[1] మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది:
[2] “మానవపుత్రా, తూరు విషయం విలాపం ఎత్తి, దానికి ఇలా చెప్పు:
[3] సముద్రం రేవుల మధ్య ఉన్న నివాసీ! అనేక తీరాల ప్రజలకు వర్తక జనమా! యెహోవాప్రభువు ఈ విధంగా అంటున్నాడు: తూరు! ‘వంకలేని అందం నాది’ అంటున్నావు నీవు.
[4] నీ సరిహద్ధులు సముద్రంలో ఉన్నాయి. నీ నిర్మాతలు నీ అందాన్ని లోపం లేనిదిగా చేశారు.
[5] వాళ్ళు శెనీర్ ప్రదేశంనుంచి వచ్చిన సరళవృక్షం మ్రానుతో నీ పలకలు చేశారు. నీ ఓడ స్తంభాలను చేయడానికి లెబానోనునుంచి దేవదారు మ్రాను తెప్పించారు.
[6] బాషానునుంచి వచ్చిన సిందూర మ్రానుతో నీ తెడ్లు తయారు చేశారు. కిత్తీం ద్వీపంనుంచి వచ్చిన మ్రానుతో నీ ఓడ పైభాగం చేసి దానికి దంతం పొదిగారు.
[7] ఈజిప్ట్‌లో తయారై బుట్టాలు వేసిన శ్రేష్ఠమైన నార బట్టతో నీ తెరచాప వేశారు. అది నీ జెండా కూడా. ఎలీషా ద్వీపంనుంచి ఊదారంగు, నీలిరంగు బట్ట తెప్పించి నీకు చాందిని చేశారు.
[8] సీదోను పట్టణస్థులూ అర్వదు నివాసులూ నీ తెడ్లు నడిపేవాళ్ళు. తూరు! నీ పౌరులలో ఆరితేరినవాళ్ళు నీకు ఓడ నాయకులుగా ఉండేవాళ్ళు.
[9] గెబల్ పట్టణంవాళ్ళలో దీర్ఘానుభవం గల పనివాళ్ళు నీ ఓడను బాగు చేసేవాళ్ళు. నీ సరుకులు కొనడానికి సముద్రంలో ఉన్న ఓడలన్నీ నావికులంతా నీదగ్గరికి వచ్చేవారు.
[10] “పారసీక, లూదు, పూత్ దేశాల వాళ్ళు సిపాయిలుగా నీ సైన్యంలో చేరారు. వాళ్ళు డాళ్ళనూ ఇనుప శిరస్త్రాణాలనూ నీలో వ్రేలాడదీశారు. వాళ్ళు నీకు వైభవం చేకూర్చారు.
[11] అర్వదువాళ్ళు నీ సైన్యంలో చేరి అన్ని వైపులా నీ గోడలమీద, నీ బురుజులలో కావలివాళ్ళుగా ఉండేవాళ్ళు. నీ గోడలన్నిటికీ డాళ్ళు తగిలించారు. నీ అందాన్ని లోపం లేనిదిగా వాళ్ళు చేశారు.
[12] “నీలో అనేక రకాల సరుకులు సమృద్ధిగా ఉండడంచేత తర్షీషు దేశస్థులు నీతో వ్యాపారం చేశారు. వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చి నీ సరుకులు కొన్నారు.
[13] “గ్రీసు, తుబాల్, మెషెకు దేశాల వాళ్ళు నీతో వ్యాపారం చేశారు. బానిసలనూ కంచు వస్తువులనూ ఇచ్చి నీ సరుకులు కొన్నారు.
[14] “తోగర్మా దేశస్థులు గుర్రాలనూ యుద్ధాశ్వాలనూ కంచర గాడిదలనూ ఇచ్చి నీ సరుకులు కొన్నారు.
[15] “దదానువాళ్ళు నీతో వ్యాపారం చేశారు. అనేక సముద్రతీరాల నివాసులు నీ సరుకులు కొన్నారు. వాళ్ళు దంతం, కోవిదారు మ్రాను తెచ్చి ఇచ్చారు.
[16] “నీలో అనేక రకాల వస్తువులు ఉండడంబట్టి సిరియా దేశస్థులు నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు పచ్చ రాళ్ళు, ఊదారంగు బట్ట, బుట్టాలు వేసిన బట్ట, సున్నితమైన నారబట్ట, పగడం, మాణిక్యాలు ఇచ్చి నీ సరుకులు కొన్నారు.
[17] “యూదావారూ ఇస్రాయేల్‌వారూ నీతో వ్యాపారం చేశారు. నీ సరుకులకోసం మిన్నీత్‌నుంచి గోధుమలు, మిఠాయిలు, తేనె, నూనె, గుగ్గిలం తెచ్చి ఇచ్చారు.
