Skip to content
Opens in a new window

[1] మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది:

[2] “మానవపుత్రా, జెరుసలంకు దాని అసహ్యకరమైన పనులను తెలియజేస్తూ ఇలా చెప్పు:

[3] యెహోవాప్రభువు జెరుసలంకు చెప్పేదేమిటంటే, నీ ఉత్పత్తి, నీ జన్మం కనానువాళ్ళ దేశానికి చెందినవే. నీ తండ్రి అమోరీ జాతివాడు, నీ తల్లి హిత్తిజాతి స్త్రీ.

[4] నీ పుట్టుక చూస్తే, నీవు జన్మించిన రోజు నీ బొడ్డును కోయడం జరగలేదు. నిన్ను శుభ్రం చేయడానికి నీళ్ళతో కడగడం జరగలేదు. నీకు ఉప్పు రాయడమూ బట్ట చుట్టడమూ జరగలేదు.

[5] నిన్ను ఎవరూ దయ చూడలేదు. ఆ పనులలో ఒకటైనా నీకు చేయాలని ఎవరికీ జాలి వేయలేదు. నీవు పుట్టిన రోజు నిరాకరణకు గురి అయ్యావు. బయట నేలను పారవేయబడ్డావు నీవు.

[6] “అప్పుడు నేను ఆ వైపుకు వచ్చి నీ రక్తంలో పడి తన్నుకొంటూ ఉన్న నిన్ను చూశాను. నీ రక్తంలో పడి ఉన్న నీతో ‘బ్రతుకు!’ అన్నాను. నీవు నీ రక్తంలో ఇంకా పడి ఉన్నప్పుడు ‘బ్రతుకు!’ అన్నాను.

[7] పొలంలో ఉన్న మొక్క ఎదిగే విధంగా నీవు ఎదిగేలా నేను చేశాను. నీవు పెరిగి పెద్దదానివయ్యావు. ఆభరణాలతో అలంకరించుకోవడం మొదలుపెట్టావు. నీకు స్తనాలు ఏర్పడ్డాయి, నీ తలవెంట్రుకలు పెరిగాయి. అయినా, నీకు బట్టలు లేవు. దిగంబరంగా ఉన్నావు.

[8] నేను మళ్ళీ ఆ వైపుకు వచ్చి ప్రేమకు తగిన వయసు నీకు ఉండడం చూశాను. అందుచేత నా వస్త్రం చెంగుతో నీ దిగంబరత్వాన్ని కప్పి నీతో వివాహ నిబంధన చేసుకొని నీతో శపథం చేసుకొన్నాను. నీవు నా దానివయ్యావు.

[9] “నేను నీకు నీళ్ళతో స్నానం చేయించి, నీమీద ఉన్న రక్తం కడిగి నిన్ను నూనెతో అంటి ఉన్నాను.

[10] బుట్టా వేసిన వస్త్రం, సున్నితమైన తోలు చెప్పులు నీకు తొడిగించాను. శ్రేష్ఠమైన బట్టలు, పట్టుబట్టలు నీకు వేయించాను.

[11] అభరణాలతో నిన్ను అలంకరించాను. నీ చేతులకు కడియాలు పెట్టి నీకు కంఠభూషణం తగిలించి

[12] నీ చెవులకూ ముక్కుకూ నగలు, నీ తలకు అందమైన కిరీటం పెట్టాను.

[13] ఆ విధంగా నీవు వెండి బంగారాలతో అలంకరించబడ్డావు. నీ వస్త్రాలు శ్రేష్ఠమైన బట్ట, పట్టుబట్ట, బుట్టాలు వేసిన బట్ట. నీ ఆహారం సన్నని గోధుమ పిండి, తేనె, ఆలీవ్‌నూనె. నీవు చాలా అందకత్తెవయ్యావు, రాణివయ్యావు.

