Skip to content
Opens in a new window

[1] యెహోవా! మాకు జరిగినది జ్ఞాపకం ఉంచుకో. మావైపు చూచి మా అవమానాన్ని గమనించు.

[2] మా వారసత్వం విదేశీయుల వశం అయింది. మా ఇండ్లు పరాయివాళ్ళ స్వాధీనం అయ్యాయి.

[3] మేము అనాథలమయ్యాం, తండ్రిలేని వాళ్ళమయ్యాం. మా తల్లులు వితంతువులయ్యారు.

[4] త్రాగేనీళ్ళు మేము కొనుక్కోవాలి. వెల ఇచ్చి కట్టెలు తెచ్చుకోవాలి.

[5] మమ్మల్ని తరిమేవాళ్ళు మా మెడలమీదికి ఎక్కుతున్నారు. మేము అలసిపోయాం, విశ్రాంతి అంటూ మాకు లేదు.

[6] పొట్టకూటికి ఈజిప్ట్, అష్షూరు దేశాల వాళ్ళకు లొంగిపోయాం.

[7] మా పూర్వీకులు అపరాధం చేసి గతించిపోయారు. వారి శిక్షను మేమూ అనుభవిస్తూ ఉన్నాం.

[8] దాసులు మాకు పరిపాలకులయ్యారు. వాళ్ళ వశంలోనుంచి మమ్మల్ని విడిపించడానికి ఎవరూ లేరు.

[9] ఎడారిలో ఉన్న ఖడ్గం కారణంగా ప్రాణాలకు కూడా తెగించి ఆహారాన్ని తెచ్చుకొంటున్నాం.

[10] కరవువల్ల తగిలిన జ్వరంచేత మా చర్మం పొయ్యిలాగా వేడెక్కి మాడిపోయింది.

[11] సీయోనులో శత్రువులు స్త్రీలను చెరిపారు. యూదా పట్టణాలలో కన్యలను చెరపట్టారు.

[12] అధికారుల చేతులకు త్రాడు కట్టి వారిని వ్రేలాడవేశారు. వాళ్ళు పెద్దలను ఏ మాత్రం గౌరవించలేదు.

[13] యువకులు తిరగళ్ళు విసిరారు. పిల్లవాళ్ళు కట్టెల మోపు మోయలేక తొట్రుపడ్డారు.

[14] పెద్దలు నగర ద్వారం దగ్గర సమకూడడం లేదు. యువకుల సంగీతం వినబడడం లేదు.

[15] సంతోషం మా హృదయంలో లేకుండా పోయింది. మా నాట్యం దుఃఖంగా మారిపోయింది.

[16] మా తలమీదనుంచి కిరీటం పడిపోయింది. మేము అపరాధాలు చేశాం. అయ్యో, మాకు బాధ!

[17] దీనివల్ల మా ధైర్యం చెడిపోయింది. సీయోను పర్వతం పాడైపోయింది.

[18] దానిమీద నక్కలు తిరుగుతూ ఉన్నాయి. ఇదంతా చూచి మా కండ్లు మసకబారిపొయ్యాయి.

[19] యెహోవా! నీవు శాశ్వతంగా పరిపాలన చేస్తావు. నీ సింహాసనం తరతరాలకు ఉంటుంది.

[20] నీవు మమ్మల్ని ఎందుకు ఎప్పటికీ మరచిపోతున్నావు? ఇంత కాలం మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు?

[21] యెహోవా! మమ్మల్ని నీదగ్గరికి తిరిగి వచ్చేలా చెయ్యి. అప్పుడు తిరిగి వస్తాం.

[22] నీవు మమ్మల్ని పూర్తిగా విసర్జించకపోతే, అపరిమితంగా మా మీద కోపగిస్తూ ఉండకపోతే, మునుపు ఉన్న క్షేమస్థితిని మాకు మళ్ళీ కలిగించు.

విలాపవాక్యాలు — Chapters