదంతా అనుభవించకుండానే తిరిగి అప్పగిస్తారు.

[19] వాళ్ళు దరిద్రులపై దాడులు చేసి విడిచిపెట్టినవాళ్ళు. తమవి కాని ఇళ్ళను బలవంతంగా ఆక్రమించుకుంటారు. ఆ ఇళ్ళను కట్టి పూర్తి చేయరు.

[20] వాళ్ళు తమ అత్యాశతో సంపాదించుకున్న ఇష్టమైన వస్తువుల్లో ఒక దానితోనైనా తమను తాము కాపాడుకోలేరు.

[21] వాళ్ళు దిగమింగిన వాటిలో ఏదీ మిగలడం లేదు. అందువల్ల వాళ్ళ క్షేమ స్థితి నిలబడదు.

[22] వాళ్ళు మితిలేని సంపాదన కలిగి ఉన్న రోజుల్లో ఇబ్బందులకు గురౌతారు. ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళందరూ వాళ్ళపై దాడి చేస్తారు.

[23] వాళ్ళు తమ కడుపు నింపుకునే సమయంలో దేవుడు వాళ్ళ మీద తన కోపాగ్ని కురిపిస్తాడు. వాళ్ళు తినే సమయంలోనే అది కురుస్తుంది.

[24] ఇనప ఆయుధం నుండి తప్పించుకొనేందుకు పారిపోతున్నప్పుడు ఇత్తడి విల్లు నుండి బాణం వాళ్ళ దేహాల్లోకి దూసుకుపోతుంది.

[25] ఆ బాణం వాళ్ళ దేహాలను చీల్చివేసి శరీరం నుండి బయటకు వస్తుంది. దాన్ని బయటకు తీసినప్పుడు కాలేయం తుత్తునియలు అవుతుంది. మరణభయం వాళ్ళ మీదికి వస్తుంది.

[26] వాళ్ళ ధన సంపదలు చీకటిమయం అవుతాయి. ఎవ్వరూ రాజేయకుండానే అగ్ని లేచి వాళ్ళను మింగివేస్తుంది. వాళ్ళ గుడారాల్లో మిగిలినదాన్ని అది కాల్చివేస్తుంది.

[27] వాళ్ళ దోషాలకు ఆకాశం సాక్షిగా నిలబడుతుంది. భూమి వారిపై తిరగబడుతుంది.

[28] వాళ్ళ ఇళ్ళకు చేరిన సంపాదన కనబడకుండా పోతుంది. దేవుని ఉగ్రత దినాన అదంతా నాశనమౌతుంది.

[29] దేవుని దగ్గర నుంచి దుష్టులైన మనుషులకు ప్రాప్తించేది ఇదే. దేవుడు వాళ్ళకు నియమించే వారసత్వం ఇదే.

యోబు — Chapters