[14] నేను నీకు ప్రసాదించిన నా శోభకారణంగా నీ అందానికి లోపం లేకపోయింది గనుక నీ అందాన్ని గురించిన కీర్తి వేరువేరు దేశాలకు వ్యాపిస్తూ వచ్చింది. ఇది యెహోవాప్రభు వాక్కు.

[15] “అయితే నీవు నీ అందంమీద నమ్మకం ఉంచి నీ కీర్తిని ఆధారం చేసుకొని వేశ్యవయ్యావు. దారిన పొయ్యేవాళ్ళందరితో మస్తుగా వ్యభిచారం చేస్తూ వచ్చావు. ఎవడు పిలిస్తే వాడితో పోయావు.

[16] నీ బట్టలలో కొన్ని తీసి వాటితో చిత్రవిచిత్రమైన ఎత్తయిన పూజాస్థలాలను చేసుకొన్నావు. వాటిమీద వేశ్యలాగా ప్రవర్తించావు. అలాంటి పనులు ఎంతమాత్రం తగవు. అవి ఎన్నడూ జరగకూడదు.

[17] “నేను నీకిచ్చిన అందమైన ఆభరణాల వెండి బంగారాలను తీసుకొని పురుష రూప విగ్రహాలను చేసుకొని వాటితో వేశ్యలాగా ప్రవర్తించావు.

[18] బుట్టాలు వేసిన నీ బట్టలను తీసి ఆ విగ్రహాలకు తొడిగించావు. నా నూనె, నా ధూపం వాటికి అర్పించావు.

[19] తినడానికి నేను నీకిచ్చిన ఆహారం – ఆ సన్నని గోధుమపిండి, ఆలీవ్‌నూనె, తేనె – పరిమళ నైవేద్యంగా ఆ విగ్రహాలకు అర్పించావు. అలాగే జరిగింది గదా. ఇది యెహోవాప్రభు వాక్కు.

[20] “అంతేకాదు. నీవు నాకు కన్న కొడుకులనూ కూతుళ్ళనూ ఆహారంగా ఆ విగ్రహాలకు బలి చేశావు. నీవు వేశ్యగా ప్రవర్తించడం చాలదనుకొన్నావా?

[21] నా పిల్లలను వధించి బలిగా ఆ విగ్రహాలకు అర్పించావు!

[22] నీవు వ్యభిచారం చేస్తూ, నీ అసహ్యమైన పనులన్నీ చేస్తూ ఉన్నప్పుడు, నీకు నీ బాల్యం జ్ఞప్తికి రాలేదు. బట్టలేమీ లేక దిగంబరంగా ఉండి, నీ రక్తంలో తన్నుకొంటూ ఉన్న సంగతి మరిచిపోయావు.

[23] “నీకు బాధ తప్పదు. ఇది యెహోవాప్రభు వాక్కు. నీకు బాధ తప్పదు. నీ చెడుతనమంతటితో మరొకటి కలిపావు.

[24] ప్రతి నడివీధి ప్రక్కన మట్టిదిబ్బ వేసి, ఆ ఎత్తయిన పూజా స్థలాలను కట్టావు.

[25] ప్రతి అడ్డత్రోవను నీ దైవపీఠాలను కట్టి నీ అందాన్ని అవమానపరచుకొని ఆ వైపుకు వచ్చే ప్రతివాడితో పడుకొన్నావు. నీ పడుపు పనులు మరీ మరీ ఎక్కువవుతూ వచ్చాయి.

[26] ఈజిప్ట్‌వాళ్ళతో, అధిక కామాతురత ఉన్న ఆ నీ పొరుగువాళ్ళతో నీవు వ్యభిచారం చేశావు. మరీ ఎక్కువ అవుతూ ఉన్న నీ పడుపు పనులతో నాకు కోపం రేపావు.

[27] అందుచేత నేను నీకు వ్యతిరేకంగా నా చెయ్యి చాపి, నీ జీవనోపాధిని తక్కువ చేశాను. నిన్ను ద్వేషించిన ఫిలిష్తీయదేశ స్త్రీల చేతికి నిన్ను ఇచ్చాను. నీ పోకిరి పనులంటే వాళ్ళకు సిగ్గనిపించింది.

