Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:18

[1] ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సు గలవారు నన్ను ఎగతాళి చేస్తారు. వీరి తండ్రులు నా మందలు కాసే కుక్కలతో ఉండడానికి తగని వారని నేను తలంచాను.

[2] వారి తండ్రుల చేతుల బలం నాకేమి ప్రయోజనం? వారి వయసు మళ్ళిపోవడం చేత వారి సత్తువతగ్గిపోయింది.

[3] వారు పేదరికం చేత, కరువుచేత, శుష్కించిపోయిన వారు. పాడై నిర్మానుష్యంగా ఉన్న ఎడారిలోని చీకటి తావుల్లో ఎండిన నేలలో వెదుకులాడుతారు.

[4] వారు తుప్పల్లోని రేవు కాడలను పెరుకుతారు. దూసరి తీగె వారికి ఆహారం.

[5] వారు మనుషుల మధ్య నుండి తరిమివేయబడిన వారు. దొంగను తరుముతూ కేకలు వేసినట్టు మనుషులు వారిని తరుముతూ కేకలు వేస్తారు.

[6] భయంకరమైన లోయల్లో, నేల నెర్రెల్లో బండల సందుల్లో వారు కాపురముండవలసి వచ్చింది.

[7] తుప్పల్లో వారు గాడిదల్లాగా ఓండ్ర పెడతారు ముళ్లచెట్ల కింద వారు కూర్చుంటారు.

[8] వారు మోటు వారికి, పేరు లేని పనికి మాలిన వారికి పుట్టినవారు. దేశంలోనుండి కొరడాలతో వారిని తరిమి వేశారు.

[9] అలాంటివారి కొడుకులు ఇప్పుడు నా గురించి పాటలు పాడుతారు. నేను వారి వేళాకోళానికి గురి అవుతున్నాను.

[10] వారు నన్ను అసహ్యించుకుంటారు. నా దగ్గర నుండి దూరంగా పోతారు. నన్ను చూసినప్పుడు ఉమ్మివేయక మానరు.

[11] ఆయన నా అల్లె తాడు తప్పించి నన్ను బాధించాడు. కాబట్టి వారు నాకు లోబడక నా అదుపు తప్పి పోయారు.

[12] నా కుడిపక్కన అల్లరిమూక లేస్తుంది. వారు నన్ను తరుముతారు. నాకు ఎదురుగా ముట్టడి దిబ్బ వేస్తారు.

[13] వారిని అదుపు చేసే వారు లేరు. నా దారిని పాడు చేస్తారు. నా మీదికి ఆపద లాక్కొస్తారు.

[14] గొప్ప గండి పడి జలప్రవాహం వచ్చినట్టు వారు వస్తారు. ఆ వినాశంలో వారు కొట్టుకుపోతారు.

[15] భీతి నాపై దాడి చేసింది. గాలికి కొట్టుకుపోయినట్టు నా గౌరవం ఎగిరిపోయింది. మేఘం లాగా నా అభివృద్ధి కదిలి వెళ్లి పోయింది.

[16] నా ప్రాణం నాలోనుంచి పార బోసినట్టు అయిపోయింది. కష్టకాలం నన్ను చేజిక్కించుకుంది.

[17] రాత్రివేళ నా ఎముకలు నాలో విరుగ్గొట్టినట్టు అయిపోయింది. నన్ను వేధించే నొప్పులు ఆగడం లేదు.

[18] దేవుని మహా బలం నా వస్త్రాన్ని ఒడిసి పట్టింది. మెడ చుట్టూ ఉండే నా చొక్కాలాగా అది బిగుసుకు పోతున్నది.

[19] ఆయన నన్ను బురదలోకి తోసాడు. నేను దుమ్ములాగా బూడిదలాగా ఉన్నాను.

[20] ఓ దేవా నీకు మొర పెడుతున్నాను. అయితే నువ్వు జవాబియ్యడం లేదు. నేను నిలబడితే నువ్వు అలా చూస్తూ ఉన్నావు.

[21] నువ్వు మారిపోయావు. నా పట్ల కఠినుడివైపోయావు. నీ బాహుబలంతో నన్ను హింసిస్తున్నావు.

[22] గాలితో నన్ను ఎగరగొట్టి కొట్టుకుపోయేలా చేస్తున్నావు. తుఫానుతో నానిపోయేలా చేస్తున్నావు.

[23] నన్ను మరణానికి, అంటే జీవులందరికీ నియమించిన నివాసానికి రప్పిస్తావని నాకు తెలుసు.

[24] ఎవరైనా పడిపోతూ ఉన్నప్పుడు సహాయం కోసం చెయ్యి చాపడా? ఆపదలో రక్షించమని మొర పెట్టడా?

[25] బాధలో ఉన్న వారి కోసం నేను ఏడవ లేదా? దరిద్రుల నిమిత్తం నేను దుఖించ లేదా?

[26] నాకు మేలు కలుగుతుందని నేను ఆశించాను. కానీ నాకు కీడు సంభవించింది. వెలుగు కోసం నేను కనిపెట్టగా చీకటి దక్కింది.

[27] నా పేగులు మానక మండుతున్నాయి అపాయ దినాలు నన్నెదుర్కొన్నాయి.

[28] సూర్య కాంతి కరువై వ్యాకులపడుతూ నేను సంచరిస్తున్నాను. సమాజంలో నిలబడి మొరపెడుతున్నాను.

[29] నేను నక్కలకు అన్ననయ్యాను. నిప్పుకోళ్లకు మిత్రుడిని అయ్యాను.

[30] నా చర్మం నల్లబడి నా మీద నుండి ఊడిపోతున్నది. వేడిమి వలన నా ఎముకలు కాగిపోయాయి.

[31] నా స్వరమండలం శోక గీతం వినిపిస్తున్నది. నా వేణువు రోదనశబ్దం ఆలపిస్తున్నది.

యోబు — Chapters