Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:47

[1] ఆ తరువాత యోబు మాట్లాడడం మొదలుపెట్టాడు. తాను పుట్టిన దినాన్ని శపించాడు.

[2] యోబు ఇలా అన్నాడు.

[3] నేను పుట్టిన రోజు లేకుండా ఉంటే బాగుండేది. “మగ పిల్లవాడు పుట్టాడు” అని చెప్పే రాత్రి సమయం లేకపోయినట్టయితే బాగుండేది. నా తల్లి గర్భాన్ని ఆ రోజు మూసి ఉంచితే బాగుండేది. ఆ రోజు నా కళ్ళకు బాధను మరుగు చేయలేకపోయింది.

[4] ఆ రోజు చీకటిమయం కావాలి. దాని మీద వెలుగు ప్రకాశించకూడదు. పైన ఉన్న దేవుడు ఆ రోజును లెక్కించకూడదు.

[5] చీకటి, గాఢాంధకారం మళ్ళీ దాన్ని తమ దగ్గరికి తీసుకోవాలి. దాన్ని మేఘాలు ఆవరించాలి. పగటివేళ చీకటి కమ్మినట్టు దానికి భయాందోళన కలగాలి.

[6] కటిక చీకటి ఆ రాత్రిని ఒడిసి పట్టాలి. సంవత్సరం రోజుల్లో నేనూ ఒకదాన్నని అది చెప్పుకోకుండా ఉండాలి. ఏ నెలలోనూ అది భాగం కాకూడాదు.

[7] ఆ రాత్రి ఎవ్వరూ పుట్టకపోతే బాగుండేది. అప్పుడు ఎవ్వరూ హర్ష ధ్వానాలు చెయ్యకపోతే బాగుండేది.

[8] శపించేవాళ్ళు ఆ రోజును శపించాలి. సముద్ర రాక్షసిని రెచ్చగొట్టే వాళ్ళు దాన్ని శపించాలి.

[9] ఆ దినాన సంధ్యవేళలో ప్రకాశించే నక్షత్రాలకు చీకటి కమ్మాలి. వెలుగు కోసం అది ఎదురు చూసినప్పుడు వెలుగు కనబడకూడదు.

[10] అది ఉదయ సూర్య కిరణాలు చూడకూడదు. పుట్టిన వెంటనే నేనెందుకు చనిపోలేదు?

[11] తల్లి గర్భం నుండి బయటపడగానే నా ప్రాణం ఎందుకు పోలేదు?

[12] నన్నెందుకు మోకాళ్ల మీద పడుకోబెట్టుకున్నారు? నేనెందుకు తల్లి పాలు తాగాను?

[13] లేకపోతే ఇప్పుడు నేను పడుకుని ప్రశాంతంగా ఉండేవాణ్ణి. నేను చనిపోయి విశ్రాంతిగా ఉండేవాణ్ణి.

[14] శిథిలమైపోయిన భవనాలు తిరిగి కట్టించుకునే భూరాజుల్లాగా, మంత్రుల్లాగా నేను కూడా చనిపోయి ప్రశాంతంగా ఉండేవాణ్ణి.

[15] బంగారం సంపాదించుకుని, తమ ఇంటినిండా వెండిని నింపుకున్న అధికారుల్లాగా నేను కన్నుమూసి ఉండేవాణ్ణి.

[16] భూమిలో పాతిపెట్టబడిన పిండంలాగా వెలుగు చూడని పసికందులాగా నాకిప్పుడు ఉనికి ఉండేది కాదు.

[17] అక్కడ దుర్మార్గులు ఇక బాధపెట్టరు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి పొందుతారు.

[18] అక్కడ బంధితులైన వారు కలసి విశ్రమిస్తారు. వాళ్ళ చేత పనులు చేయించేవాళ్ళ ఆజ్ఞలు వాళ్లకు వినిపించవు.

[19] పేదవారు, గొప్పవారు అంతా అక్కడ ఉన్నారు. దాసులు తమ యజమానుల చెర నుండి తప్పించుకుని స్వతంత్రులయ్యారు.

[20] దుర్దశలో ఉన్నవారికి వెలుగు ఎందుకు? దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఎందుకు?

[21] వారు మరణం కోరుకుంటారు. దాచిపెట్టిన నిధి కోసం వాళ్ళు లోతుగా తవ్వుతున్నారు గాని అది వారికి దొరకడం లేదు.

[22] వాళ్ళు సమాధికి చేరినప్పుడు వారు ఆనందిస్తారు, ఎంతో సంబరపడతారు.

[23] మార్గం కనుగొనలేని వాడికి, దేవుడు చుట్టూ కంచె వేసిన వాడికి జీవం ఎందుకు?

[24] భోజనం చేయడానికి బదులు నాకు నిట్టూర్పులు కలుగుతున్నాయి. నేను చేసే ఆక్రందనలు నీళ్లలాగా పారుతున్నాయి.

[25] ఏమి జరుగుతుందని నేను భయపడ్డానో అదే నాకు జరిగింది. నేను భయపడినదే నా మీదికి వచ్చింది.

[26] నాకు శాంతి లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు. వీటికి బదులు కష్టాలే వచ్చాయి.

యోబు — Chapters