Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:31

[1] ఎలీహు ఇంకా ఇలా అన్నాడు.

[2] కొంతసేపు నన్ను మాట్లాడనియ్యి. కొన్ని సంగతులు నీకు తెలియజేస్తాను. ఎందుకంటే దేవుని పక్షంగా నేనింకా మాట్లాడవలసి ఉంది.

[3] దూరం నుండి నేను జ్ఞానం తెచ్చుకుంటాను. నీతి అనేది నన్ను సృష్టించిన వాడికే చెందుతుందని అంటాను.

[4] నా మాటలు ఏమాత్రం అబద్ధాలు కావు. పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు.

[5] దేవుడు బలవంతుడు గానీ ఆయన ఎవరినీ తిరస్కారంగా చూడడు. ఆయన వివేచనాశక్తి ఎంతో బలమైనది.

[6] భక్తిహీనుల ప్రాణాన్ని ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయం జరిగిస్తాడు.

[7] నీతిమంతులను ఆయన చూడక పోడు. ఆయన వారిని నిత్యం సింహాసనంపై కూర్చునే రాజులతోబాటు కూర్చోబెడతాడు. వారు ఘనత పొందుతారు.

[8] వారు సంకెళ్లతో బంధితులైతే, బాధలు అనే తాళ్ళు వారిని కట్టివేస్తే,

[9] అప్పుడు వారికి ఆయన వెల్లడిస్తాడు, వారి అపరాధాలు, వారు గర్వంగా ప్రవర్తించిన సంగతులు వారికి తెలియజేస్తాడు.

[10] ఉపదేశం వినడానికి వారి చెవులు తెరుస్తాడు. పాపాన్ని విడిచి రండని ఆజ్ఞ ఇస్తాడు.

[11] వారు ఆలకించి ఆయనను సేవించినట్టయితే తమ దినాలను క్షేమంగాను తమ సంవత్సరాలను సుఖంగాను వెళ్లబుచ్చుతారు.

[12] వారు ఆలకించక పోతే వారు కత్తివాత కూలి నశిస్తారు. వారికి జ్ఞానం లేనందువల్ల చనిపోతారు.

[13] అయినా భక్తిలేని వారు లోలోపల క్రోధం పెంచుకుంటారు. ఆయన వారిని బంధించినా సరే వారు మొర పెట్టరు.

[14] కాబట్టి వారు యవ్వనప్రాయంలోనే మరణిస్తారు. వారి బ్రతుకు అప్రదిష్ట పాలవుతుంది.

[15] బాధపడే వారిని వారికి కలిగిన బాధ వలన ఆయన విడిపిస్తాడు. బాధ వలన వారిని విధేయులుగా చేస్తాడు.

[16] అంతేగాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. కష్టం లేని విశాల స్థలానికి నిన్ను తోడుకుపోతాడు. నీ భోజనం బల్లపై ఉన్న ఆహారాన్ని కొవ్వుతో నింపుతాడు.

[17] దుష్టుల తీర్పు నీలో నిండి ఉంది. న్యాయవిమర్శ, తీర్పు కలిసి నిన్ను పట్టుకున్నాయి.

[18] కలిమి నిన్ను మోసానికి ప్రేరేపించనియ్యవద్దు. పెద్ద మొత్తంలో లంచం నిన్ను న్యాయం నుండి దారి మళ్ళించనియ్యవద్దు.

[19] నీ సంపదలు నువ్వు బాధల పాలు కాకుండా నిన్ను కాపాడతాయా? నీ బల ప్రభావాలు నీకు సాయపడతాయా?

[20] ఇతరులకు వ్యతిరేకంగా పాపం చేయడం కోసం రాత్రి రావాలని కోరుకోవద్దు. మనుషులను తమ స్థలాల్లో నుండి కొట్టివేసే చీకటి కోసం చూడవద్దు.

[21] పాపానికి తిరగకుండా జాగ్రత్తపడు. నువ్వు పాపం చెయ్యకుండా ఉండేలా నీ బాధల మూలంగా నీకు పరీక్షలు వస్తున్నాయి.

[22] ఆలోచించు, దేవుడు శక్తిశాలి, ఘనుడు. ఆయనను పోలిన ఉపాధ్యాయుడు ఎవరు?

[23] ఆయనకు మార్గం సూచించిన వాడెవడు? “నువ్వు దుర్మార్గపు పనులు చేస్తున్నావు” అని ఆయనతో పలకడానికి ఎవరు తెగిస్తారు?

[24] ఆయన కార్యాలను కీర్తించు. మనుషులు వాటిని గురించే పాడారు.

[25] మనుష్యులంతా వాటిని చూశారు. అయితే వారు దూరంగా నిలిచి ఆ కార్యాలను చూశారు.

[26] ఆలోచించు, దేవుడు గొప్పవాడు. మనం ఆయనను సరిగా అర్థం చేసుకోలేము. ఆయన సంవత్సరాలను ఎవరూ లెక్కబెట్టలేరు.

[27] ఆయన నీటిబిందువులను తెస్తాడు. తన మంచును వానచినుకుల్లాగా మార్చి కురిపిస్తాడు.

[28] మేఘాలు వాటిని కుమ్మరిస్తాయి. మనుషుల మీదికి అవి జడివానగా కురుస్తాయి.

[29] నిజంగా మేఘాలు ముసిరే విధానం ఎవరైనా అర్థం చేసుకోగలరా? ఆయన మందిరం లోనుండి ఉరుములు వచ్చేదెలాగో ఎవరికైనా తెలుసా?

[30] చూడు, ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేస్తాడు. సముద్రాన్ని చీకటితో ఆయన కప్పుతాడు.

[31] ఈ విధంగా ఆయన మనుషులకు ఆహారం పెడతాడు. ఆయన ఆహారాన్ని పుష్కలంగా ఇస్తాడు.

[32] తన చేతుల్లో ఉరుములను పట్టుకుంటాడు. గురికి తగలాలని ఆయన వాటికి ఆజ్ఞాపిస్తాడు.

[33] వాటి గర్జన ముంచుకు వస్తున్న తుఫానును మనుషులకు తెలుపుతుంది. పశువులకు సైతం దాని రాకడ తెలుసు.

యోబు — Chapters