Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:16

[1] నా ప్రాణం సొమ్మసిల్లిపోయింది. నేను బ్రతికే రోజులు ముగిసిపోయాయి. నాకోసం సమాధి సిద్ధంగా ఉంది.

[2] ఎగతాళి చేసేవాళ్ళు నా చుట్టూ చేరారు. నా సమక్షంలోనే వాళ్ళు వివాదాలు రేకెత్తిస్తున్నారు.

[3] దేవా, దయచేసి నువ్వే నాకు పూచీకత్తు ఉంటానని మాట ఇవ్వు. నువ్వు కాక ఇంకెవరు నాకు జామీనుగా ఉంటారు.

[4] నువ్వు వాళ్ళ హృదయాలను మూసివేసి జ్ఞానహీనులుగా చేశావు. కనుక వాళ్ళు ఎలాంటి ఘనతా పొందరు.

[5] దోపిడీ సొమ్ము కోసం తన స్నేహితులను నిందించేవాడి పిల్లల కళ్ళు మసకబారతాయి.

[6] ఆయన నన్ను మనుషులందరికీ ఒక సామెతలాగా నిలబెట్టాడు. నలుగురూ నా ముఖం మీద ఉమ్మివేస్తారు.

[7] అధికమైన శోకం వల్ల నా కంటి చూపు మందగించింది. నా అవయవాలన్నీ నీడలాగా మారిపోయాయి.

[8] యథార్థవంతులు దీన్ని చూసి ఆశ్చర్యపోతారు. నిజాయితీపరులు భక్తిహీనుల స్థితిని చూసి కలవరం చెందుతారు.

[9] అయితే నీతిమంతులు తమ మార్గాన్ని విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగుతారు. నిరపరాధులు అంతకంతకూ వృద్ది చెందుతారు.

[10] అప్పుడు మీరంతా మరోసారి నా దగ్గరికి రండి, మీలో ఒక్క జ్ఞాని కూడా నాకు కనిపించడు.

[11] నా రోజులు ముగిసిపోయాయి. నా తలంపులు వ్యర్ధమైపోయాయి. నా హృదయంలోని కోరికలు భగ్నం అయ్యాయి.

[12] రాత్రి సమయాన్ని పగలు అనీ, చీకటి కమ్మినప్పుడు అది వెలుగు అనీ వాళ్ళు వాదిస్తారు.

[13] నాకు ఆశ ఏదైనా ఉన్నట్టయితే అది మృత్యులోకం నాకు ఇల్లు కావాలని. చీకటిలో నా పడక సిద్ధం చేసుకోవాలని.

[14] గొయ్యిని చూసి ‘నువ్వే నాకు తండ్రివి’ అనీ, పురుగును చూసి ‘నువ్వే నాకు తల్లివి, చెల్లివి’ అనీ వాటితో చెప్పాలని ఉంది.

[15] అలాంటప్పుడు నాకు నిరీక్షణకు ఆధారం ఏమిటి? దాన్ని ఎవరు కనుగొనగలరు?

[16] అది నాతోబాటు మృత్యులోకం అడ్డకమ్ముల దగ్గరికి దిగిపోతుందా? నాతో కలసి మట్టిలో కలసిపోతుందా?”

యోబు — Chapters