Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:15

[1] ఎలీహు ఇలా జవాబు ఇచ్చాడు.

[2] నువ్వు నిర్దోషివని అనుకుంటున్నావా? “నేను దేవుడి కన్నా నీతిపరుణ్ణి” అనుకుంటున్నావా?

[3] “నేను నీతిగా ఉంటే ప్రయోజనం ఏమిటి? పాపం చేస్తే నాకు కలిగిన లాభం కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమిటి?” అని నువ్వు చెబుతున్నావే.

[4] నీకూ నీ మిత్రులకు కూడా నేను సమాధానం చెబుతాను.

[5] ఆకాశం వైపు తేరి చూడు. నీ కన్నా ఉన్నతమైన ఆకాశ విశాలం వైపు చూడు.

[6] నువ్వు పాపం చేసినా ఆయనకు నష్టమేమిటి? నీ అతిక్రమాలు పోగుపడినా ఆయనకి నువ్వు చేసిందేమిటి?

[7] నువ్వు నీతిమంతుడివైతే ఆయనకు నీవేమైనా ఇస్తున్నావా? ఆయన నీ దగ్గర నుండి ఏమైనా తీసుకుంటాడా?

[8] నువ్వు మనిషివి కాబట్టి నీ కీడు ఏమైనా మనిషికే తగులుతుంది. నీ నీతి ఫలం ఏదైనా మనుషులకే దక్కుతుంది.

[9] అనేకమైన అణచివేత క్రియల వలన ప్రజలు అక్రోశిస్తారు. బలవంతుల భుజబలానికి భయపడి సహాయం కోసం కేకలు పెడతారు.

[10] అయితే “రాత్రిలో మనకు పాటలు ఇస్తూ,

[11] భూజంతువుల కంటే మనకు ఎక్కువగా బుద్ధి నేర్పుతూ, ఆకాశపక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలగజేస్తూ నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడు?” అనుకునే వారెవరూ లేరు.

[12] వారు దుష్టుల గర్వాన్ని బట్టి మొర పెడతారు గాని ఆయన జవాబివ్వడం లేదు.

[13] దేవుడు ఒక్కనాటికీ వ్యర్థమైన మాటలు ఆలకించడు. సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు.

[14] ఆయన కనిపించడం లేదని నువ్వు చెబితే మరి ఇంకెంతగా ఆయన పెడచెవిన పెడతాడు! వాదం ఆయన ఎదుటనే ఉంది. ఆయన కోసం నువ్వు కనిపెట్టవలసిందే.

[15] “ఆయన ఎవరినీ కోపంతో దండించడు, మనుషుల అహంకారాన్ని ఆయన పట్టించుకోడు” అని నీవంటే మరి ఇంకెంతో నిశ్చయంగా ఆయన జవాబు చెప్పకుండా మౌనం దాలుస్తాడు గదా.

[16] కాబట్టి యోబు కేవలం బుద్ధితక్కువ మాటలు పలకడానికే తన నోరు తెరిచాడు. జ్ఞానం లేని మాటలనే రాసులు పోస్తున్నాడు.

యోబు — Chapters