Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:30

[1] నా బ్రతుకు మీద నాకు అసహ్యం కలుగుతుంతోంది. నేను అడ్డూ అదుపూ లేకుండా అంగలారుస్తాను. నా మనసులో ఉన్న బాధ కొద్దీ మాట్లాడతాను.

[2] నేను దేవునితో మాట్లాడతాను. నా మీద నేరం మోపకు. నువ్వు నాతో ఎందుకు వాదం పెట్టుకున్నావో చెప్పమని అడుగుతాను.

[3] నువ్వు ఇలా క్రూరంగా ప్రవర్తించడం నీకు ఇష్టమా? దుర్మార్గుల ఆలోచనలు నెరవేరేలా వాళ్ళపై నీ దయ చూపడం నీకు సంతోషం కలిగిస్తుందా? నీ చేతిపనులను తిరస్కరించడం నీకు సంతోషమా?

[4] మనుషులు చూస్తున్నట్టు నువ్వు కూడా చూస్తున్నావా? నీ ఆలోచనలు మనుషుల ఆలోచనల వంటివా?

[5] నీ జీవితకాలం మనుషుల జీవితకాలం వంటిదా? నీ సంవత్సరాలు మనుషుల ఆయుష్షు వంటివా?

[6] నేను ఎలాంటి నేరం చేయలేదనీ, నీ చేతిలోనుండి నన్ను ఎవ్వరూ విడిపించలేరనీ నీకు తెలుసు.

[7] అయినప్పటికీ నా నేరాలను గూర్చి ఎందుకు విచారణ చేస్తున్నావు? నాలో పాపాలు ఎందుకు వెతుకుతున్నావు?

[8] నీ సొంత చేతులతో నా శరీరంలోని అవయవాలు నిర్మించి నన్ను నిలబెట్టావు. అలాంటిది నువ్వే నన్ను మింగివేస్తున్నావు.

[9] ఒక విషయం జ్ఞాపకం చేసుకో, నువ్వే నన్ను బంకమట్టితో నిర్మించావు. మళ్ళీ నువ్వే నన్ను మట్టిలో కలిసిపోయేలా చేస్తావా?

[10] ఒకడు పాలు ఒలకబోసినట్టు నువ్వు నన్ను ఒలకబోస్తున్నావు. పాలను పెరుగులా చేసినట్టు నన్ను పేరబెడుతున్నావు.

[11] మాంసం, చర్మాలతో నన్ను కప్పావు. ఎముకలు, నరాలతో నన్ను రూపొందించావు.

[12] నాకు ప్రాణం పోసి నాపై కృప చూపించావు. నీ కాపుదలతో నా ఆత్మను రక్షించావు.

[13] అయినా నేను చేసే దోషాలను గూర్చి నీ హృదయంలో ఆలోచించావు. అలాంటి అభిప్రాయం నీకు ఉన్నదని నాకు తెలుసు.

[14] ఒకవేళ నేనేదైనా పాపం చేస్తే నీకు తెలిసిపోతుంది. నాకు శిక్ష విధించాలని నన్ను గమనిస్తూ ఉంటావు.

[15] నేను గనక పాప క్రియలు జరిగిస్తే అవి నన్నెంతో బాధిస్తాయి. నేను నిర్దోషిని అయినప్పటికీ నా తల ఎత్తుకోలేను. ఎందుకంటే నేను అవమానంతో నిండి పోయి నాకు కలిగిన బాధను తలంచుకుంటూ ఉంటాను.

[16] నా తల పైకెత్తితే సింహం వేటాడినట్టు నన్ను వేటాడతావు. నీ బలప్రభావాలు మళ్లీ నా మీద చూపిస్తావు.

[17] ఎడతెగని నీ కోపం పెరిగిపోతుంది. ఎప్పుడూ సేనల వెనుక సేనలను నా మీదికి దండెత్తేలా చేస్తూ ఉంటావు.

[18] నా తల్లి గర్భం నుండి నన్నెందుకు బయటకు రప్పించావు? పుట్టినప్పుడే ఎవరూ నన్ను చూడకుండా ఉన్నప్పుడే ప్రాణం వదిలితే బాగుండేది.

[19] అప్పుడు నా ఉనికే ఉండేది కాదు. తల్లి గర్భం నుండే నేరుగా సమాధికి తిరిగి వెళ్ళిపోయి ఉండేవాణ్ణి.

[20] నేను జీవించే రోజులు స్వల్పమే. అక్కడికి వెళ్లక ముందు కొంచెం సేపు నేను ఊరట చెందేలా నా జోలికి రాకుండా నన్ను విడిచిపెట్టు.

[21] నేను తిరిగిరాని లోకానికి వెళ్ళిపోతున్నాను. ఆ లోకమంతా మరణాంధకారం ఆవరించి ఉంది.

[22] అక్కడ అర్థరాత్రి వలె దట్టమైన కటిక చీకటి. ఎంత మాత్రం క్రమం అనేది లేని ఆ మరణాంధకార దేశంలో వెలుగు అర్థరాత్రివేళ చీకటిలాగా ఉంది.

యోబు — Chapters