Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:55

[1] సర్వశక్తుడు దుష్టులను శిక్షించే నియామక కాలాలను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయనను ఎరిగినవారు ఆయన తీర్పు దినాలను ఎందుకు చూడడం లేదు?

[2] సరిహద్దు రాళ్లను తీసేసే వారు ఉన్నారు. వారు అక్రమం చేసి మందలను ఆక్రమించుకుని తమ గడ్డి భూముల్లో వాటిని ఉంచుకుంటారు.

[3] వారు తండ్రి లేని వారి గాడిదను తోలేస్తారు. విధవరాలి ఎద్దును తాకట్టు పెట్టుకుంటారు.

[4] వారు అవసరంలో ఉన్న వారిని తమ దారుల్లో నుండి తప్పిస్తారు. దేశంలోని పేదలు వారి కంటబడకుండా దాక్కోవలసి వచ్చింది.

[5] అరణ్యంలోని అడవి గాడిదలు తిరిగినట్టు పేదలు బయలుదేరి ఆహారం కోసం వెతుకులాడతారు. ఎడారిలో వారి పిల్లలకు ఆహారం దొరుకుతుంది.

[6] పొలంలో వారు తమ కోసం గడ్డి కోసుకుంటారు. దుష్టుల ద్రాక్షతోటల్లో పరిగ ఏరుకుంటారు.

[7] బట్టలు లేక రాత్రి అంతా పడుకుని ఉంటారు. చలిలో కప్పుకోడానికి ఏమీ లేక అలా పడి ఉంటారు.

[8] పర్వతాల మీది జల్లులకు తడుస్తారు. ఆశ్రయం లేనందువల్ల బండను కౌగలించుకుంటారు.

[9] తండ్రి లేని పిల్లను తల్లి రొమ్ము నుండి లాగేసే వారు ఉన్నారు. వారు దరిద్రుల దగ్గర తాకట్టు పుచ్చుకుంటారు.

[10] దరిద్రులు కట్టు బట్టలు లేక తిరుగులాడుతారు. ఆకలితో ఇతరుల పనలను మోసుకుంటూ పోతారు.

[11] వారు తమ యజమానుల ప్రహరీ లోపల నూనె గానుగలు ఆడిస్తారు. ద్రాక్ష గానుగలను తొక్కుతూ, తాము మాత్రం దాహంతో ఉంటారు.

[12] పట్టణంలో మనుషులు మూలుగుతూ ఉంటారు. క్షతగాత్రులు మొర పెడుతూ ఉంటారు. కానీ దేవుడు వారి ప్రార్థనలు పట్టించుకోడు.

[13] ఈ దుష్టులు కొందరు వెలుగు మీద తిరుగుబాటు చేస్తారు. వారు దాని మార్గాలను గుర్తించరు. దాని త్రోవల్లో నిలవరు.

[14] తెల్లవారే సమయంలో హంతకుడు బయలు దేరుతాడు. వాడు పేదలను, అవసరంలో ఉన్న వారిని చంపుతాడు. రాత్రివేళ వాడు దొంగతనం చేస్తాడు.

[15] వ్యభిచారి ఏ కన్నైనా తనను చూడదనుకుని తన ముఖానికి ముసుకు వేసుకుని సందె చీకటి కోసం కనిపెడతాడు.

[16] దుర్మార్గులు చీకట్లో కన్నం వేస్తారు. పగలు దాక్కుంటారు. వారు వెలుగును చూడరు.

[17] ఉదయం వారి దృష్టిలో దట్టమైన అంధకారం. గాఢాంధకార భయాలు వారికి ఏమీ ఇబ్బందిగా అనిపించవు.

[18] వారు జలాల మీద తేలికగా కొట్టుకు పోతారు. వారి స్వాస్థ్యం భూమి మీద శాపగ్రస్థం. ద్రాక్షతోటల దారిలో వారు ఇకపై నడవరు.

[19] అనావృష్టి మూలంగా వేడిమి మూలంగా మంచు, నీళ్లు ఆవిరై పోయేలా పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది.

[20] వారిని కన్న గర్భమే వారిని మరిచి పోతుంది. పురుగు వారిని కమ్మగా తినివేస్తుంది. వారు మరి ఎన్నడూ జ్ఞాపకంలోకి రారు. చెట్టు విరిగి పడిపోయినట్టు దుర్మార్గులు పడిపోతారు.

[21] వారు గొడ్రాళ్ళను దిగమింగుతారు. వితంతువులకు మేలు చేయరు.

[22] ఆయన తన బలం చేత బలవంతులను కాపాడుతున్నాడు. కొందరు ప్రాణంపై ఆశ వదులుకున్నా మళ్ళీ బాగవుతారు.

[23] తమకు భద్రత ఉందిలే అని వారు అనుకునేలా ఆయన చేస్తాడు. దాన్ని బట్టి వారు సంతోషంగా ఉంటారు. కానీ ఆయన కళ్ళు వారి మార్గాల మీద ఉన్నాయి.

[24] వారు ఘనత పొందినా కొంతసేపటికి లేకుండా పోతారు. వారు హీనస్థితిలోకి వెళ్ళిపోయి మిగతా వాళ్ళ లాగానే కొట్టుకుపోతారు. పక్వం అయిన వెన్నుల్లాగా వారిని కోసివేయడం జరుగుతుంది.

[25] ఇప్పుడు ఇలా జరగక పోతే నేను అబద్ధికుడినని ఎవరు రుజువు చేస్తారు? నా మాటలు విలువ లేనివని చూపించేది ఎవరు?

యోబు — Chapters