Skip to content
Opens in a new window

[1] “మానవపుత్రా, గోగు గురించి దైవావేశపూర్వకంగా ఇలా పలుకు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, గోగూ! రోషుకూ మెషెకుకూ తుబాలుకూ అధిపతీ! నేను నీకు వ్యతిరేకిని.

[2] నేను నిన్ను వెనక్కు త్రిప్పి తోలుకొంటూ ఉత్తరదిక్కున చాలా దూరంగా ఉన్న స్థలంనుంచి ఇస్రాయేల్ పర్వతాలమీదికి రప్పిస్తాను.

[3] అప్పుడు నీ ఎడమచేతిలో ఉన్న నీ వింటిని క్రింద పడగొట్టివేస్తాను, నీ కుడిచేతిలో ఉన్న బాణాలు క్రింద పడవేస్తాను.

[4] నీవు, నీ సైన్యాలన్నీ, నీతోకూడా ఉండే జనాలన్నీ ఇస్రాయేల్ పర్వతాలమీద కూలుతారు. కుళ్ళిన మాంసం తినే అన్ని రకాల పక్షులకూ అడవి మృగాలకూ నేను నిన్ను తిండిగా ఇస్తాను.

[5] నీవు మైదాన భూమిలో కూలుతావు. నేనే ఈ మాట ఇచ్చాను. ఇది యెహోవాప్రభు వాక్కు.

[6] నేను మాగోగుమీదికీ, సముద్ర తీరాల ప్రాంతాలలో అశ్రద్ధగా నివాసమున్నవాళ్ళ మీదికీ మంటలు పంపిస్తాను. నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు.

[7] “నేను నా పవిత్రమైన పేరును నా ఇస్రాయేల్ ప్రజలమధ్య వెల్లడిస్తాను. అప్పటినుంచి నా పవిత్రమైన పేరు దూషణకు గురి కాకుండా చేస్తాను. అప్పుడు నేనే యెహోవాననీ ఇస్రాయేల్‌లో పవిత్రుణ్ణనీ ఇతర జనాలకు తెలియవస్తుంది.

[8] ఆ కాలం నేను మునుపు తెలియజెప్పిన కాలం. అది వస్తుంది. ఈ విధంగా జరగబోతుంది. ఇది యెహోవాప్రభు వాక్కు.

[9] అప్పుడు ఇస్రాయేల్ పట్టణాలలో నివాసం చేసేవారు బయటికి వెళ్ళి, ఆ కవచాలనూ పెద్ద డాళ్ళనూ చిన్న డాళ్ళనూ విండ్లనూ గదలనూ ఈటెలనూ తీసుకొని పొయ్యిలో కాలుస్తారు. ఏడు సంవత్సరాలు వాటిని వంటచెరకుగా వినియోగిస్తారు.

[10] వారికి పొలంలో కట్టెలు ఏరుకోవడం, అడవిలో చెట్లు నరకడం అవసరంగా ఉండదు. ఎందుకంటే వారు ఆ ఆయుధాలను పొయ్యిలో కాలుస్తారు. వారిని దోచుకొన్నవాళ్ళను వారే దోచుకొంటారు. వారి సొమ్ము కొల్ల పెట్టినవాళ్ళ సొమ్ము వారే కొల్లపెడతారు. ఇది యెహోవాప్రభు వాక్కు.

[11] “ఆ కాలంలో నేను ఇస్రాయేల్‌లో గోగుకు స్మశాన భూమి ఇస్తాను. ఆ స్థలం తూర్పుగా సరస్సు దగ్గర ఉన్న ‘ప్రయాణికుల లోయ.’ అక్కడ గోగునూ వాడి సైన్యాలన్నిటినీ పాతిపెట్టడం జరుగుతుంది. ఆ లోయ ద్వారా వెళ్ళడానికి ప్రయాణికులకు వీలుండదు. అప్పటినుంచి ఆ లోయను ‘హమోను–గోగు’ అంటారు.

[12] దేశాన్ని శుద్ధం చేయడానికి ఇస్రాయేల్ ప్రజలకు వాళ్ళను పాతిపెట్టడంలో ఏడు నెలలు పడుతుంది.

[13] దేశంలో ఉన్న జనులంతా వాళ్ళను పాతిపెడతారు. నాకు ప్రఖ్యాతి కలిగిన ఆ రోజు వారు పేరు పొందుతారు. ఇది యెహోవాప్రభు వాక్కు.

[14] దేశాన్ని శుద్ధం చేయడానికి మనుషులను నియమిస్తారు. వారిలో కొందరు దేశసంచారం చేస్తారు, కొందరు నేలమీద ఉన్న శవాలను పాతిపెడతారు. ఆ ఏడు నెలలైన తరువాత దేశంలో ఇలా తనిఖీ చేయడం ఆరంభిస్తారు.