[18] “నీ అధిక వస్తు సంపత్తు కారణంగా దమస్కు నగరవాసులు హెల్‌బోనునుంచి ద్రాక్షరసం, తెల్ల గొర్రెబొచ్చు తెచ్చి నీతో వ్యాపారం చేశారు.
[19] “ఉజాల్‌లో కాపురమున్న దానీయులు, గ్రీసువాళ్ళు నీ సరుకులకు ఇనుప పనిముట్లు, కసింద, చెరకు బదులిచ్చారు.
[20] “దదానువాళ్ళు గుర్రపు జీనులకోసమైన బట్టలు తెచ్చి వ్యాపారం చేశారు.
[21] “అరబీవాళ్ళు, కేదారు నాయకులంతా నీతో వర్తకం చేశారు. వాళ్ళు గొర్రెపిల్లలనూ పొట్టేళ్ళనూ మేకలనూ ఇచ్చి నీ సరుకులు కొన్నారు.
[22] “షేబ, రమా వర్తకులు నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు మసాలా వస్తువులన్నిట్లో మంచివాటినీ వేరువేరు విలువైన రత్నాలనూ బంగారాన్నీ ఇచ్చి నీ సరుకులు కొన్నారు.
[23] “హారాను పట్టణస్థులూ కన్నే, ఎదెను వాళ్ళూ, షేబ, అష్షూరు, కిలమాదులో ఉన్న వర్తకులూ నీతో వ్యాపారం చేశారు.
[24] నీ బజార్లలో వాళ్ళు అందమైన దుస్తులు, నీలిరంగు బట్ట, బుట్టాలు వేసిన బట్ట, అనేక రంగులు గల తివాసీలు, గట్టిగా అల్లిన త్రాళ్ళు ఇచ్చి నీ సరుకులు కొన్నారు.
[25] “తర్షీషు ఓడలు నీ సరుకులు వేరువేరు స్థలాలకు తీసుకుపోయేవి. నీవు సమృద్ధి గల దానివై ఘనంగా సముద్రంలో కూర్చుని ఉన్నావు.
[26] తెడ్లతో ఓడ నడిపేవాళ్ళు నిన్ను మహా సముద్రంలోకి తీసుకుపోయారు. అయితే తూర్పు గాలి సముద్ర మధ్యలో నిన్ను బ్రద్దలు చేస్తుంది.
[27] నీవు ధ్వంసమయ్యే రోజున నీ ధనం, సరుకులు, వర్తక వస్తువులు, నావికులు, ఓడ నాయకులు, ఓడ బాగు చేసేవాళ్ళు, వర్తకులు, సిపాయిలందరూ నీలో ఉన్నవాళ్ళంతా సముద్రమధ్యలో మునిగిపోతారు.
[28] నీ ఓడ నాయకులు కేకలు పెట్టేటప్పుడు నీ ప్రాంతం భూములు కంపిస్తాయి.
[29] తెడ్లు చేతపట్టుకొనే వాళ్ళంతా తమ ఓడలు వదలివేస్తారు. నావికులూ ఓడ నాయకులూ ఒడ్డున నిలబడి ఉంటారు.
[30] నీ గురించి కంఠమెత్తి వెక్కి వెక్కి ఏడుస్తారు. తమ తలలమీద మట్టి పోసుకొని బూడిదలో పొర్లుతారు.
[31] నీకోసం తలలు బోడి చేసుకొని మొలలకు గోనెపట్ట కట్టుకొని మనోవేదనతో నీ విషయం దుఃఖాక్రాంతులై విలపిస్తారు.
[32] వాళ్ళు శోకిస్తూ నిన్ను గురించి ఇలా విలాపం చేస్తారు: తూరులాంటి నగరమేది? ఇప్పుడు సముద్రంలో మునిగి నిశ్శబ్దంగా ఉన్న తూరులాంటి నగరమేది?
[33] సముద్రంమీద నీ సరుకులు పోతూ ఉంటే, అనేక దేశాలవాళ్ళకు తృప్తి కలిగింది. నీ గొప్ప ఐశ్వర్యం, వర్తకం మూలంగా భూరాజులు ధనికులయ్యారు.
[34] ఇప్పుడు నీవు అగాధ జలాలలో మునిగి సముద్ర బలంచేత బ్రద్దలయ్యావు. నీ సరుకులూ నీ జనసమూహమంతా నీతో కూడా మునిగాయి.
[35] సముద్రతీరాల వాసులు నీ కారణంగా నిర్ఘాంతపోయారు. వాళ్ళ రాజులు భయాక్రాంతులై వణకుతున్నారు. వాళ్ళ ముఖాకృతి వికారమైపోయింది.
[36] జనాలలో వర్తకులు ఆశ్చర్యంతో ఈల వేస్తారు. నీవు భయంకరమైన అంతానికి వచ్చావు. నీవు ఇక ఉండవు.”