Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:45

[1] నేను నా కన్నులతో ఒప్పందం చేసుకున్నాను గనక కన్యను కోరికతో ఎలా చూస్తాను?

[2] అలా చేస్తే పైనున్న దేవుని ఆజ్ఞ ఏమౌతుంది? ఉన్నత స్థలంలో ఉన్న సర్వశక్తుని వారసత్వం ఏమౌతుంది?

[3] ఆపద అనేది దుర్మార్గులకేననీ, విపత్తు దుష్టత్వం జరిగించే వారికేననీ నేను భావించే వాణ్ణి.

[4] ఆయనకు నా ప్రవర్తన తెలుసు గదా. ఆయన నా అడుగు జాడలన్నిటినీ లెక్కబెడతాడు గదా.

[5] అబద్ధికుడినై నేను తిరుగులాడి ఉన్నట్టయితే, మోసం చేయడానికి నా కాలు వేగిరపడినట్టయితే,

[6] నా యథార్థతను తెలుసుకునేందుకు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచు గాక.

[7] నేను న్యాయ మార్గం విడిచి నడచినట్టయితే, నా మనస్సు నా కళ్ళను అనుసరించి నడిచినట్టయితే మాలిన్యం ఏదైనా నా చేతులకు తగిలినట్టయితే,

[8] నేను విత్తనం చల్లి పండించిన దాన్ని వేరొకడు భుజించనియ్యండి. నా పంటను పెరికి వేయనియ్యండి.

[9] నేను హృదయంలో పరస్త్రీని మోహించినట్టయితే, నా పొరుగువాడి వాకిట్లో అతని భార్య కోసం నేను పొంచి ఉన్నట్టయితే,

[10] నా భార్య వేరొకడి తిరుగలి విసరు గాక. ఇతరులు ఆమెను అనుభవిస్తారు గాక.

[11] అది భయంకరమైన నేరం. అది న్యాయాధిపతుల చేత శిక్షనొందదగిన నేరం.

[12] అది నాశనకూపం వరకూ దహించే అగ్నిహోత్రం. అది నా పంట కోత అంతటినీ నిర్మూలం చేస్తుంది.

[13] నా సేవకుడైనా దాసి అయినా నాతో వ్యాజ్యెమాడి న్యాయం కోసం చేసిన విన్నపం నేను నిర్లక్ష్యం చేస్తే,

[14] దేవుడు లేచి నాపై తప్పు మోపినప్పుడు నేనేమి చేస్తాను? ఆయన విచారణకై వచ్చినప్పుడు నేను ఆయనకు ఏమి ప్రత్యుత్తరం ఇస్తాను?

[15] గర్భంలో నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టించ లేదా? గర్భంలో నన్నూ వారినీ కూడా రూపొందించినవాడు ఒక్కడే గదా.

[16] పేదలు కోరిన దాన్ని నేను బిగబట్టినట్టయితే, ఏడుపు మూలంగా వితంతువుల కళ్ళు క్షీణింపజేసినట్టయితే,

[17] తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెమైనా తిననియ్యక నేనొక్కడినే భోజనం చేస్తే,

[18] (నేను అలా చేయలేదు, నా యవ్వనప్రాయం మొదలు తండ్రి లేనివాడు నన్నొక తండ్రిగా భావించి నా దగ్గర పెరిగాడు. నా తల్లి కడుపున పుట్టింది మొదలు నేను అతని తల్లికి, ఆ వితంతువుకు దారి చూపించాను).

[19] ఎవరైనా బట్టల్లేక చావడం నేను చూస్తే, పేదలకు వస్త్రం లేకపోవడం నేను చూస్తే,

[20] వారి హృదయాలు నన్ను దీవించక పోతే, వారు నా గొర్రెల బొచ్చు చేత వెచ్చదనం పొందక పోయినట్టయితే,

[21] ఊరి రచ్చబండ దగ్గర అంతా నన్ను సమర్థిస్తారులే అని తండ్రిలేని వారి పై నేను చెయ్యి ఎత్తితే,

[22] నా భుజం ఎముక దాని గూటి నుండి జారిపోతుంది గాక. నా చేతి ఎముక దాని కీలు దగ్గర విరిగిపోతుంది గాక.

