Skip to content
Opens in a new window

[1] తొమ్మిదో సంవత్సరం పదో నెల పదో రోజున యెహోవానుంచి వాక్కు మరోసారి నాకు వచ్చింది:

[2] “మానవపుత్రా, ఈ తేది వ్రాసిపెట్టు. ఈ రోజే వ్రాసిపెట్టు. ఈ రోజునే బబులోను రాజు జెరుసలంను ముట్టడించడం ఆరంభిస్తున్నాడు.

[3] తిరుగుబాటు చేసిన ప్రజను గురించి ఉదాహరణ చెప్పి ఇలా ప్రకటించు: యెహోవాప్రభువు ఈ విధంగా అంటున్నాడు, పొయ్యిమీద కుండ పెట్టు. దానిలో నీళ్ళు పోసి పొయ్యిమీద పెట్టు.

[4] మాంసం ముక్కలు దానిలో వెయ్యి. తొడ, జబ్బ, మొదలైన మంచి మంచి ముక్కలన్నీ దానిలో వెయ్యి. మంచి ఎముకలతో దాన్ని నింపు.

[5] గొర్రెలన్నిట్లో మంచిదాన్ని ఎన్నుకో. ఎముకలు ఉడికేలా కుండ క్రింద కట్టెలు పోగు చెయ్యి. కుండలోది బాగా ఉడకనియ్యి. ఎముకలను ఉడికించు.

[6] “దీనిగురించి యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: రక్తపాతంతో నిండి ఉన్న ఆ నగరానికి – మడ్డి గల ఆ కుండకు – బాధ తప్పదు! దానిలో నుంచి మడ్డి పోవడం లేదు. దానిలో ఉన్న ముక్కలకోసం చీట్లు వేయకుండా ముక్క వెంట ముక్క దానిలోనుంచి తీసివెయ్యి.

[7] ఆ నగరం ఒలికించిన రక్తం దానిలో కనిపిస్తూ ఉంది. అది రక్తాన్ని బండలమీద పోసింది, ధూళి దాన్ని కప్పివేసేలా నేలమీద పోయలేదు.

[8] దాని విషయం కోపాగ్ని రేకెత్తించి పగతీర్చుకోవాలని అది ఒలికించిన రక్తం కప్పబడకుండానే ఆ బండలమీద ఉండనిచ్చాను.

[9] “యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: రక్తపాతంతో నిండిన ఆ నగరానికి బాధ తప్పదు! నేను కూడా చాలా కట్టెలు పోగు చేస్తాను.

[10] అనేక కట్టెలు పేర్చు. నిప్పు రాజెయ్యి. మాంసం బాగా ఉడకబెట్టు. మసాలాపొడి కలుపు. ఎముకలు మాడిపోయేవరకు వాటిని వండు.

[11] తరువాత కుండను ఖాళీ చేసి పొయ్యిమీద మళ్ళీ పెట్టు. అది వేడి అయి మెరుగు పట్టేవరకు నిప్పుమీద ఉంచు. దానికి తగిలిన కల్మషం కరిగిపోవాలి. దాని మడ్డి దహించుకుపోవాలి.

[12] ఇదివరకు ఎంత కష్టపడి ప్రయత్నించినా దాని విస్తారమైన మడ్డి పోలేదు. ఇప్పుడు అది దాని మడ్డితో కూడా మంటల్లో ఉండాలి.

[13] “నీకు తగిలిన కల్మషం పోకిరీతనమే. నిన్ను శుద్ధి చేయాలని నాకు ఉన్నా, నీవు నన్ను శుద్ధి చేయనివ్వలేదు. అందుచేత నీమీద ఉన్న నా తీవ్ర కోపం తీరిపోయేవరకు నీవు నీ కల్మషంనుంచి శుద్ధి కాబోవు.

