Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:19

[1] దీన్ని బట్టి నా హృదయం వణకుతున్నది. దాని చోటి నుండి అది కదలి పోతున్నది.

[2] దేవుని స్వర గర్జనం వినండి. ఆయన నోటి నుండి వెలువడే శబ్దం వినండి.

[3] ఆకాశ వైశాల్యమంతటి కింద ఆయన దాన్ని వినిపిస్తాడు. భూమి కొనల దాకా తన మెరుపును పంపిస్తాడు.

[4] దాని తరువాత గొప్ప స్వరం గర్జిస్తుంది. ఆయన తన గంభీరమైన స్వరంతో సింహనాదం చేస్తాడు. ఆయన ధ్వని వినబడేటప్పుడు ఆయన మెరుపును అడ్డగించడు.

[5] దేవుడు ఆశ్చర్యంగా ఉరుము ధ్వని చేస్తాడు. మనం గ్రహించలేని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు.

[6] నువ్వు భూమి మీద పడమని మంచుకు, వర్షానికి, జడివానకు ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు.

[7] మనుషులందరూ ఆయన సృష్టికార్యాన్ని తెలుసుకునేలా ఆయన ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేశాడు.

[8] జంతువులు వాటి గుహల్లో దూరి దాక్కుంటాయి.

[9] దక్షిణాన తుఫాను దాని ఆవాసం నుండి వస్తుంది. ఉత్తర దిక్కు నుండి చెదరగొట్టే చలి గాలులు వీస్తాయి.

[10] దేవుని ఊపిరి వలన మంచు పుడుతుంది. జల విశాలమంతా ఘనీభవిస్తుంది.

[11] ఆయన దట్టమైన మేఘాన్ని జలంతో నింపుతాడు. తన మెరుపుల మేఘాన్ని వ్యాపింపజేస్తాడు.

[12] ఆయన పంపించగా మనుషులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపు, మేఘాలు సంచారం చేస్తాయి. ఆయన వాటికి ఆజ్ఞాపించేది అంతా అవి నెరవేరుస్తాయి.

[13] ఇదంతా ఆయన శిక్ష కోసం గాని, తన భూలోకం కోసం గాని కృపా భరితమైన నమ్మకత్వం కోసం గాని నెరవేరుస్తాడు.

[14] యోబు, ఈ మాట ఆలకించు. మౌనం వహించి దేవుని అద్భుత క్రియలను ఆలోచించు.

[15] దేవుడు తన మేఘం మెరుపు ప్రకాశించాలని ఎలా తీర్మానం చేస్తాడో నీకు తెలుసా?

[16] మేఘాలను తేలజేయడం పరిపూర్ణ జ్ఞానం గలవాడి మహా కార్యమని నీకు తెలుసా?

[17] దక్షిణపుగాలి వీయడం వలన ఉక్క పోసేటప్పుడు నీ బట్టలు ఎలా వెచ్చబడ్డాయో నీకు తెలుసా?

[18] పోత పోసిన అద్దమంత దట్టమైన ఆకాశాన్ని ఆయన వ్యాపింపజేసినట్టు నువ్వు వ్యాపింపజేయగలవా?

[19] మేము ఆయనతో ఏమి పలకాలో అది మాకు నేర్పు. మా మనసుల్లో చీకటి వల్ల మా వాదాలు ఎలా వినిపించాలో తోచడం లేదు.

[20] నేను పలుకుతానని ఎవరైనా ఆయనతో చెప్పవచ్చా? ఎవరైనా తాను నాశనమై పోవాలని కోరతాడా?

[21] ఎత్తుగా ఉన్న మేఘంలో ప్రకాశించే ఎండ ఇప్పుడు కనబడకపోయినా గాలి మేఘాలను పోగొట్టి దాన్ని తేటగా కనపరుస్తుంది.

[22] ఉత్తర దిక్కున బంగారు కాంతి పుడుతుంది. దేవుడు భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడు.

[23] సర్వశక్తుడైన దేవుడు మహాత్మ్యం గలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయాన్ని, నీతిని ఆయన ఏమాత్రం చెరపడు. అందువలన మనుషులు ఆయనపట్ల భయభక్తులు కలిగి ఉంటారు.

[24] తాము జ్ఞానులం అనుకునే వారిని ఆయన ఏమాత్రం లక్ష్యపెట్టడు.

యోబు — Chapters