Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:36

[1] అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు.

[2] మీరు నా మాటలు శ్రద్ధగా వినండి. నా మాటలు విని నన్ను ఆదరించకపోయినా సరే నా మాటలు వింటే చాలు.

[3] నాకు అనుమతి ఇస్తే నేను మాట్లాడతాను. నా మాటలు విన్న తరువాత మీరు నన్ను ఎగతాళి చేస్తారేమో.

[4] నేను మనుషులకు విన్నపం చేయడం లేదు. నేనెందుకు ఆత్రుత చెందకూడదు?

[5] మీ నోళ్ళపై చేతులు ఉంచుకుని నన్ను పరిశీలించి చూసి ఆశ్చర్యపడండి.

[6] ఈ విషయాలను గురించి తలుచుకుంటే నాకేమీ తోచడం లేదు. నా శరీరమంతా వణికిపోతుంది.

[7] భక్తిహీనులు ఇంకా ఎలా బతికి ఉన్నారు? వాళ్ళు ముసలివాళ్ళు అవుతున్నా ఇంకా బలంగా ఉంటున్నారెందుకు?

[8] వాళ్ళు బతికి ఉండగానే వాళ్ళ సంతానం, వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళ కుటుంబాలు చక్కబడుతున్నాయి.

[9] వాళ్ళ సంతానానికి ఎలాంటి ఆపదా కలగడం లేదు. వాళ్ళు క్షేమం ఉన్నారు. దేవుని కాపుదల వాళ్ళపై ఉంటుంది.

[10] వాళ్ళ పశువులు దాటితే తప్పకుండా చూలు కలుగుతుంది. ఆవులు తేలికగా ఈనుతున్నాయి, వాటి దూడలు పుట్టగానే చనిపోవడం లేదు.

[11] వాళ్ళ పిల్లలు గుంపులు గుంపులుగా బయటికి వస్తారు. వాళ్ళు ఎగురుతూ గంతులు వేస్తారు.

[12] వాళ్ళు తంబుర, తంతివాద్యం వాయిస్తూ గొంతెత్తి పాటలు పాడుతూ సంతోషిస్తారు.

[13] వాళ్ళు సుఖంగా తమ రోజులు గడుపుతారు. అయితే ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు.

[14] వాళ్ళు “నువ్వు మాకు అక్కరలేదు, నువ్వు బోధించే జ్ఞానయుక్తమైన సంగతులు మేము వినం” అని దేవునితో చెబుతారు.

[15] “మేము సేవించడానికి సర్వశక్తుడైన ఆయన ఎంతటి వాడు? మేము ఆయనను వేడుకుంటే మాకు ఒరిగే దేమిటి?” అని వాళ్ళు అడుగుతారు.

[16] వారి ఎదుగుదల వాళ్ళ చేతుల్లో లేదు. భక్తిహీనుల తలంపులు నాకు దూరంగా ఉండుగాక.

[17] భక్తిహీనుల దీపం ఆరిపోవడం తరచుగా జరుగుతుందా? వాళ్ళ మీదికి విపత్తులు రావడం చాలా అరుదు గదా.

[18] ఆయన వాళ్ళపై కోపం తెచ్చుకుని వాళ్లకు ఆపదలు కలిగించడం, వాళ్ళను తుఫానుకు కొట్టుకుపోయే చెత్తలాగా, గాలికి ఎగిరిపోయే పొట్టులాగా చేయడం తరచూ జరగదు గదా.

[19] “వాళ్ళ పాపాలన్నీ వాళ్ళ సంతానం మీద మోపడానికి ఆయన వాటిని దాచి ఉండవచ్చు” అని మీరు అంటున్నారు. పాపం చేసిన వాళ్లే వాటిని అనుభవించేలా ఆయన వారికే ప్రతిఫలమివ్వాలి.

[20] తమ నాశనాన్ని వాళ్ళు స్వయంగా చూడాలి. సర్వశక్తుడైన దేవుని కోపాగ్నిని వారు అనుభవించాలి.

[21] వాళ్ళ జీవితకాలం ముగిసిపోయి, చనిపోయిన తరువాత ఇంటి విషయాల మీద వాళ్లకు శ్రద్ధ ఎలా ఉంటుంది?

[22] దేవునికి జ్ఞాన వివేకాలు నేర్పించేవాడు ఎవరైనా ఉన్నారా? ఆయన పరలోకంలో ఉండే నీతిమంతులకు తీర్పు తీర్చేవాడు గదా.

[23] ఒకడు సమస్త సుఖాలు అనుభవించి, మంచి ఆరోగ్యం, నెమ్మది కలిగి జీవించి చనిపోతాడు.

[24] అతడి కుండ నిండా పాలు పొర్లుతాయి. అతడి ఎముకలు సత్తువ కలిగి ఉంటాయి.

[25] మరొకడు ఎన్నడూ సుఖ సంతోషాలు అనేవి తెలియకుండా మనోవేదన గలవాడై చనిపోతాడు.

[26] ఇద్దరినీ సమానంగా ఒకే వరసలో మట్టిలో పాతిపెడతారు. ఇద్దరినీ పురుగులు కప్పివేస్తాయి.

[27] నాకు వ్యతిరేకంగా మీరు పన్నుతున్న కుట్రలు నాకు తెలుసు. మీ మనసులోని ఆలోచనలు నేను గ్రహించాను.

[28] “ఉన్నత వంశస్థుల గృహాలు ఎక్కడ ఉన్నాయి? దుర్మార్గుల నివాసాలు ఎక్కడ ఉన్నాయి?” అని మీరు అడుగుతున్నారు గదా.

[29] దేశంలో ప్రయాణాలు చేసే యాత్రికులను మీరు అడగలేకపోయారా? వాళ్ళు చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకోలేకపోయారా?

[30] ఆ విషయాలేమిటంటే, ఆపద కలిగిన రోజున దుర్మార్గులు తప్పించుకుంటారు. ఉగ్రత దిగి వచ్చే రోజున వాళ్ళు దాని నుండి పక్కకు తొలగించబడతారు.

[31] వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళకు ఎదురు నిలిచి మాట్లాడగలిగేది ఎవరు? వారు చేసిన పనులను బట్టి వారికి శిక్ష విధించేవాడు ఎవరు?

[32] వాళ్ళు చనిపోతే సమాధి అవుతారు. ఆ సమాధికి కాపలా ఉంటుంది.

[33] పళ్ళెంలో మట్టి పెంకులు వారికి సుఖం ఇస్తాయి. మనుషులంతా వాళ్ళనే అనుసరిస్తారు. గతంలో లెక్కలేనంతమంది వాళ్లకు ముందు ఇలాగే చేశారు.

[34] మీరు చెప్పే జవాబులు నమ్మదగినవిగా లేవు. ఇలాంటి వ్యర్ధమైన మాటలతో మీరు నన్నెలా ఓదార్చాలని చూస్తున్నారు?

యోబు — Chapters