Skip to content
Opens in a new window

[1] మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది:

[2] “మానవపుత్రా, అమ్మోనుదేశస్థులవైపు ముఖం త్రిప్పుకొని, వాళ్ళను గురించి నా మాటగా ఇలా పలుకు:

[3] అమ్మోనువాళ్ళారా! యెహోవాప్రభు వాక్కు వినండి. యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: నా పవిత్రాలయాన్ని అపవిత్రపరచడం జరిగినప్పుడు, ఇస్రాయేల్ దేశం పాడైపోయి నప్పుడు, యూదావారు బందీలుగా దేశాంతరం పోయినప్పుడు మీరు ‘ఆహాహా’ అంటూ గేలి చేశారు.

[4] అందుచేత నేను మిమ్ములను తూర్పుజనానికి సొత్తుగా ఇస్తాను. వాళ్ళు మీ దేశంలో తమ డేరాలను వేసి మీమధ్య కాపురమేర్పరచు కొంటారు. వాళ్ళు మీ దేశం పండ్లు తింటారు, పాలు త్రాగుతారు.

[5] రబ్బాను ఒంటెలకు పచ్చిక మైదానంగా, అమ్మోనువాళ్ళ దేశాన్ని గొర్రెలదొడ్డిగా చేస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు.

[6] “యెహోవాప్రభువు అంటున్నాడు, మీరు ఇస్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా చేతులు చరచుకొన్నారు, నేల తన్నారు, మనసారా కసితో ఆనందించారు.

[7] అందుచేత నేను మీకు వ్యతిరేకంగా నా చెయ్యి చాచి మిమ్ములను దోపిడీగా ఇతర ప్రజలకిస్తాను. మిమ్ములను ఆ ప్రజలలో లేకుండా చేస్తాను. ఇతర దేశాలలో మిమ్ములను నిర్మూలిస్తాను, మిమ్ములను నాశనం చేస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు.

[8] “యెహోవాప్రభువు అంటున్నాడు, మోయాబువాళ్ళూ శేయీరువాళ్ళూ ఈ విధంగా చెపుతున్నారు గదా – ‘యూదాప్రజకూ ఇతర ప్రజలకూ ఏమీ భేదం లేదు.’

[9] అందుచేత నేను తూర్పుజనాన్ని మోయాబుదేశంలోకి రప్పిస్తాను. భూషణంలాగా ఉన్న బేత్‌యేషీమోను, బేల్‌మెయోను, కిర్యాతాయిమ్ అనే సరిహద్దు పట్టణాలను వాళ్ళు పట్టుకొంటారు.

[10] అమ్మోను ప్రజతోపాటు మోయాబుజనాన్ని వాళ్ళకు సొత్తుగా ఇస్తాను. ఆ తరువాత అమ్మోను ప్రజలు జాతులలో జ్ఞాపకానికి రారు.

[11] మోయాబు వాళ్ళను శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు.

[12] “యెహోవాప్రభువు అంటున్నాడు, ఎదోందేశస్థులు యూదాప్రజల మీద పగతీర్చుకొని ఘోరమైన అపరాధులయ్యారు.

[13] అందుచేత యెహోవాప్రభువు అంటున్నాడు, నేను ఎదోమ్కు వ్యతిరేకంగా నా చెయ్యి చాచి దాని మనుషులనూ పశువులనూ లేకుండా చేస్తాను. ఆ దేశాన్ని పాడు చేస్తాను. తేమానునుంచి దదానువరకు అందరూ కత్తిపాలవుతారు.

[14] నా ప్రజ ఇస్రాయేల్‌చేత ఎదోమ్వాళ్ళపై ప్రతీకారం చేయిస్తాను. నా ఆగ్రహానికీ కోపాగ్నికీ అనుగుణంగా వారు ఎదోమ్వాళ్లపట్ల వ్యవహరిస్తారు. నేను జరిగించే ప్రతీకారం వాళ్ళు అనుభవిస్తారు. ఇది యెహోవాప్రభు వాక్కు.

[15] “యెహోవాప్రభువు అంటున్నాడు, ఫిలిష్తీయ దేశస్థులు నా ప్రజమీద పగపట్టారు, కసి తీర్చుకొన్నారు, తీరని ద్వేషభావం కలిగి వారిని నాశనం చేయడానికి ప్రయత్నించారు,

[16] గనుక యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: నేను ఫిలిష్తీయవాళ్ళకు వ్యతిరేకంగా నా చెయ్యి చాపబోతున్నాను. కెరీతివాళ్ళను లేకుండా చేస్తాను. సముద్రతీరాన ఉంటున్న మిగతావాళ్ళను నాశనం చేస్తాను.

[17] తీవ్ర కోపంతో వాళ్ళను దండిస్తాను, భయంకరమైన ప్రతిక్రియలు జరిగిస్తాను. నేను ప్రతీకారం చేసేటప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు.”

యెహెజ్కేలు — Chapters