[1] వెండికి గని ఉంది. బంగారం పుటం వేసే స్థలం ఉంది.
[2] ఇనుమును భూమిలోనుండి తీస్తారు. రాళ్లు కరగించి రాగి తీస్తారు.
[3] మనిషి చీకటిని అంతమొందిస్తాడు. సుదూర స్థలాల్లో అన్వేషిస్తాడు. గాఢాంధకారంలో అంతు తెలియని తావుల్లో విలువైన రాళ్ళను వెతుకుతాడు.
[4] మనుషుల నివాసాలకు, మనిషి పాదాలు సంచరించే స్థలాలకు దూరంగా అతడు సొరంగం తవ్వుతాడు. అక్కడ అతడు మానవులకు దూరంగా ఇటు అటు తిరుగులాడుతుంటాడు.
[5] భూమి విషయానికొస్తే అందులోనుండి ఆహారం పుడుతుంది. భూగర్భం అగ్నిమయం.
[6] దాని రాళ్లు నీలరతనాల పుట్టిల్లు. దాని ధూళిలో బంగారం ఉంది.
[7] వేటాడే ఏ పక్షికైనా ఆ దారి తెలియదు. డేగ కళ్ళు దాన్ని చూడలేదు.
[8] గర్వంగా సంచరించే మృగాలు ఆ దారి తొక్కలేదు. క్రూర సింహం ఆ దారిలో నడవలేదు.
[9] మనిషి చెకుముకి రాళ్ళను పట్టుకుంటాడు. పర్వతాలను వాటి కుదుళ్లతో సహా బోర్లా పడదోస్తాడు.
[10] శిలల్లో అతడు కాలువలు ఏర్పరుస్తాడు. అతని కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూస్తుంది.
[11] నీళ్లు పొర్లి పోకుండా జలధారలకు ఆనకట్ట కడతాడు. అగోచరమైన వాటిని అతడు వెలుగులోకి తెస్తాడు.
[12] అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది?
[13] మనిషికి దాని విలువ తెలియదు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు.
[14] అగాధం “అది నాలో లేదు” అంటుంది. “నా దగ్గర లేదు” అని సముద్రం అంటుంది.
[15] బంగారం దానికి సాటి కాదు. దాని వెల కట్టడానికి వెండిని తూచడం పనికి రాదు.
[16] అది ఓఫీరు బంగారంతోగానీ ప్రశస్తమైన గోమేధికంతో, నీలంతోగానీ కొనగలిగింది కాదు.
[17] సువర్ణమైనా స్ఫటికమైనా దానితో సాటిరావు. ప్రశస్తమైన బంగారు నగలు ఇచ్చి దాన్ని తీసుకోలేము.
[18] పగడాల, ముత్యాల పేర్లు దాని ఎదుట అసలు ఎత్తకూడదు. నిజంగా జ్ఞానానికున్న విలువ కెంపుల కన్నా గొప్పది.
[19] కూషు దేశపు పుష్యరాగం దానికి సాటి రాదు. మేలిమి బంగారంతో దానికి వెల కట్టలేము.
[20] అలాగైతే జ్ఞానం ఎక్కడనుండి వస్తుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది?
[21] అది జీవులందరి కన్నులకు కనిపించదు. ఆకాశ పక్షులకు అది అగమ్యగోచరం.
[22] “మేము మా చెవులతో దాన్ని గురించి విన్నాము” అని నాశనం, మరణం అంటాయి.
[23] దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తాడు. దాని స్థలం ఆయనకే తెలుసు.
[24] ఆయన భూమి కొనల వరకూ చూస్తున్నాడు. ఆకాశం కింద ఉన్న దానినంతటినీ చూస్తున్నాడు.
[25] గాలికి ఇంత వేగం ఉండాలని ఆయన నియమించినప్పుడు, జలరాసుల కొలత నిర్ణయించినప్పుడు,
[26] వర్షానికి అదుపాజ్ఞలు ఏర్పరచినప్పుడు, ఉరుము మెరుపులకు దోవ చూపినప్పుడు,
[27] ఆయన జ్ఞానాన్ని చూసి దాన్ని ప్రకటించాడు. దాన్ని స్థాపించి దాన్ని పరిశోధించాడు.
[28] యెహోవా పట్ల భయభక్తులే జ్ఞానం, దుష్టత్వం నుండి తొలగిపోవడమే వివేకం అని ఆయన మనుషులకు చెప్పాడు.