[23] దేవుడి నుండి ఆపద వస్తుందని నాకొక భయం ఉంది. ఆయన మహాత్మ్యం కారణంగా ఇలాంటివేమీ నేను చెయ్యలేదు.

[24] బంగారం నాకు ఆధారమనుకున్నట్టయితే, నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పినట్టయితే,

[25] నాకు చాలా ఆస్తి ఉందని గానీ నా చేతికి విస్తారమైన సంపద దొరికిందని గానీ నేను సంతోషించినట్టయితే,

[26] సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను దాన్ని గానీ, చంద్రుడు మెరిసిపోతూ ఉన్నప్పుడు దాన్ని గానీ చూసి,

[27] నా హృదయం నాలో మురిసిపోయి వాటివైపు చూసి పూజ్య భావంతో నా నోరు ముద్దు పెట్టినట్టయితే,

[28] అది కూడా న్యాయాధిపతుల చేత శిక్ష పొందదగిన నేరమౌతుంది. ఎందుకంటే నేను పైనున్న దేవుణ్ణి కాదన్న వాడినౌతాను.

[29] నన్ను ద్వేషించిన వాడికి కలిగిన నాశనాన్ని బట్టి నేను సంతోషించినట్టయితే, అతనికి కీడు కలగడం చూసి నన్ను నేను అభినందించుకున్నట్టయితే,

[30] (పాపం చేయడానికి నేను నా నోటికి చోటియ్యలేదు. అతని ప్రాణం తీసే శాపం ఏదీ పలకలేదు).

[31] “యోబు పెట్టిన భోజనం తిని, తృప్తి పొందని వాణ్ణి ఎవరు చూపించగలరు?” అని నా ఇంట్లో నివసించేవారు అనకపోతే,

[32] (పరదేశి ఎప్పుడూ ఆరుబయట ఉండే పరిస్థితి రాలేదు. బాటసారుల కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి).

[33] మానవ జాతి చేసినట్టు నా పాపాలను దాచి పెట్టుకోలేదు. నా అంగీలో దోషాన్ని కప్పి ఉంచుకోలేదు.

[34] జన సమూహానికి భయపడి, కుటుంబాల తిరస్కారానికి జడిసి నేను మౌనంగా ఉండి ద్వారం దాటి బయటికి వెళ్లకుండా దాక్కోలేదు.

[35] నా మాట వినడానికి నాకొకడు ఉంటే ఎంత బాగుంటుంది! ఇదిగో నా సంతకం. సర్వశక్తుడు నాకు జవాబిస్తాడు గాక. ఇదిగో నా ప్రతివాది రాసిన అభియోగం ఎవరైనా నాకు చూపిస్తే ఎంత బాగుంటుంది!

[36] నిశ్చయంగా నేను నా భుజం మీద దాన్ని ధరిస్తాను. దాన్ని కిరీటంగా పెట్టుకుంటాను.

[37] నేను వేసిన అడుగుల లెక్క ఆయనకు తెలియజేస్తాను. రాజు లాగా నిబ్బరంగా నేనాయన దగ్గరికి వెళ్తాను.

[38] నా భూమి నా గురించి మొర పెడితే, దాని చాళ్లు ఏకమై ఏడిస్తే,

[39] వెల చెల్లించకుండా నేను దాని పంటను అనుభవించినట్టయితే, దాని యజమానులకు ప్రాణహాని కలగజేసినట్టయితే,

[40] గోదుమల బదులు ముళ్లు, బార్లీకి బదులు కలుపు మొలచు గాక. యోబు మాటలు ఇంతటితో సమాప్తం.

యోబు — Chapters