Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:41

[1] అప్పుడు తేమాను వాడు ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు.

[2] మానవమాత్రులు దేవునికి ప్రయోజనకారులౌతారా? కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులు.

[3] నువ్వు నీతిమంతుడివై ఉండడం సర్వశక్తుడైన దేవునికి సంతోషమా? నువ్వు యథార్థవంతుడివై ప్రవర్తించడం ఆయనకు లాభకరమా?

[4] ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్నందువల్ల ఆయన నిన్ను గద్దిస్తాడా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యెమాడుతాడా?

[5] నీ చెడుతనం గొప్పది కాదా? నీ దోషాలు మితి లేనివి కావా?

[6] ఏమీ ఇవ్వకుండానే నీ సోదరుల దగ్గర నువ్వు తాకట్టు పెట్టుకున్నావు. వస్త్ర హీనుల బట్టలు తీసుకున్నావు.

[7] దాహంతో సొమ్మసిల్లిన వారికి నీళ్లియ్యలేదు. ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టలేదు.

[8] బాహుబలం గల వాడికే భూమి లభిస్తుంది. గొప్పవాడు అనిపించుకున్న వాడు దానిలో నివసిస్తాడు.

[9] వితంతువులను వట్టి చేతులతో పంపివేశావు. తండ్రి లేనివారి చేతులు విరగ్గొట్టావు.

[10] అందుకే బోనులు నిన్ను చుట్టుముడుతున్నాయి. అకస్మాత్తుగా కలిగే భీతి నిన్ను హడలగొడుతున్నది.

[11] నిన్ను చిక్కించుకొన్న అంధకారాన్ని నువ్వు చూడడం లేదా? నిన్ను ముంచెత్తబోతున్న ప్రళయ జలాలను నువ్వు చూడడం లేదా?

[12] దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రాల ఔన్నత్యాన్ని చూడు. అవి ఎంత ఎత్తులో ఉన్నాయి!

[13] “దేవుడికి ఏమి తెలుసు? గాఢాంధకారంలోనుండి ఆయన న్యాయం కనుగొంటాడా?

[14] దట్టమైన మేఘాలు ఆయనకు అడ్డుగా ఉన్నాయి. ఆయన మనలను చూడలేడు. ఆకాశ గోపురంలో ఆయన తిరుగుతున్నాడు” అని నీవనుకుంటావు.

[15] పూర్వకాలం నుండి దుష్టులు అనుసరించిన మార్గాన్ని నువ్వు అనుసరిస్తావా?

[16] తమ కాలం రాకముందే వారు హటాత్తుగా నిర్మూలమైపోయారు. వారి పునాదులు నదీ ప్రవాహలవలె కొట్టుకు పోయాయి.

[17] “మా దగ్గర నుండి తొలగి పో” అని దేవునితో అంటారు. “సర్వశక్తుడు మాకు ఏమి చేస్తాడులే” అంటారు.

[18] అయినా ఆయన మంచి పదార్థాలతో వారి ఇళ్ళు నింపాడు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరం అగు గాక.

[19] నీతిమంతులు దాన్ని చూసి సంతోషిస్తారు. నిర్దోషులు వారిని హేళన చేస్తారు.

[20] “మన విరోధులు నిశ్చయంగా నిర్మూలమైపోయారు. వారి సంపదను అగ్ని కాల్చివేసింది” అంటారు.

[21] ఆయనతో సహవాసం చేస్తే నీకు శాంతిసమాధానాలు కలుగుతాయి. ఆ విధంగా నీకు మేలు కలుగుతుంది.

[22] ఆయన నోటి నుండి వచ్చే ఉపదేశాన్ని అవలంబించు. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకో.

[23] సర్వశక్తుని వైపు తిరిగి నీ నివాసాల్లో నుండి దుర్మార్గాన్ని దూరంగా తొలగిస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు.

[24] మట్టిలో నీ సిరిసంపదలను, సెలయేటి నీటిలో ఓఫీరు బంగారాన్ని పారవెయ్యి.

[25] అప్పుడు సర్వశక్తుడు నీకు సువర్ణంగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు.

[26] అప్పుడు సర్వశక్తునిలో నువ్వు ఆనందిస్తావు. దేవుని వైపు నీ ముఖం ఎత్తుతావు.

[27] నువ్వు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకిస్తాడు. నీ మొక్కుబళ్లు నువ్వు చెల్లిస్తావు.

[28] నువ్వు దేనినైనా ఆలోచన చేస్తే అది నీకు స్థిరపడుతుంది. నీ మార్గాలపై వెలుగు ప్రకాశిస్తుంది.

[29] దేవుడు గర్విష్టులను వంచుతాడు. కళ్ళు దించుకునే వారిని కాపాడతాడు.

[30] నిర్దోషి కానివాడినైనా ఆయన విడిపిస్తాడు. అతడు నీ చేతుల శుద్ధి మూలంగా విడుదల పొందుతాడు.

యోబు — Chapters