[1] యోబు, దయచేసి నా వాదం ఆలకించు. నా మాటలన్నీ విను.
[2] ఇదిగో నేను మాటలాడడం మొదలుపెట్టాను. నా నోట నా నాలుక ఆడుతున్నది.
[3] నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుతున్నాయి. నా పెదవులు జ్ఞానాన్ని యథార్థంగా పలుకుతాయి.
[4] దేవుని ఆత్మ నన్ను సృష్టించింది. సర్వశక్తుని శ్వాస నాకు జీవమిచ్చింది.
[5] నీ చేతనైతే నాకు జవాబియ్యి. నా ఎదుట నీ వాదం సిద్ధపరచుకో. వ్యాజ్యెమాడు.
[6] దేవుని దృష్టిలో నేను కూడా నీలాంటి వాణ్ణి. నేను కూడా బంకమట్టితో తయారైన వాణ్ణి.
[7] నా భయం నిన్ను బెదిరించదు. నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు.
[8] నిశ్చయంగా నీ పలుకులు నా చెవిని బడ్డాయి. నీ మాటల ధ్వని నాకు వినబడింది.
[9] ఏమంటే “నేను నేరం లేని పవిత్రుణ్ణి, మాలిన్యం లేని పాపరహితుణ్ణి.
[10] ఆయన నా మీద తప్పులెన్నడానికి తరుణం వెతుకుతున్నాడు. నన్ను తనకు పగవానిగా భావిస్తున్నాడు.
[11] ఆయన నా కాళ్లను బొండలో బిగిస్తున్నాడు. నా దారులన్నిటినీ కనిపెట్టి చూస్తున్నాడు” అని నీవంటున్నావు.
[12] నేను నీకు జవాబు చెబుతాను. నీవు ఇలా చెప్పడం సరికాదు. దేవుడు మానవుడికన్నా గొప్పవాడు.
[13] నీవెందుకు ఆయనతో పోరాడతావు? తన క్రియల్లో దేన్ని గురించీ ఆయన సంజాయిషీ చెప్పుకోడు.
[14] దేవుడు ఒక్కమారే పలుకుతాడు. రెండు సార్లు పలుకుతాడు. అయితే మనుషులు అది కనిపెట్టరు.
[15] మంచం మీద కునికే సమయంలో, గాఢనిద్ర పట్టేటప్పుడు వచ్చే స్వప్నాల్లో మాట్లాడుతాడు.
[16] ఆయన మనుషుల చెవులను తెరుస్తాడు. వారిని భయపెడతాడు.
[17] మనుషులు గర్విష్ఠులు కాకుండా చేయడానికి, తాము తలపెట్టిన పాపకార్యం వారు మానుకొనేలా చేయడానికి,
[18] గోతికి పోకుండా వారి జీవాన్ని, మరణం కాకుండా వారి ప్రాణాన్ని తప్పించడానికి,
[19] వ్యాధిచేత మంచం పట్టడం మూలంగానూ, ఒకడి ఎముకల్లో ఎడతెగని నొప్పులు కలగడం మూలంగానూ వాణ్ణి శిక్షిస్తాడు.
[20] రొట్టె, రుచిగల ఆహారం వాడికి అసహ్యం అవుతుంది.
[21] వాడి ఒంట్లో మాంసం క్షీణించిపోయి వికారమై పోతుంది. బయటికి కనబడని ఎముకలు పైకి పొడుచుకు వస్తాయి.
[22] వాడు సమాధికి దగ్గర అవుతాడు. వాడి ప్రాణం హంతకులకు చేరువ అవుతుంది.
[23] మనుషులకు యుక్తమైనది ఏదో దాన్ని వాడికి తెలియజేయడానికి వేలాది దేవదూతల్లో ఒకడు వాడికి మధ్యవర్తిగా ఉంటే,
[24] ఆ దేవదూత వాడిపై కరుణ చూపి దేవునితో “పాతాళంలోకి దిగిపోకుండా ఇతన్ని విడిపించు. ఇతని పక్షంగా పరిహారం దొరికింది” అని గనక అంటే,
[25] అప్పుడు వాడి మాంసం చిన్నపిల్లల మాంసం కన్నా ఆరోగ్యంగా ఉంటుంది. వాడికి తన యవ్వన బలం తిరిగి కలుగుతుంది.
[26] వాడు దేవుణ్ణి బతిమాలుకుంటే ఆయన వాణ్ణి కటాక్షిస్తాడు. కాబట్టి వాడు ఆయన ముఖం చూసి సంతోషిస్తాడు. ఇలా ఆయన మనిషికి నిర్దోషత్వం దయచేస్తాడు.
[27] అప్పుడు వాడు మనుష్యుల ఎదుట సంతోషిస్తూ ఇలా అంటాడు. “నేను పాపం చేసి యథార్థమైన దాన్ని వక్రం చేశాను. అయినా నా పాపానికి తగిన ప్రతీకారం నాకు కలగలేదు.
[28] కూపంలోకి దిగిపోకుండా నా ప్రాణాన్ని ఆయన విమోచించాడు. నా జీవం వెలుగును చూస్తున్నది.”
[29] చూడు, మానవుల కోసం దేవుడు రెండు సార్లు, మూడు సార్లు ఈ క్రియలన్నిటినీ చేస్తాడు.
[30] కూపంలోనుండి వారిని మళ్ళీ రప్పించాలని, మనుషులు సజీవులకుండే వెలుగుతో వెలిగించబడాలని ఇలా చేస్తాడు.
[31] యోబు, శ్రద్ధగా విను. నా మాట ఆలకించు. మౌనంగా ఉండు. నేను మాట్లాడతాను.
[32] చెప్పవలసిన మాట ఏదైనా నీకుంటే నాకు జవాబు చెప్పు. మాట్లాడు, నువ్వు నీతిమంతుడవని నిరూపించుకో.
[33] అలా కాకుంటే నా మాట ఆలకించు. మౌనంగా ఉండు, నేను నీకు జ్ఞానం బోధిస్తాను.