[15] దేశసంచారం చేసేవారికి ఎవరికైనా మనిషి ఎముక కనబడితే అతడు దానిదగ్గర ఏదైనా గుర్తు ఉంచుతాడు. పాతిపెట్టేవారు వచ్చి ఆ ఎముకను ‘హమోను–గోగు’లో పాతిపెట్టేవరకు ఆ గుర్తు దానిదగ్గర ఉంటుంది.

[16] హమోనా అనే పేరు గల పట్టణం ఉంటుంది. ఈ విధంగా వారు దేశాన్ని శుద్ధం చేస్తారు.

[17] “మానవపుత్రా, యెహోవాప్రభువు చెప్పేదేమంటే, అన్ని రకాల పక్షులకూ అడవి మృగాలకూ ఈ విధంగా చెప్పు: నేను ఇస్రాయేల్ కొండలమీద మీకోసం వధించే గొప్ప బలిదగ్గరికి నలుదిక్కులనుంచి సమకూడి రండి. అక్కడ మీరు మాంసం తింటారు, రక్తం త్రాగుతారు.

[18] బలాఢ్యుల శరీరాలు తింటారు. భూనాయకుల రక్తం త్రాగుతారు. వాళ్ళు బాషానులో క్రొవ్విన పొట్టేళ్ళూ గొర్రెపిల్లలూ మేకలూ ఎద్దులూ అయినట్టు మీరు తిని త్రాగుతారు.

[19] నేను మీకోసం వధించే ఆ బలిదగ్గర మీరు కడుపార క్రొవ్వు తింటారు, మీకు మత్తు కలిగేవరకు రక్తం త్రాగుతారు.

[20] నేను ఏర్పరచిన పంక్తిని కూర్చుని గుర్రాలనూ రౌతులనూ బలాఢ్యులనూ సైనికులనూ కడుపార తింటారు. ఇది యెహోవాప్రభు వాక్కు.

[21] “నేను నా మహిమ ఇతర ప్రజలమధ్య కనుపరచుకొంటాను. నేను వాళ్ళమీద పెట్టిన శిక్షనూ నేను తీర్చిన తీర్పుల నెరవేర్పునూ అన్ని దేశాలవాళ్ళు చూస్తారు.

[22] ఆ రోజునుంచి నేనే యెహోవాననీ తమ దేవుణ్ణనీ ఇస్రాయేల్‌ప్రజలు తెలుసుకొంటారు.

[23] నాపట్ల ద్రోహులై చేసిన అపరాధాల కారణంగా ఇస్రాయేల్‌ప్రజ బందీలుగా వెళ్ళారని ఇతర ప్రజలు తెలుసుకొంటారు. ఇస్రాయేల్‌వారికి నా ముఖం కనబడకుండా చేసి వారిని వారి శత్రువుల వశం చేశాను. వారంతా కత్తిపాలయ్యారు.

[24] వారి అశుద్ధతకూ అక్రమకార్యాలకూ తగిన విధంగా వారిపట్ల వ్యవహరించి నా ముఖం వారికి కనబడకుండా చేశాను.

[25] “అందుచేత యెహోవాప్రభువు చెప్పేదేమంటే, నా పవిత్రమైన పేరు విషయం అత్యాసక్తి కలిగి, యాకోబు సంతతివారిని చెరలోనుంచి రప్పిస్తాను, ఇస్రాయేల్ ప్రజలందరినీ కనికరిస్తాను.

[26] వారు ఎవరి భయం లేకుండా సురక్షితంగా స్వదేశంలో నివాసం చేసినప్పుడు తాము నాపట్ల చూపిన ద్రోహాన్నీ తమ అవమానాన్నీ వారు మరచిపోతారు.

[27] ఇతర జనాలలోనుంచి, వారి శత్రువుల దేశాలనుంచి నేను వారిని సమకూర్చి స్వదేశానికి రప్పించిన తరువాత, వారిద్వారా అనేక జనాల కళ్ళెదుట నన్ను నేను పవిత్రుణ్ణిగా కనుపరచు కొంటాను.

[28] నేను ఇతర జనాలలోకి వారిని బందీలుగా పంపించినా, అక్కడ ఎవరినీ విడవక అందరినీ స్వదేశానికి సమకూరుస్తాను గనుక నేనే యెహోవాననీ తమ దేవుణ్ణనీ వారు తెలుసుకొంటారు.

[29] అప్పటినుంచి నా ముఖం వారికి కనబడకుండా చేయను. ఇస్రాయేల్ ప్రజలమీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇది యెహోవాప్రభు వాక్కు.”

యెహెజ్కేలు — Chapters