[1] అప్పుడు నయమాతీయుడు జోఫరు ఇలా జవాబు ఇచ్చాడు,
[2] ప్రవాహంలాగా బయటకు వస్తున్న నీ మాటలకు జవాబు చెప్పాలి గదా. వదరుబోతును నిర్దోషి అని ఎంచడం జరుగుతుందా?
[3] నీ పొగరుబోతు మాటలు విని మనుషులు ఎదురు చెప్పకుండా మౌనంగా ఉండాలా? నీ మాటలను బట్టి ఎవ్వరూ నిన్ను మందలించకూడదా?
[4] నువ్వు దేవునితో “నేను అనుసరించేది సక్రమం, నీ దృష్టిలో నేను పవిత్రంగా ఉన్నాను” అంటున్నావు గదా.
[5] నువ్వు దేవునితో మాట్లాడితే మంచిది. ఆయనే నీతో వాదులాటకు దిగితే బాగుంటుంది.
[6] ఆయనే నీకు జ్ఞాన రహస్యాలు తెలియజేయాలి. ఆయన జ్ఞాన పూర్ణుడు. నువ్వు చేసిన దోషాలకు తగినదాని కంటే తక్కువ సంజాయిషీయే దేవుడు నీ నుండి కోరుతున్నాడని తెలుసుకో.
[7] దేవుని నిగూఢ సత్యాలు నువ్వు తెలుసుకోగలవా? సర్వశక్తుడైన దేవుణ్ణి గూర్చిన పరిపూర్ణ జ్ఞానం నీకు ఉంటుందా?
[8] నువ్వు ఏమి చేయగలవు? అది ఆకాశ విశాలం కంటే ఉన్నతమైనది. నీకేం తెలుసు? అది పాతాళంకంటే లోతుగా ఉన్నది.
[9] దాని కొలత భూమికంటే పొడవు, దాని వెడల్పు సముద్రంకన్నా విశాలం.
[10] ఆయన సంచారం చేస్తూ ఒకణ్ణి బంధించి, తీర్పులో విచారణ జరిగిస్తే ఆయనకు ఎదురు చెప్పగలిగేవాడు ఎవరు?
[11] పనికిమాలిన వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు. ఎక్కడ పాపం జరుగుతుందో ఆయన ఇట్టే కనిపెట్టగలడు.
[12] అయితే అడవి గాడిదపిల్ల మనిషిగా పుట్టగలిగితే బుద్ధిహీనుడు తెలివిగలవాడు కావచ్చు.
[13] నువ్వు నీ హృదయాన్ని సవ్యంగా ఉంచుకో. నీ చేతులు ఆయన వైపు చాపు.
[14] నీ చేతిలో చెడుతనం ఉందని గ్రహించి దాన్ని విడిచిపెట్టు. నీ గుడారంలో ఉన్న అక్రమాన్ని పూర్తిగా తొలగించు.
[15] అలా చేస్తే నువ్వు తప్పకుండా ఎలాంటి కళంకం లేనివాడవై నిర్భయంగా, స్థిరంగా, సంతోషంగా ఉంటావు.
[16] తప్పకుండా నువ్వు నీ గడ్డుకాలాన్ని మరచిపోతావు. ప్రవహిస్తూ దాటిపోయిన నీటిని గుర్తు పెట్టుకున్నట్టు నువ్వు దాన్ని గుర్తు చేసుకుంటావు.
[17] అప్పుడు నీ జీవితం మధ్యాహ్నం ఉండే ఎండ కంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది. చీకటి ఆవరించినా అది సూర్యోదయపు వెలుగులాగా కనిపిస్తుంది.
[18] నీ నమ్మకానికి ఒక ఆధారం దొరుకుతుంది. కనుక నువ్వు ధైర్యంగా ఉంటావు. నీ ఇల్లు మొత్తం కలయజూసి క్షేమంగా విశ్రాంతి తీసుకుంటావు.
[19] ఎవరి భయమూ లేకుండా నువ్వు నిద్రపోతావు. అనేకమంది నీ సహాయం కోరుకుంటారు.
[20] దుర్మార్గుల కంటిచూపు మందగిస్తుంది. వాళ్లకు ఎలాంటి ఆశ్రయమూ దొరకదు. తమ ప్రాణాలు ఎప్పుడు పోతాయా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు.