[1] ముప్పయ్యో సంవత్సరం నాలుగో నెల అయిదో రోజున నేను కెబార్ నది ఒడ్డున, బందీలుగా వచ్చినవారి మధ్య ఉన్నాను. ఉన్నట్టుండి ఆకాశం తెరుచుకొంది. దేవదర్శనాలు నాకు కలిగాయి.
[2] ఆ నెలలో అయిదో రోజున (అది యెహోయాకీనురాజు బందీగా పోయిన అయిదో సంవత్సరం)
[3] కల్దీయవాళ్ళ దేశంలో, కెబార్ నది ఒడ్డున, బూజీ కొడుకూ యాజీ అయిన యెహెజ్కేలుకు యెహోవానుంచి వాక్కు వచ్చింది. అక్కడ యెహోవా చెయ్యి అతనిమీద ఉంది.
[4] నేను చూస్తూ ఉన్నప్పుడు ఉత్తర దిక్కునుంచి తుఫాను వచ్చింది. బ్రహ్మాండమైన మేఘం కనిపించింది. అందులో జ్వాలమయమైన మెరుపులు ఉన్నాయి. అతి ప్రకాశమానమైన కాంతి ఆ మేఘాన్ని ఆవరించింది. ఆ మంటలమధ్య మెరుగుపెట్టిన కంచులాంటిది ఉంది.
[5] ఆ మంటల్లో నాలుగు జీవుల ఆకారాలు కనిపించాయి. వాటి ఆకారం మనిషి రూపం లాంటిది.
[6] గాని, ఒక్కొక్కదానికి నాలుగు ముఖాలూ నాలుగు రెక్కలూ ఉన్నాయి.
[7] వాటి కాళ్ళు తిన్ననివి. వాటి పాదాలు దూడ డెక్కలవంటివి. మెరుగు పెట్టిన కంచులాగా అవి తళతళలాడుతూ ఉన్నాయి.
[8] వాటి నాలుగు ప్రక్కలకు, రెక్కలక్రింద, మనిషి చేతుల్లాంటి చేతులు ఉన్నాయి. ఆ నాలుగు జీవులకు ముఖాలూ రెక్కలూ ఉన్నాయి.
[9] వాటి రెక్కలు ఒకదానికొకటి తగులుతూ ఉన్నాయి. ఆ జీవులన్నీ తిన్నగా ముందుకు సాగుతూ ఉండేవి. అవి ప్రక్కకు ఏమీ తిరగలేదు.
[10] వాటి ముఖాలు ఇలా ఉన్నాయి: నాలుగు జీవులలో ప్రతిదానికీ మనిషి ముఖం ఉంది. కుడి ప్రక్కన సింహం ముఖం, ఎడమ ప్రక్కన ఎద్దు ముఖం ఉన్నాయి. ప్రతిదానికీ గరుడపక్షి ముఖం కూడా ఉంది.
[11] వాటి ముఖాలు అలాంటివే! వాటి రెక్కలు పైగా చాపి ఉన్నాయి. ప్రతిదాని రెక్కలలో రెండు ఇరుప్రక్కలకు ఉన్న జీవుల రెక్కలవరకు ఉన్నాయి, రెండు రెక్కలు దాని దేహాన్ని కప్పాయి.
[12] ప్రతి జీవీ తిన్నగా ముందుకు సాగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళాలని ఆత్మకు ఇష్టం ఉందో అవి ఆ వైపుకే పోతూ ఉన్నాయి. అవి ప్రక్కకు ఏమీ తిరగలేదు.
[13] ఆ జీవులు మధ్య మండుతున్న నిప్పుకణికల్లాంటివి దివిటీలలాంటివి కనిపించాయి. అవి అటూ ఇటూ పోతూ ఉన్నాయి. ఆ జ్వాల ఎంతో ప్రకాశమానమైనది. జ్వాలలోనుంచి మెరుపుతీగెలు బయలుదేరుతూ ఉన్నాయి.
[14] ఆ జీవులు మెరుపుతీగెలలాగా అటూ ఇటూ వేగంతో పోతూ ఉన్నాయి.
