[1] అప్పుడాయన ఆలయ ద్వారం దగ్గరికి నన్ను తీసుకుపోయాడు. ఆలయం ముందుభాగం తూర్పు దిశగా ఉంది. ఆలయం గడపక్రిందనుంచి నీళ్ళు ఉబికి తూర్పుగా పారుతూ ఉండడం నేను చూశాను. నీళ్ళు బలిపీఠానికి దక్షిణంగా ఆలయం దక్షిణ దిక్కున క్రిందనుంచి పారుతూ ఉన్నాయి.
[2] అప్పుడాయన ఉత్తర ద్వారంగుండా నన్ను వెంటబెట్టుకొని తూర్పుదిశగా ఉన్న బయటి ద్వారందగ్గరికీ గోడ బయటికీ నన్ను తీసుకుపోయాడు. అక్కడ ద్వారం దక్షిణ దిక్కునుంచి నీళ్ళుబికి పారుతూ ఉన్నాయి.
[3] ఆ వ్యక్తి కొలనూలు చేతపట్టుకుని తూర్పువైపు నడుస్తూ వెయ్యి మూరలు కొలిచాడు. అప్పుడా నీళ్ళగుండా నన్ను నడిపించాడు. నీళ్ళు చీలమండ లోతున్నాయి.
[4] అతడు మరో వెయ్యి మూరలు కొలిచి నీళ్ళగుండా నన్ను నడిపించాడు. నీళ్ళు మోకాళ్ళవరకు ఉన్నాయి. మరో వెయ్యి మూరలు కొలిచి నీళ్ళగుండా నన్ను నడిపించాడు. అక్కడ నీళ్ళు నడుమువరకు వచ్చాయి.
[5] అతడు మరో వెయ్యి మూరలు కొలిచాడు. నీళ్ళు నేను నడిచి దాటలేనంత నది అయ్యాయి. ఆ నది ఈతవల్ల తప్ప దాటలేనంత లోతైనది.
[6] ఆయన “మానవపుత్రా, ఇది చూశావు గదా” అని చెప్పి నన్ను నది ఒడ్డుదగ్గరికి మళ్ళీ చేర్చాడు.
[7] అక్కడ చేరి నేను చూస్తే నదికి అటూ ఇటూ అనేక చెట్లు కనిపించాయి.
[8] అప్పుడాయన నాతో ఇలా అన్నాడు: “ఈ నీళ్ళు ఉబికి తూర్పు ప్రదేశానికి పారి అరాబాలోయలోకి దిగి సరస్సులో పడుతాయి. అప్పుడా సముద్రం నీళ్ళు మంచి నీళ్ళవుతాయి.
[9] నది ఎక్కడ పారుతుందో అక్కడ జలచరాలన్నీ బ్రతుకుతాయి. ఈ నీళ్ళు సరస్సులో పడి దాని నీళ్ళు మంచివి అయ్యేలా చెయ్యడంవల్ల దానిలో చాలా చేపలు ఉంటాయి. నది ఎక్కడ పారుతుందో అక్కడ అన్ని బ్రతుకుతాయి.
[10] దాని ఒడ్డున చేపలు పట్టేవారు నిలబడి ఉంటారు. ఏన్‌గెదీ నుంచి ఏన్ ఎగ్లాయిం వరకు వలలు పరచి ఉంటాయి. మహా సముద్రంలో ఉన్నట్టు అనేక రకాల చేపలు దానిలో విస్తారంగా ఉంటాయి.
[11] చిత్తడి నేల, ఊబిస్థలాలు మాత్రం ఉప్పుచోట్లుగా మిగిలి ఉంటాయి. వాటి నీళ్ళు మంచి నీళ్ళుగా మారిపోవు.