[28] ఇంకా తృప్తిపడక నీవు అష్షూరువాళ్ళతో కూడా వ్యభిచారం చేశావు. వాళ్ళతో వ్యభిచరించినా నీకు తృప్తి కలగలేదు.

[29] తరువాత వర్తకుల దేశమైన కల్దీయ దేశం వాళ్ళతో అధికంగా వ్యభిచరించావు. అయినా నీకు తృప్తి కలగలేదు.

[30] “సిగ్గుమాలిన వేశ్యలాగా ప్రవర్తిస్తూ, ఆ కార్యాలన్నీ చేస్తూ ఉంటే నీ హృదయం ఎంత నీరసంగా ఉంది! ఇది యెహోవాప్రభు వాక్కు.

[31] నీవు ప్రతి అడ్డత్రోవను మట్టిదిబ్బ వేసి ప్రతి నడివీధిప్రక్కన ఎత్తుగా దైవపీఠం కట్టినప్పుడు ఒక విషయంలో వేశ్యలాంటిదానివి కావు – నీవు జీతం తిరస్కరించావు.

[32] నీవు వ్యభిచరించే భార్యలాగా ఉన్నావు. అలాంటి భార్య భర్తకు బదులుగా పరాయివాళ్ళను స్వీకరిస్తుంది గదా.

[33] ప్రతి వేశ్య పురుషులిచ్చే పడుపుసొమ్ము తీసుకొంటుంది గదా. నీవైతే నీ విటులందరికీ సొమ్ము ఇస్తున్నావు. వ్యభిచారం కోసం నలుదిక్కులనుంచి రావాలని వాళ్ళకు బహుమతులు ఇస్తున్నావు.

[34] నీ పడుపుపనులలో నీకూ ఇతర వేశ్యలకూ మధ్య ఉన్న భేదం అదే. వ్యభిచరించడానికి ఎవ్వడూ నీ వెంట తిరగడం లేదు, నీకు పడుపుసొమ్ము ఇవ్వడం లేదు గాని నీవే జీతం ఇస్తున్నావు. నీకూ ఇతర వేశ్యలకూ మధ్య ఉన్న భేదం ఇదే.

[35] “కాబట్టి, వేశ్యా, యెహోవా వాక్కు విను.

[36] యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, నీ విటులతో చేసిన పడుపు పనులలో నీ సొమ్ము వ్యయపరచి నీ దిగంబరత్వాన్ని కనపరచిన కారణంగా, నీ అసహ్యమైన విగ్రహాల కారణంగా, ఆ విగ్రహాలకు నీ పిల్లల రక్తం అర్పించడం కారణంగా నేను ఇలా చేస్తాను:

[37] నీవు ఎవరితో సుఖించావో ఆ నీ విటులందరినీ సమకూరుస్తాను. నీవు ప్రేమించినవాళ్ళతోపాటు నీవు ద్వేషించినవాళ్ళను అందరినీ పోగు చేస్తాను. నీకు వ్యతిరేకంగా వాళ్ళను సమకూర్చి, వాళ్ళ ఎదుట నీ బట్టలు తీసివేసి నీ దిగంబరత్వాన్ని వాళ్ళకు కనపరుస్తాను.

[38] వ్యభిచారం చేసిన స్త్రీలకూ హత్యచేసిన స్త్రీలకూ రావలసిన దండన నీకు విధిస్తాను. నీపట్ల రోషం, కోపాగ్ని, రక్తపాతం నియమిస్తాను.

[39] వాళ్ళ చేతికి నిన్ను అప్పగిస్తాను. వాళ్ళు ఈ మట్టిదిబ్బలు నేలమట్టం చేసి, నీ ఎత్తయిన పూజాస్థలాలను పడగొట్టి నీ బట్టలూ అందమైన ఆభరణాలూ తీసుకొని నిన్ను దిగంబరంగా, ఏ వస్త్రమూ లేనిదానినిగా చేస్తారు.

