[1] అప్పుడు ఎలీహు మళ్ళీ ఇలా చెప్పసాగాడు.
[2] జ్ఞానులారా, నా మాటలు వినండి. అనుభవశాలులారా, వినండి.
[3] అంగిలి ఆహారాన్ని రుచి చూసినట్టు చెవి మాటలను పరీక్షిస్తుంది.
[4] న్యాయమైనదేదో విచారించి చూద్దాం రండి. మేలైనదేదో మనంతట మనం విచారించి తెలుసుకుందాము రండి.
[5] “నేను నీతిమంతుణ్ణి, దేవుడు నాకు అన్యాయం చేసాడు.
[6] నేను న్యాయవంతుడినైనా అబద్ధికునిగా చూస్తున్నారు. నేను తిరుగుబాటు చేయకపోయినా నాకు మానని గాయం కలిగింది” అని యోబు అంటున్నాడు.
[7] యోబులాంటి మానవుడెవరు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారాన్ని పానం చేస్తున్నాడు.
[8] అతడు చెడుతనం చేసే వారికి మిత్రుడయ్యాడు. భక్తిహీనుల చెలికాడు అయ్యాడు.
[9] మనుషులు దేవునితో సహవాసం చేయడం వారికేమాత్రం ప్రయోజనకరం కాదని అతడు చెప్పుకుంటున్నాడు.
[10] విజ్ఞానం గల మనుషులారా, నా మాట ఆలకించండి దేవుడు అన్యాయం చేయడం అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యం చేయడం అసంభవం.
[11] మనుషుల క్రియలకు తగినట్టుగా ఆయన వారికి ప్రతిఫలం ఇస్తాడు అందరికీ ఎవరి మార్గాలను బట్టి వారికి ఫలమిస్తాడు.
[12] దేవుడు ఏ మాత్రం దుష్కార్యం చేయడు. సర్వశక్తుడు న్యాయం తప్పడు.
[13] ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టాడా? ఎవడైనా సర్వప్రపంచ భారాన్ని ఆయనకు అప్పగించాడా?
[14] ఆయన తన మనస్సు తన దగ్గరే ఉంచుకున్నట్టయితే, తన ఆత్మను, ఊపిరినీ తన దగ్గరికి తిరిగి తీసుకుంటే,
[15] శరీరులంతా ఒక్కపెట్టున నశిస్తారు. మనుషులు మళ్ళీ ధూళిగా మారిపోతారు.
[16] కాబట్టి దీన్ని విని వివేచించు, నా మాటలు ఆలకించు.
[17] న్యాయాన్ని ద్వేషించేవాడు లోకాన్ని ఏలుతాడా? న్యాయసంపన్నునిపై నేరం మోపుతావా?
[18] నువ్వు పనికిమాలిన వాడివని రాజుతోనైనా, మీరు దుష్టులని ప్రధానులతోనైనా అనవచ్చా?
[19] రాజుల పట్ల పక్షపాతం చూపని వాడితో పేదలకన్నా ధనికులను ఎక్కువగా చూడని వాడితో అలా పలకవచ్చా? వారందరూ ఆయన నిర్మించినవారు కారా?
[20] వారు నిమిషంలో చనిపోతారు. అర్థరాత్రి వేళ ప్రజలు కల్లోలం పాలై నాశనమౌతారు. బలవంతులను తీసుకు పోవడం జరుగుతుంది, అయితే అది మానవ హస్తాల వలన కాదు.
[21] ఆయన దృష్టి మనుషుల మార్గాల మీద ఉంది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు.
[22] చెడు కార్యాలు చేసే వారు దాక్కోడానికి చీకటైనా మరణాంధకారమైనా లేదు.
[23] ఒక మనిషిని న్యాయవిమర్శలోకి తీసుకు రాక ముందు అతణ్ణి ఎక్కువ కాలం విచారణ చేయడం దేవుడికి అవసరం లేదు.
[24] విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలం చేస్తున్నాడు. వారి స్థానంలో ఇతరులను నియమిస్తున్నాడు.
[25] వారి క్రియలను ఆయన తెలుసుకుంటున్నాడు. రాత్రివేళ ఇలాటి వారిని ఆయన కూలదోస్తాడు. వారు నాశనమై పోతారు.
[26] అందరూ చూస్తుండగానే దుష్టులను వారి దుర్మార్గాన్ని బట్టి నేరస్తులను శిక్షించినట్టు ఆయన శిక్షిస్తాడు.
[27] ఎందుకంటే వారు ఆయనను అనుసరించడం మానుకున్నారు. ఆయన ఆజ్ఞల్లో దేన్నీ లక్ష్య పెట్టలేదు.
[28] పేదల మొరను ఆయన దగ్గరికి వచ్చేలా చేశారు. దీనుల మొర ఆయనకు వినబడేలా చేశారు.
[29] ఆయన మౌనంగా ఉండిపోతే తీర్పు తీర్చగలవాడెవడు? ఆయన తన ముఖాన్ని దాచుకుంటే ఆయనను చూడగలవాడెవడు? ఆయన జాతులనైనా వ్యక్తులనైనా ఒకే విధంగా పరిపాలిస్తాడు.
[30] భక్తిహీనులు రాజ్యపాలన చేయకుండా, వారు ప్రజలను ఇకపై చిక్కించుకోకుండా ఆయన చేస్తాడు.
[31] ఒకడు “నేను దోషినే, కానీ ఇకపై పాపం చేయను.
[32] నాకు తెలియని దాన్ని నాకు నేర్పించు. నేను పాపం చేశాను. ఇకపై చేయను” అని దేవునితో చెప్పాడనుకో,
[33] దేవుడు చేస్తున్నది నీకు నచ్చడం లేదు గనక అలాటి మనిషిని దేవుడు శిక్షిస్తాడు అనుకుంటున్నావా? నేను కాదు, నువ్వే నిశ్చయించుకోవాలి. కాబట్టి నీకు తెలిసినది చెప్పు.
[34] వివేచన గలవారు, జ్ఞానంతో నా మాట వినేవారు నాతో ఇలా అంటారు.
[35] యోబు తెలివితక్కువ మాటలు పలుకుతున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి.
[36] యోబు దుష్టులవలె మాట్లాడుతున్నాడు గనక అతనిపై సునిశితమైన విచారణ జరిగితే ఎంత బాగుంటుంది!
[37] అతడు తన పాపానికి తోడుగా ద్రోహం సమకూర్చుకుంటున్నాడు. మన ఎదుట ఎగతాళిగా చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు కుప్పగా పోస్తున్నాడు.