[14] నేను – యెహోవాను – ఈ మాట ఇచ్చాను. జరుగుతుంది. నేనే దాన్ని నెరవేరుస్తాను. నేను వెనక్కు తీయను, జాలి చూపను, పశ్చాత్తాపపడను. నీ ప్రవర్తనకూ నీ క్రియలకూ అనుగుణంగా తీర్పు తీరుస్తాను. ఇది యెహోవా వాక్కు.”

[15] మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది:

[16] “మానవపుత్రా, నీకు ప్రియమైనదానిని నీ దగ్గరనుంచి తీసివేయబోతున్నాను. అయినా నీవు విలపించకు, ఏడ్వకు, కన్నీళ్ళు విడవకు.

[17] మెల్లగా మూలగవచ్చు గాని చనిపోయినదాని గురించి విలాపం చేయకు. నీ తలమీద పాగా పెట్టి, పాదరక్షలు తొడుగుకో. నీ మూతి కప్పుకోకు. అలాంటి సమయాలలో మనుషులు తినే ఆహారం తినకు.”

[18] ఆ ప్రొద్దున నేను ప్రజలతో మాట్లాడాను. ఆ సాయంకాలం నా భార్య చనిపోయింది. యెహోవా నాకు ఆజ్ఞాపించిన ప్రకారం మరుసటి ఉదయాన నేను చేశాను.

[19] ప్రజలు నన్ను చూచి “నీవు చేసినవాటితో మాకు సంబంధమేమిటి? మాకు చెప్పవా?” అని అడిగారు.

[20] నేను వాళ్ళతో చెప్పాను, “యెహోవానుంచి వాక్కు ఇలా వచ్చింది:

[21] ‘నీవు ఇస్రాయేల్ ప్రజలకు ఈ విధంగా చెప్పు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, నా పవిత్రాలయం మీ బలాతిశయానికి కారణం, మీ దృష్టికి ప్రియం, మీ మనసుకు చాలా ఇష్టం. నేను దాన్ని పాడు చేయబోతున్నాను. మీరు జెరుసలంలో విడిచిన మీ కొడుకులూ కూతుళ్ళూ కత్తిపాలవుతారు.

[22] అలా జరిగేటప్పుడు నేను చేసినట్టే మీరు చేయాలి. మీ ముఖం క్రింది భాగాన్ని కప్పుకోకూడదు, అలాంటి సమయాలలో మనుషులు తినే ఆహారం తినకూడదు.

[23] మీ తలలమీదనుంచి పాగాలనూ, మీ పాదాలనుంచి చెప్పులనూ తీయకూడదు. మీరు విలపించకూడదు, ఏడ్వకూడదు. ఒకరినొకరు చూచి మూలుగుతూ, మీ అపరాధాల కారణంగా నీరసించిపోతారు.

[24] యెహెజ్కేలు మీకు సూచనగా ఉన్నాడు. అతడు చేసినప్రకారమే మీరు చేస్తారు. ఇలా జరిగేటప్పుడు నేనే యెహోవాప్రభువునని మీరు తెలుసుకొంటారు.’

[25] “మానవపుత్రా, నేను వాళ్ళ బలాతిశయాన్నీ సంతోషకారణాన్నీ వైభవాన్నీ వాళ్ళ కండ్లు కోరినదాన్నీ వాళ్ళ హృదయాభిలాషనూ వాళ్ళ కొడుకులనూ కూతుళ్ళనూ తీసివేస్తాను.

[26] ఆ రోజున తప్పించుకొన్న మనిషి కబురు చెప్పడానికి నీదగ్గరికి వస్తాడు.

[27] ఆ రోజునే నీ నోరు తెరవబడుతుంది. నీవు ఆ మనిషితో మాట్లాడుతావు. అప్పటినుంచి నీవు మౌనంగా ఉండవు. ఈ విధంగా నీవు వాళ్ళకు సూచనగా ఉంటావు. నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు.”

యెహెజ్కేలు — Chapters