[12] నదికి అటూ ఇటూ అన్ని రకాల పండ్ల చెట్లు పెరుగుతాయి. వాటి ఆకులు వాడిపోవు. అవి పండ్లు కాయకుండా ఉండవు. నది నీళ్ళు పవిత్ర స్థానంలోనుంచి పారుతూ ఉంటాయి. ఆ చెట్లు ప్రతి నెలా పండ్లు కాస్తాయి. వాటి పండ్లు ఆహారంగా, ఆకులు ఔషధంగా ఉంటాయి.
[13] “యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: మీరు వారసత్వంగా ఇస్రాయేల్ ప్రజల పన్నెండు గోత్రాలకు పంచిపెట్టవలసిన దేశం సరిహద్దులివి. మీరు యోసేపు వంశీయులకు రెండు భాగాలివ్వాలి.
[14] భేదమేమీ లేకుండా మీలో ప్రతి ఒక్కరూ దానిలో సమానంగా వారసత్వం పొందాలి. మీ పూర్వీకులకు ఇస్తానని నేను ప్రమాణం చేశాను గనుక ఈ దేశం మీకు వారసత్వంగా వస్తుంది.
[15] “దేశ సరిహద్దులేవంటే, ఉత్తర దిక్కున మహా సముద్రంనుంచి హెతలోను త్రోవమీదుగా సెదాదు దగ్గరికి పోతుంది.
[16] అక్కడనుంచి అది హమాతుకూ బేరోతాకూ సిబ్రయీంకూ (అది దమస్కు సరిహద్దుకూ హమాతు సరిహద్దుకూ మధ్య ఉంది) హాజేర్‌హాతీకోను వరకూ ఉంటుంది (అది హవ్రాను సరిహద్దు దగ్గరే ఉంది).
[17] సముద్రంనుంచి వచ్చిన ఈ సరిహద్దు దమస్కు సరిహద్దు ఉన్న హసర్ ఏనానుకు పోతుంది. దానికి ఉత్తరంగా హమాతు సరిహద్దు ఉంటుంది. ఇది ఉత్తరం సరిహద్దు.
[18] “తూర్పుదిక్కు సరిహద్దు హవ్రానుకూ దమస్కుకూ మధ్య నుంచి బయలుదేరి గిలాదు ప్రదేశానికీ ఇస్రాయేల్ దేశానికీ మధ్య ఉన్న యొర్దాను పొడుగున సాగి తూర్పు సరస్సుకు తామారువరకు పోతుంది. ఇది మీకు తూర్పు సరిహద్దు.
[19] “దక్షిణ దిక్కు సరిహద్దు తామారు నుంచి కాదేషు దగ్గర ఉన్న మెరీబా ఊటలవరకు ఉంటుంది. అక్కడనుంచి ‘ఈజిప్ట్ వాగు’ వెంట మహా సముద్రంవరకు పోతుంది. ఇది దక్షిణం సరిహద్దు.
[20] పడమటి దిక్కున దక్షిణం సరిహద్దునుంచి హమాతుకు పోయే త్రోవకు ఎదురుగా ఉన్న స్థలంవరకు మహా సముద్రమే సరిహద్దు. ఇది పడమటి సరిహద్దు.
[21] “ఇస్రాయేల్ ప్రజల గోత్రాల ప్రకారం దేశాన్ని మీరు పంచుకోవాలి.
[22] మీకూ మీ మధ్య ఉంటూ పిల్లలు కన్న విదేశీయులనూ వారసత్వంగా చీట్లు వేసి పంచిపెట్టాలి. ఆ విదేశీయులనూ దేశంలో పుట్టిన ఇస్రాయేల్‌వారినీ మీరు ఏక దృష్టితో చూడాలి. చీట్లు వేసి మీతోపాటు వారికి ఇస్రాయేల్ గోత్రికుల మధ్య వారసత్వం ఏర్పాటు చేయాలి.
[23] ఏ గోత్రికులమధ్య ఆ విదేశీయులు కాపురముంటారో ఆ గోత్ర భూభాగంలో వారికి వారసత్వమివ్వాలి. ఇది యెహోవా ప్రభు వాక్కు.