[40] వాళ్ళు నీమీదికి మూకను పురికొలిపి నిన్ను రాళ్ళతో కొట్టి ఖడ్గాలతో ముక్కలు ముక్కలుగా కోసివేస్తారు.

[41] వాళ్ళు నీ ఇండ్లను కాల్చివేసి అనేక స్త్రీల కళ్ళెదుటే నిన్ను దండిస్తారు. నీవు ఇంకా వేశ్యగా ప్రవర్తించకుండా అవుతావు. విటులకు నీవు ఇకనుంచి సొమ్ము ఇవ్వవు.

[42] “అప్పుడు నీమీద ఉన్న నా కోపాగ్ని చల్లారిపోతుంది. నీపట్ల ఉన్న నా రోషం లేకుండా పోతుంది. అప్పటినుంచి నీమీద కోపపడను. ప్రశాంతంగా ఉంటాను.

[43] నీ బాల్యాన్ని గురించి తలచుకోకుండా నీవు చేసినవాటన్నిటిచేతా నాకు కోపం రేపుతూ వచ్చావు గనుక నీ క్రియల ఫలం నీవు అనుభవించేలా చేస్తాను. ఇది యెహోవాప్రభు వాక్కు. నీ అసహ్యమైన అలవాట్లన్నిటితోనూ నీవు ఆ పోకిరీ పనులను కలిపావు గదా.

[44] “సామెతలు చెప్పే ప్రతి ఒక్కరూ నిన్ను గురించి ‘తల్లిలాగే పిల్ల’ అనే సామెత చెపుతారు.

[45] నీ తల్లి తన భర్తనూ పిల్లలనూ తృణీకరించింది. నీవు ఆమెకు వాస్తవమైన కూతురువు. నీ అక్క చెల్లెండ్రు తమ భర్తలనూ పిల్లలనూ తృణీకరించారు. నీవు వాళ్ళకు వాస్తవమైన సోదరివి. నీ తల్లి హిత్తిజాతికి చెందినది. నీ తండ్రి అమోరీవాడు.

[46] నీ అక్క ఉత్తరదిక్కున తన కూతుళ్ళతోపాటు ఉన్న షోమ్రోను. నీ చెల్లెలు దక్షిణ దిక్కున తన కూతుళ్ళతోపాటు ఉన్న సొదొమ,

[47] ఆ నీ అక్క చెల్లెండ్ర త్రోవలలో నడవడమూ వాళ్ళ అసహ్యమైన క్రియలప్రకారం చేయడమూ చిన్న సంగతి అనుకొని నీవు అన్నిట్లోనూ వాళ్ళకంటే నీచంగా ప్రవర్తించావు.

[48] నీవూ నీ కూతుళ్ళూ చేసినట్లు నీ చెల్లెలు సొదొమ, దాని కూతుళ్ళు చేయలేదని నా జీవంతోడు చెపుతున్నావు. ఇది యెహోవాప్రభు వాక్కు.

[49] “నీ చెల్లెలు సొదొమ అపరాధం ఏమిటంటే, దానికీ దాని కూతుళ్ళకూ ఉన్న గర్వం, తిండిబోతుతనం, సోమరితనం. అది దీనావస్థలో ఉన్నవారికీ దరిద్రులకూ సహాయం చేయలేదు.

[50] వాళ్ళు విర్రవీగుతూ, నా ఎదుట అసహ్యమైన కార్యాలు చేస్తూ వచ్చారు, గనుక నేను ఇది చూచి వాళ్ళను తొలగించాను.

[51] షోమ్రోను కూడా నీ పాపాలలో సగమైనా చేయలేదు. వాళ్ళకంటే నీవు ఎన్నో ఎక్కువ అసహ్యమైన కార్యాలు చేశావు. నీ అసహ్య కార్యాలన్నీ చూస్తే నీ అక్కచెల్లెండ్రు నిర్దోషుల్లాగా కనిపిస్తున్నారు!

