Skip to content
Opens in a new window

[1] మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది:

[2] “మానవపుత్రా, ఇస్రాయేల్‌ప్రజల కాపరులకు ప్రతికూలంగా దైవావేశపూర్వకంగా పలుకుతూ వాళ్ళతో ఇలా అను: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, కాపరులు మందను మేపాలి గదా. ఇస్రాయేల్ ప్రజల కాపరులు కడుపు నింపుకుంటున్నారు. వారికి శిక్ష తప్పదు.

[3] మీరు వాటి మీగడ తింటారు, వాటి బొచ్చు తొడుక్కొంటారు. గొర్రెలలో క్రొవ్వినవాటిని వధించి తింటారు, గాని మందను మాత్రం మేపరు.

[4] మీరు బలం లేనివాటికి బలం వచ్చేలా చేయలేదు, రోగంతో ఉన్నవాటిని బాగు చేయలేదు, గాయపడ్డ వాటికి కట్టు కట్టలేదు, తోలివేసినవాటిని తిరిగి తోలుకురాలేదు, తప్పిపోయిన వాటిని వెదకలేదు. అంతేగాక కఠినంగా క్రూరంగా వాటిమీద పెత్తనం చేశారు.

[5] అందుచేత కాపరి లేక అవి చెదరిపోయాయి. చెదరిపోయి అన్ని రకాల అడవి మృగాలకు ఆహారమయ్యాయి.

[6] నా గొర్రెలు తప్పిపోయి ప్రతి పర్వతంమీదా ఎత్తయిన కొండమీదా తిరుగులాడాయి, భూతలమంతటా చెదరిపోయాయి. అయితే వాటి విషయం విచారించినవాడు గానీ వెదకినవాడు గానీ ఒక్కడూ లేడు.

[7] “అందుచేత, కాపరుల్లారా, యెహోవా వాక్కు వినండి –

[8] యెహోవా ఇలా అంటున్నాడు: నా జీవంతోడని శపథం చేసి చెపుతున్నాను, కాపరులు లేకుండా నా మంద దోపిడీకి గురి అయింది. అన్ని రకాల అడవి మృగాలకు ఆహారం అయింది. నా కాపరులు నా మందను వెదకలేదు, మందను ఏమీ మేపకుండా వాళ్ళు తమ కడుపు నింపుకొనేవాళ్ళు.

[9] అందుచేత, కాపరుల్లారా, యెహోవా వాక్కు వినండి.

[10] యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, ఈ కాపరులకు వ్యతిరేకిని. వాళ్ళు నా మంద విషయం లెక్క అప్పగించాలని నేను అడుగుతాను. ఆ కాపరులు తమ కడుపు నింపుకోకుండేలా మందను వాళ్ళ చేతిలోనుంచి తీసివేస్తాను. వాళ్ళకు తిండి కాకుండేలా వాళ్ళ నోటనుంచి నా మందను తప్పిస్తాను.

[11] “యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: నేను స్వయంగా నా గొర్రెలను వెదకి కనుగొంటాను.

[12] చెదరిన గొర్రెలను కాపరులు వెదకే విధంగా నేను నా గొర్రెలను వెదకుతాను. మబ్బులు కమ్మి చీకటయిన రోజున ఎక్కడెక్కడ అవి చెదరిపోయాయో ఆ చోట్లన్నిటి నుంచీ నేను వాటిని విడిపిస్తాను.

[13] ఇతర జనాల మధ్యనుంచి, వేరువేరు దేశాల నుంచి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోకి తీసుకువస్తాను. ఇస్రాయేల్ కొండలమీద వాగులమధ్య, దేశంలో నివాసాలు ఏర్పడ్డ ప్రతి స్థలంలో వాటిని మేపుతాను.

[14] మంచి మేత ఉన్న చోట వాటిని మేపుతాను. ఇస్రాయేల్ ఎత్తయిన కొండలు వాటికి మేత స్థలంగా ఉంటాయి. అక్కడ అవి మంచి మేత ఉన్న చోట పడుకొంటాయి. ఇస్రాయేల్ కొండలమీద శ్రేష్ఠమైన పచ్చిక మైదానాలలో మేస్తాయి.

[15] నేనే నా గొర్రెలను మేపుతూ, పడుకోబెట్టుతూ ఉంటాను. ఇది యెహోవాప్రభు వాక్కు.

