Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:00

[1] అందుకు తేమానీయుడు ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు.

[2] ఎవరైనా ఈ విషయం గురించి నీతో మాట్లాడితే నీకు చిరాకు కలుగుతుందా? అయితే నీతో మాట్లాడకుండా నిదానంగా ఎవరు ఉంటారు?

[3] నువ్వు చాలా మందికి బుద్ధినేర్పించావు. అనేకమంది నిస్సహాయులను బలపరిచావు.

[4] దారి తప్పిన వాళ్ళను నీ మాటలతో ఆదుకున్నావు. మోకాళ్లు సడలిన వాళ్ళను బలపరిచావు.

[5] అయితే ఇప్పుడు నీకు కష్టం కలిగినప్పుడు దుఃఖంతో అల్లాడుతున్నావు. నీకు కలిగిన కష్టం వల్ల తల్లడిల్లిపోతున్నావు.

[6] నీకున్న భక్తి నీలో ధైర్యం కలిగించదా? నిజాయితీ గల ప్రవర్తన నీ ఆశాభావానికి ఆధారం కాదా?

[7] జ్ఞాపకం చేసుకో, నీతిమంతుడు ఎప్పుడైనా నాశనం అయ్యాడా? నిజాయితీపరులు ఎక్కడైనా తుడిచి పెట్టుకుపోయారా?

[8] నాకు తెలిసినంత వరకు దుష్టత్వాన్ని దున్ని, కీడు అనే విత్తనాలు చల్లే వాళ్ళు ఆ పంటనే కోస్తారు.

[9] దేవుడు గాలి ఊదినప్పుడు వాళ్ళు నశించిపోతారు. ఆయన కోపాగ్ని రగిలినప్పుడు వాళ్ళు లేకుండాా పోతారు.

[10] సింహాల గర్జనలు, క్రూరసింహాల గాండ్రింపులు ఆగిపోతాయి. కొదమసింహాల కోరలు విరిగిపోతాయి.

[11] తిండి లేకపోవడం చేత ఆడ సింహాలు నశించిపోతాయి. సింహపు కూనలు చెల్లాచెదరైపోతాయి.

[12] నాకొక రహస్యం తెలిసింది. ఒకడు గుసగుసలాడుతున్నట్టు అది నా చెవికి వినబడింది.

[13] మనుషులకు రాత్రివేళ గాఢనిద్ర పట్టే సమయంలో వచ్చే కలవరమైన కలలో అది వచ్చింది.

[14] నాకు భయం వణుకు కలిగింది. అందువల్ల నా ఎముకలన్నీ వణికిపోయాయి.

[15] ఒకడి ఊపిరి నా ముఖానికి తగిలింది. నా శరీరం పై వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి.

[16] ఒక రూపం నా కళ్ళెదుట నిలిచింది. నేను దాన్ని గుర్తు పట్టలేకపోయాను. మెల్లగా వినిపించే ఒక స్వరం విన్నాను. ఆ స్వరం “దేవుని సన్నిధిలో అపవిత్రులు నీతిమంతులవుతారా?

[17] తమ సృష్టికర్త ఎదుట ఒకడు పవిత్రుడౌతాడా?” అంటుంది.

[18] తన సేవకుల పట్ల ఆయనకు నమ్మకం పోయింది. తన దూతల్లోనే ఆయన తప్పులు వెతుకుతున్నాడు.

[19] అలాంటిది బంకమట్టి ఇళ్ళలో నివసించే వాళ్ళలో, మట్టిలో పుట్టిన వాళ్ళలో, చిమ్మెట చితికిపోయేలా చితికిపొయే వాళ్ళలో ఇంకెన్ని తప్పులు ఆయన చూస్తాడు!

[20] ఉదయం నుండి సాయంత్రం మధ్యకాలంలో వాళ్ళు ముక్కలైపోతారు. ఎవరూ గుర్తించకుండానే వాళ్ళు శాశ్వతంగా నాశనమైపోతారు.

[21] వాళ్ళ డేరాల తాళ్ళు పెరికివేస్తారు. వాళ్ళు బుద్ధి తెచ్చుకోకుండానే మరణమైపోతారు. నేడు ఆ విధంగానే జరుగుతుంది గదా.

యోబు — Chapters