[52] వాళ్ళకంటే నీవు ఎక్కువ అసహ్యకరమైన కార్యాలు చేసినందుచేత వాళ్ళు నీకంటే మంచివాళ్ళని తీర్పు తీర్చినట్టున్నావు! కాబట్టి నీవు నిందలపాలవుతావు. నీ కారణంగా వాళ్ళు నిర్దోషులుగా కనిపించడంవల్ల నీవు సిగ్గుకూ నిందలకూ గురి అవుతావు.

[53] “నేను సొదొమనూ దాని కూతుళ్ళనూ, షోమ్రోనునూ దాని కూతుళ్ళనూ పూర్వక్షేమస్థితికి తెస్తాను.

[54] నీవు చేసినవాటన్నిటి మూలంగా వాళ్ళకు ఆదరణ కలిగించినందుచేత నీవు సిగ్గుకూ నిందలకూ గురి అయ్యేలా వాళ్ళతోకూడా నిన్ను పూర్వక్షేమస్థితికి తెస్తాను.

[55] నీ అక్కచెల్లెండ్రు – సొదొమ, దాని కూతుళ్ళు, షోమ్రోను, దాని కూతుళ్ళు – ముందున్న స్థితికి వచ్చినప్పుడు నీవూ నీ కూతుళ్ళూ కూడా ముందున్న స్థితికి వస్తారు.

[56] నీ చెడుతనం వెల్లడి కాకముందు, నీవు ఇంకా గర్విస్తూ ఉన్న రోజుల్లో నీ చెల్లెలు సొదొమ పేరు చెప్పడానికైనా నీకు ఇష్టం లేదు.

[57] ఇప్పుడు నిన్ను తృణీకరించే ఫిలిష్తీయవాళ్ళ కూతుళ్ళూ సిరియావాళ్ళ కూతుళ్ళూ – నీ చుట్టు ఉన్న వాళ్ళంతా – నిన్ను తిరస్కరిస్తున్నారు.

[58] నీ పోకిరి పనులవల్లా నీ అసహ్యకరమైన అలవాట్లవల్లా కలిగే ఫలితం నీవు అనుభవిస్తున్నావు. ఇది యెహోవా వాక్కు.

[59] “యెహోవాప్రభువు ఇలా చెపుతున్నాడు: నీవు నీ ప్రమాణం అలక్ష్యం చేసి నా ఒడంబడికను మీరావు. అందుచేత నీకు తగినట్టే నీపట్ల వ్యవహరిస్తాను.

[60] అయినా, నీ బాల్యంలో నేను నీతో చేసిన ఒడంబడిక తలచుకొని ఎప్పటికీ నిలిచి ఉండే ఒడంబడిక నీతో చేసి సుస్థిరం చేస్తాను.

[61] నీ అక్క చెల్లెండ్రు ఆ ఒడంబడికలో పాలిభాగస్థులు కాకపోయినా, నేను వాళ్ళను నీకు కూతుళ్ళుగా ఇస్తాను. నీవు వాళ్ళను చేర్చుకొనేటప్పుడు నీ ప్రవర్తన జ్ఞాపకం చేసుకొని సిగ్గుపాలవుతావు.

[62] అయితే నేను నీతో నా ఒడంబడిక స్థిరపరుస్తాను. నేనే యెహోవానని నీవు తెలుసుకొంటావు.

[63] నీవు చేసినవాటన్నిటికీ నేను ప్రాయశ్చిత్తం చేస్తాను. అప్పుడు నీవు నీ ప్రవర్తన జ్ఞాపకం చేసుకొని సిగ్గుపడి మౌనం వహిస్తావు. ఇది యెహోవాప్రభు వాక్కు.

యెహెజ్కేలు — Chapters