[16] తప్పిపోయినవాటిని వెదకుతాను, తోలివేయబడ్డ వాటిని తిరిగి తీసుకువస్తాను, గాయపడ్డవాటికి కట్టు కడతాను, బలం లేనివాటికి బలం కలిగిస్తాను. అయితే క్రొవ్వినవాటినీ బలం ఉన్నవాటినీ నాశనం చేస్తాను. మందను న్యాయంతో కాస్తాను.

[17] “నా మందా, మీ విషయం యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: గొర్రెకూ గొర్రెకూ మధ్య, పొట్టేళ్ళకూ మేకపోతులకూ మధ్య భేదం చూచి నేను తీర్పు తీరుస్తాను.

[18] పచ్చిక మైదానాలలో మంచి మేత మేయడం మీకు చాలదా? మిగిలినదానిని కాళ్ళతో త్రొక్కాలా? స్వచ్ఛమైన నీళ్ళు త్రాగడం మీకు చాలదా? మిగతా నీళ్ళు కాళ్ళతో కెలికి మురికిచేయాలా?

[19] మీరు కాళ్ళతో త్రొక్కినదానిని నా గొర్రెలు మేయాలా? మీరు కలక చేసిన నీళ్ళు అవి త్రాగాలా?

[20] గనుక యెహోవాప్రభువు చెప్పేదేమంటే, నేను స్వయంగా క్రొవ్విన గొర్రెలకూ చిక్కిపోయిన గొర్రెలకూ మధ్య భేదం చూచి తీర్పు తీరుస్తాను.

[21] మీరు భుజంతో ప్రక్కతో త్రోస్తూ, నీరసించిపోయిన వాటన్నిటినీ కొమ్ములతో పొడుస్తూ, వాటిని చెదరగొట్టి వేస్తున్నారు.

[22] అందుచేత ఇకనుంచి నా మంద దోపిడీ కాకుండా నేను వాటిని కాపాడుతాను. గొర్రెకూ గొర్రెకూ మధ్య తీర్పు తీరుస్తాను.

[23] నా మందను పోషించడానికి నేను వాటిమీద నా సేవకుడైన దావీదును కాపరిగా నియమిస్తాను. అతడు కాపరిగా ఉండి వాటిని పోషిస్తాడు.

[24] నేను – యెహోవాను – వాటికి దేవుడుగా ఉంటాను, వాటిమధ్య నా సేవకుడు దావీదు అధిపతిగా ఉంటాడు. నేను యెహోవాను. నేనే ఈ మాట ఇచ్చాను.

[25] “అవి అరణ్యంలో నిర్భయంగా నివసించేలా, అడవిలో సురక్షితంగా నిద్రపోయేలా నేను వాటితో శాంతి ఒడంబడిక చేస్తాను, దేశంలో దుష్టమృగాలు లేకుండా చేస్తాను.

[26] నేను నా పర్వతం చుట్టున్న స్థలాలమీద వాటిని దీవిస్తాను. సరియైన సమయాలలో వానలు కురిపిస్తాను. దీవెనల వర్షాలు ఉంటాయి.

[27] చెట్లు పండ్లు ఇస్తాయి. భూమి పంట పండుతుంది. నా ప్రజ స్వదేశంలో నిర్భయంగా నివాసం చేస్తారు. నేను వారి కాడికట్లు విప్పి వారిని బానిసలుగా చేసినవాళ్ళ వశంలోనుంచి వారిని విడిపించేటప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు.

[28] అప్పటినుంచి వారు ఇతర జనాలకు దోపిడీగా ఉండరు. దుష్ట మృగాలు వారిని మ్రింగివేయవు. వారు సురక్షితంగా నివాసం చేస్తారు. వారిని ఎవ్వరూ భయపెట్టరు.

[29] “పంటల విషయం పేరు పొందిన ప్రదేశం నేను వారికి ప్రసాదిస్తాను. అప్పటినుంచి దేశంలో వారు కరవుకు గురి కాబోరు, ఇతర జనాలు వారిని అవమానించరు.

[30] అప్పుడు నేను – వారి దేవుడు యెహోవాను – వారికి తోడుగా ఉన్నాననీ, వారు – ఇస్రాయేల్ వంశంవారు – నా ప్రజ అనీ వారు తెలుసుకొంటారు. ఇది యెహోవాప్రభు వాక్కు.

[31] మీరు నా గొర్రెలు, నేను పోషించే గొర్రెలు. మీరు మనుషులు, నేనే మీ దేవుణ్ణి. ఇది యెహోవాప్రభు వాక్కు.”

యెహెజ్కేలు — Chapters