[15] ఆ జీవులను నేను చూస్తూ ఉంటే, ఒక చక్రం నాలుగు ముఖాలు గల ఆ జీవులలో ప్రతిదాని దగ్గర, భూమిమీద కనిపించింది.
[16] ఆ చక్రాలు, వాటి పనితనం ఇలా ఉన్నాయి: అవి గోమేధికంలాగా నిగనిగలాడుతూ ఉన్నాయి. నాలుగూ ఒకే రకం. చక్రంలో చక్రమున్నట్టుగా ఉన్నాయి.
[17] వాటి నాలుగు వైపులలో ఏ వైపుకైనా పోయేవి. అవి ప్రక్కకు ఏమీ తిరగలేదు.
[18] చక్రాల అంచులు ఎత్తుగా, భయంకరంగా ఉన్నాయి. నాలుగు అంచులకు చుట్టూ అంతటా కండ్లున్నాయి.
[19] ఆ జీవులు కదిలినప్పుడెల్లా వాటి ప్రక్కన చక్రాలు కూడా కదిలేవి. జీవులు భూమిమీదనుంచి లేస్తే చక్రాలు కూడా లేచేవి.
[20] ఎక్కడికి వెళ్ళాలని ఆత్మకు ఇష్టం ఉందో జీవులు అక్కడికే వెళ్ళేవి. వాటితోపాటు చక్రాలు లేచేవి. ఎందుకంటే, జీవులకున్న ఆత్మ చక్రాలలో ఉంది.
[21] జీవులకున్న ఆత్మ చక్రాలలో ఉండడంవల్లే జీవులు ముందుకు పోతే, ఇవీ ముందుకు పోయేవి. జీవులు ఆగితే ఇవీ ఆగేవి. జీవులు భూమిమీదనుంచి లేస్తే వాటితోపాటు ఇవీ లేచేవి.
[22] జీవుల తలలకు పైగా విశాలమైనది ఒకటి ఉంది. అది మంచుగడ్డలాగా అద్భుతంగా తళతళలాడుతూ ఉంది. అది జీవుల తలలకు పైగా వ్యాపించి ఉంది.
[23] దానిక్రింద వాటి రెక్కలు ఒకదానివైపు ఒకటి చాపి ఉన్నాయి. ప్రతి జీవీ రెక్కలలో రెండింటితో తన దేహాన్ని కప్పేది.
[24] జీవులు కదులుతూ ఉంటే, వాటి రెక్కల చప్పుడు నాకు వినిపించేది. ఆ చప్పుడు జలప్రవాహాల ఘోషలాంటిది, అమిత శక్తివంతుని కంఠ ధ్వనిలాంటిది, సైన్యం చేసే కలకలంలాంటిది. జీవులు ఆగినప్పుడు వాటి రెక్కలను దించుకొన్నాయి.
[25] అవి ఆగి రెక్కలను దించుకొని ఉంటే, వాటి తలలకు పైగా ఉన్న విశాలమైనదాని మీదనుంచి ఒక స్వరం వినబడేది.
[26] వాటి తలలకు పైగా ఉన్న ఆ విశాలమైనదానికి పైగా నీలమణిలాంటిది కనిపించింది. దాని రూపం సింహాసనాన్ని పోలినది. ఆ సింహాసనంలాంటి దానిమీద మనిషివంటి వాడొకడు కూర్చుని ఉన్నాడు.
[27] నడుమునుంచి మీదికి ఆయన రూపం మెరుస్తున్న కంచులాగా, నిప్పులాగా ఉన్నట్టు నాకు కనిపించింది. నడుమునుంచి దిగువకు ఆయన రూపం జ్వాలమయమైనట్టుంది. ఆయనను అతి ప్రకాశమానమైన కాంతి ఆవరించింది.
[28] ఆయన చుట్టూరా ఉన్న కాంతి వానకాలంలో కనిపించే రంగులవిల్లు లాంటిది. యెహోవా శోభాప్రకాశం అలా కనిపించింది. అది చూచి నేను సాష్టాంగపడ్డాను. అప్పుడు నాతో మాట్లాడుతూ ఉన్న స్వరం నాకు వినబడింది.