[1] అడవిలోని కొండమేకలు ఈనే కాలం నీకు తెలుసా? లేళ్లు పిల్లలు పెట్టే కాలం నువ్వు గ్రహించగలవా?
[2] అవి కడుపుతో ఉండే నెలలెన్నో నువ్వు లెక్క పెట్టగలవా? అవి ఈనే కాలం తెలుసా?
[3] అవి వంగి తమ పిల్లలను కంటాయి. వాటి పురిటి నొప్పులు తీరుతాయి.
[4] వాటి పిల్లలు పుష్టిగా పర్రల్లో పెరుగుతాయి. అవి తల్లులను విడిచిపెట్టి పోయి మళ్లీ వాటి దగ్గరికి తిరిగి రావు.
[5] అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? గంతులు వేసే గాడిద కట్లు విప్పిన వాడెవడు?
[6] నేను అడివిని దానికి ఇల్లుగాను ఉప్పుపర్రను దానికి నివాసస్థలంగాను నియమించాను.
[7] పట్టణపు రణగొణధ్వనులను చూసి అది తిరస్కారంగా నవ్వుతుంది. తోలేవాడి అదిలింపులు అది వినదు.
[8] పర్వతాల వరుస దానికి మేతభూమి. అన్ని రకాల పచ్చని మొలకలను అది వెతుక్కుంటుంది.
[9] అడివి దున్న నీకు సంతోషంగా ఊడిగం చేస్తుందా? అది నీ కొట్టంలో ఉండడానికి ఒప్పుకుంటుందా?
[10] పగ్గం వేసి అడివి దున్నను నాగలి దున్నించ గలవా? దాన్ని తోలుకుపోయి పల్లాలను చదును చేయించగలవా?
[11] అది మహా బలిష్ఠమైనదని దాన్ని నువ్వు నమ్ముతావా? చెయ్యమని దానికి నీ పని అప్పగిస్తావా?
[12] అది నీ ధాన్యాన్ని ఇంటికి తెస్తుందని దానిపై ఆధారపడతావా? కళ్ళంలో ఉన్న ధాన్యాన్ని అది పోగు చేస్తుందని నమ్ముతావా?
[13] నిప్పుకోడి గర్వంగా రెక్కలు ఆడిస్తుంది. కానీ అవి ప్రేమపూర్వకమైన రెక్కలా, ఈకలా?
[14] లేదు సుమా, అది దాని గుడ్లు నేలపై పెడుతుంది. ఇసుకే వాటిని పొదుగుతుంది.
[15] దేని పాదమైనా వాటిని తొక్కుతుందని అయినా, అడవిజంతువు ఏదైనా వాటిని చితకగొడుతుందేమోనని అయినా అది మర్చిపోతుంది.
[16] తన పిల్లలు తనవి కానట్టు వాటి పట్ల అది కఠినంగా ఉంటుంది. దాని కష్టం వ్యర్థమైపోయినా దానికి చింత లేదు.
[17] దేవుడు దాన్ని తెలివిలేనిదిగా చేశాడు. ఆయన దానికి వివేచనాశక్తి ఇవ్వలేదు.
[18] అది వడిగా పరిగెత్తితే గుర్రాన్ని, దానిపై స్వారీ చేసే వాణ్ణి చూసి హేళనగా నవ్వుతుంది.
[19] గుర్రానికి నువ్వు బలం ఇచ్చావా? జూలు వెంట్రుకలతో దాని మెడను నువ్వే కప్పావా?
[20] మిడతవలె అది కదం తొక్కేలా చేశావా? దాని సకిలింపు ధ్వని భీకరం.
[21] అది కాలు దువ్వి తన బలాన్నిబట్టి రేగిపోతుంది. అది ఆయుధాలను ఎదుర్కోడానికి ముందుకు దూకుతుంది.
[22] అది భయాన్ని వెక్కిరిస్తుంది. హడలిపోదు. కత్తిని చూసి వెనక్కి తగ్గదు.
[23] దాని వీపుపై అంబుల పొది, తళతళలాడే ఈటెలు బల్లేలు గలగలలాడినప్పుడు,
[24] పట్టరాని కోపంతో అది పరుగులు పెడుతుంది. అది భేరీనాదం విని ఉరకలు వేస్తుంది.
[25] బాకా ధ్వని వినబడినప్పుడెల్లా అది హుంకరిస్తుంది. దూరం నుండి యుద్ధవాసన పసిగడుతుంది. సేనాధిపతుల సింహనాదాలను, కదనఘోషను వింటుంది.
[26] డేగ నీ జ్ఞానం చేతనే ఎగురుతుందా? అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కుకు చాస్తుందా?
[27] గరుడ పక్షి నీ ఆజ్ఞకు లోబడే ఆకాశవీధి కెక్కుతుందా? తన గూడును ఎత్తయిన చోట కట్టుకుంటుందా?
[28] అది కొండశిఖరాలపై నివసిస్తుంది. కొండకొనపై ఎవరూ ఎక్కలేని చోట గూడు కట్టుకుంటుంది.
[29] అక్కడ నుండి తన ఎరను వెతుకుతుంది. దాని కళ్ళు దాన్ని దూరం నుండి కనిపెడతాయి.
[30] దాని పిల్లలు రక్తం తాగుతాయి. హతులైనవారు ఎక్కడ ఉంటారో అక్కడే అది ఉంటుంది.