Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:20

[1] నువ్వు జలరాక్షసిని గాలంతో లాగగలవా? దాని దవడలను తాడుతో బిగించగలవా?

[2] నువ్వు దాని ముక్కుకు పగ్గం వేయగలవా? దాని దవడకు కొంకి ఎక్కించగలవా?

[3] అది నీకు విన్నపాలు చేస్తుందా? మృదువైన మాటలు నీతో పలుకుతుందా?

[4] నువ్వు శాశ్వతంగా దాన్ని సేవకుడుగా చేసుకునేలా అది నీతో ఒప్పందం చేస్తుందా?

[5] నువ్వు ఒక పిట్టతో ఆటలాడినట్టు దానితో ఆటలాడతావా? నీ పనిపిల్లలు ఆడుకోడానికి దాని కట్టివేస్తావా?

[6] బెస్తవాళ్ళు దానితో బేరాలు చేస్తారా? వారు దాన్ని తునకలు చేసి వర్తకులతో వ్యాపారం చేస్తారా?

[7] దాని ఒంటినిండా ఇనప శూలాలు గుచ్చగలవా? దాని తలనిండా చేప అలుగులు గుచ్చగలవా?

[8] దాని మీద చెయ్యి వేసి చూడు, దానితో కలిగే పోరు నువ్వు గుర్తు చేసుకుంటే నువ్వు మళ్ళీ అలా చెయ్యవు.

[9] దాన్ని చూస్తే చాలు, మనుషులు దాన్ని వశపరచుకోవచ్చనే ఆశ వదులుకుంటారు. దాని చూస్తే చాలు ఎవరికైనా గుండెలు అవిసిపోతాయి.

[10] సముద్ర రాక్షసిని రేపడానికి తెగించే శూరుడు లేడు. అలా ఉండగా నా ఎదుట నిలవగలవాడెవడు?

[11] నేను తిరిగి చెల్లించేలా నాకెవరైనా ఏమైనా ఇచ్చారా? ఆకాశం కింద ఉన్నదంతా నాదే గదా.

[12] సముద్ర రాక్షసి కాళ్ళను గురించైనా దాని మహా బలాన్ని గురించైనా దాని చక్కని ఆకారాన్ని గురించైనా పలకకుండా మౌనంగా ఉండను.

[13] ఎవడైనా దాని పై పొరలను లాగివేయగలడా? దాని రెండు కవచాలను గుచ్చి రంధ్రం చేయగలడా?

[14] దాని భయంకరమైన కోరలు ఉన్న ముఖ ద్వారాలను తెరవగల వాడెవడు?

[15] దాని వీపుకు దృఢమైన పొలుసులు అతికి ఉన్నాయి. విడదీయలేనంత గట్టిగా అవి కూర్చి ఉన్నాయి.

[16] అవి ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నాయి. వాటి మధ్యకు గాలి ఏమాత్రం చొరబడదు.

[17] అవి ఒకదానితో ఒకటి అతికి ఉన్నాయి. వాటిని ఛేదించడం ఎవరివల్లా కాదు.

[18] అది తుమ్మితే వెలుగు చిమ్ముతుంది. దాని కళ్ళు ఉదయకాలపు కనురెప్పల్లాగా ఉన్నాయి.

[19] దాని నోటి నుండి మండే నిప్పులు బయలుదేరుతాయి. అగ్ని కణాలు దాని నుండి లేస్తాయి.

[20] పొయ్యిపై మసులుతున్న కాగులోనుండి, బాగా గాలి విసిరి రాజబెట్టిన మంటలోనుండి లేచినట్టు దాని నాసికా రంధ్రాల్లో నుండి పొగ లేస్తుంది.

[21] దాని ఊపిరి నిప్పులను మండిస్తుంది. దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరుతాయి.

[22] దాని మెడలో బలముంది. భయం దాని ఎదుట తాండవమాడుతూ ఉంటుంది.

[23] దాని దళసరి కండరాలు గట్టిగా అతికి ఉన్నాయి. అవి దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నాయి. అవి ఊడి రావు.

[24] దాని గుండె రాయి లాగా గట్టిగా ఉంది. అది తిరగలి కింది దిమ్మంత కఠినం.

[25] అది లేచేటప్పుడు మహామహులు సైతం భయపడతారు. భయంతో వారు వెనక్కి తగ్గుతారు.

[26] కత్తి దెబ్బ దాన్ని ఏమీ చెయ్యదు. ఈటె, బాణం, పదునైన ఏ అయుధమైనా పనికి రావు.

[27] అది ఇనుమును గడ్డిపోచగా, ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగా చూస్తుంది.

[28] బాణం దాన్ని తరిమి కొట్టలేదు. వడిసెల రాళ్లు దాని దృష్టికి పొట్టులాగా ఉన్నాయి.

[29] గదలను అది గడ్డిపరకలుగా ఎంచుతుంది. అది రివ్వున ఎగిరి వచ్చే ఈటెను చూసి నవ్వుతుంది.

[30] దాని ఉదర భాగాలు కరుకైన గాజు పెంకుల్లాగా ఉన్నాయి. అది బురద మీద నురిపిడి కొయ్యలాంటి తన తోకను పరచుకుంటుంది.

[31] కాగులో నీళ్ళు మసిలినట్టు మహాసముద్రాన్ని అది పొంగిస్తుంది. సముద్రాన్ని అది నూనెలాగా చేస్తుంది.

[32] అది తాను నడచిన దారిని తన వెనక ప్రకాశింప జేస్తుంది. చూసే వారు అగాధ జలం తెల్లగా ఉంది అనుకుంటారు.

[33] అది నిర్భయంగా జీవిస్తుంది. భూమి మీద దానికి సమానమైనది లేదు.

[34] అది గర్వంగా ఉండే వాటిని తిరస్కారంగా చూస్తుంది. గర్వించే వాటన్నిటికీ అది రాజు.

యోబు — Chapters