Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:18

[1] అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు.

[2] నేటివరకూ నేను రోషంతో మొర పెడుతున్నాను. నా వ్యాధి నా మూలుగు కంటే భారంగా ఉంది.

[3] ఆయన నివాసస్థానం దగ్గరికి నేను చేరేలా ఆయనను ఎక్కడ కనుగొంటానో అది నాకు తెలిస్తే ఎంత బావుణ్ను.

[4] ఆయన సమక్షంలో నేను నా వాదన వినిపిస్తాను. వాదోపవాదాలతో నా నోరు నింపుకుంటాను.

[5] ఆయన నాకు జవాబుగా ఏమి పలుకుతాడో అది నేను తెలుసుకుంటాను. ఆయన నాతో పలికే మాటలను అర్థం చేసుకుంటాను.

[6] ఆయన తన అధికబలంతో నాతో వ్యాజ్యెమాడుతాడా? ఆయన అలా చేయడు. నా మనవి ఆలకిస్తాడు.

[7] అప్పుడు యథార్ధవంతుడు ఆయనతో వ్యాజ్యెమాడగలుగుతాడు. కాబట్టి నేను నా న్యాయాధిపతి ఇచ్చే శిక్ష శాశ్వతంగా తప్పించుకుంటాను.

[8] నేను తూర్పు దిశకు వెళ్లినా ఆయన అక్కడ లేడు. పడమటి దిశకు వెళ్లినా ఆయన కనబడడం లేదు.

[9] ఆయన పనులు జరిగించే ఉత్తరదిశకు పోయినా ఆయన నాకు కానరావడం లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖం తిప్పుకున్నాడు. నేనాయనను చూడలేను.

[10] నేను నడిచే దారి ఆయనకు తెలుసు. ఆయన నన్ను పరీక్షించిన తరవాత నేను బంగారంలాగా కనిపిస్తాను.

[11] నా పాదాలు ఆయన అడుగు జాడలను వదలకుండా నడిచాయి. నేను ఇటు అటు తొలగకుండా ఆయన మార్గం అనుసరించాను.

[12] ఆయన పెదవుల నుండి వచ్చే ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటిమాటలను నా స్వంత అభిప్రాయాల కంటే ఎక్కువగా ఎంచుకున్నాను.

[13] అయితే మార్పు లేనివాడు. ఆయనను దారి మళ్ళించ గలవాడెవడు? ఆయన తనకు ఇష్టమైనది ఏదో అదే చేస్తాడు.

[14] నా కోసం తాను సంకల్పించిన దాన్ని ఆయన నెరవేరుస్తాడు. అలాటి పనులను ఆయన అసంఖ్యాకంగా జరిగిస్తాడు.

[15] కాబట్టి ఆయన సన్నిధిలో నేను కలవరపడుతున్నాను. నేను ఆలోచించిన ప్రతిసారీ ఆయనకు భయపడుతున్నాను.

[16] దేవుడు నా హృదయాన్ని కుంగజేశాడు. సర్వశక్తుడే నన్ను కలవరపరిచాడు.

[17] అంధకారం కమ్మినా గాఢాంధకారం నన్ను కమ్మినా నేను నాశనమైపోలేదు.

యోబు — Chapters