Skip to content
Opens in a new window

[1] “మానవపుత్రా, చిల్ల పెంకు తీసుకువచ్చి నీ ముందర ఉంచుకొని జెరుసలం నగరాన్ని దానిమీద చిత్రించు.

[2] ముట్టడికి సూచకంగా దాని ఎదుట కావలి గోపురాలనూ ముట్టడిదిబ్బనూ శిబిరాలనూ గోడలనూ చుట్టూరా కూలగొట్టే యంత్రాలనూ చిత్రించు.

[3] ఇనుప రేకు తెచ్చి నీకూ నగరానికీ మధ్య ఇనుప గోడగా దానిని నిలబెట్టి ఆ నగరంవైపు నీ ముఖం తిప్పి చూస్తూ వుండు. నగరం ముట్టడికి గురి అవుతూ ఉన్నట్టుంటుంది. నీవు ముట్టడించేవాడుగా ఉంటావు. అదంతా ఇస్రాయేల్ ప్రజలకు సూచనగా ఉంటుంది.

[4] “తరువాత ఎడమ ప్రక్కకు తిరిగి పడుకో, ఇస్రాయేల్ ప్రజల అపరాధం నీమీద మోపుకో, నీవు ఎన్ని రోజులు ఆ ప్రక్కకు పడుకొని ఉంటావో అన్ని రోజులు వారి అపరాధం భరిస్తూ ఉంటావు.

[5] వారు అపరాధం చేస్తూ వచ్చిన సంవత్సరాల లెక్కప్రకారం నీకు మూడు వందల తొంభై రోజులు నిర్ణయించాను. ఈ విధంగా ఇస్రాయేల్ ప్రజల అపరాధం నీవు భరిస్తూ ఉంటావు.

[6] “ఆ రోజులు గడిచిన తరువాత నీవు కుడి ప్రక్కకు తిరిగి పడుకొని యూదా ప్రజల అపరాధం భరించాలి. వారి విషయం సంవత్సరానికి ఒక రోజు చొప్పున నలభై రోజులు నీకు నిర్ణయించాను.

[7] నీవు జెరుసలం ముట్టడివైపు చూస్తూ, చొక్కా తీసివేసిన బాహువు చాపి, జెరుసలం గురించి దైవావేశ పూర్వకంగా ప్రకటించాలి.

[8] నీవు ముట్టడించేవాడిలాగా ఉన్న రోజులు గడిచేవరకు నీవు రెండో ప్రక్కకు తిరగకుండేలా నిన్ను త్రాళ్ళతో కట్టిస్తాను.

[9] “నీవు గోధుమలూ యవలూ చిక్కుడుగింజలూ పప్పూ సజ్జలూ జొన్నలూ తెచ్చుకొని ఒకే పాత్రలో ఉంచి నీకోసం రొట్టెలు కాల్చుకో. నీవు ప్రక్కమీద పడుకొని ఉన్న ఆ మూడు వందల తొంభై రోజులు ఆ రొట్టెలు తింటూ రావాలి.

[10] ప్రతిరోజూ రెండు వందల గ్రాముల ప్రకారం తినాలి. అది తూచి చూడాలి. నిర్ణీత వేళకు తినాలి.

[11] నీళ్ళు కూడా కొలత చూచి రోజూ రెండు గ్లాసులు త్రాగాలి. నిర్ణీత వేళకు త్రాగాలి.

[12] యవల అప్పం చేసినట్టు రొట్టెలు చేసి, వంటచెరకుగా మనిషి మలం ఉపయోగించి, ప్రజల కళ్ళెదుటే వాటిని కాల్చి తినాలి.

[13] నేను ఇస్రాయేల్ ప్రజలను చెదరగొట్టే జనాలమధ్య వారు ఈ ప్రకారం అశుద్ధమైన ఆహారం తినవలసివస్తుంది” అని యెహోవా నాతో అన్నాడు.

[14] అందుకు నేను “అయ్యో, యెహోవాప్రభూ! నేనెన్నడూ అశుద్ధుణ్ణి కాలేదు. బాల్యంనుంచి నేటివరకూ దానంతట అదే చచ్చినదాన్ని గానీ మృగాలు చీల్చినదాన్ని గానీ నేనెన్నడూ తినలేదు. అసహ్యమైన మాంసం నా నోట ఎప్పుడూ పడలేదు” అన్నాను.

[15] ఆయన “సరే, నేను నిర్ణయించినదేమిటంటే, రొట్టె కాల్చడానికి మనిషి మలానికి బదులు పేడ ఉపయోగించ వచ్చు” అన్నాడు.

[16] అప్పుడాయన నాతో అన్నాడు, “మానవపుత్రా, జెరుసలంకు ఆహారం సరఫరా చేయబడకుండా నేను చేస్తాను. అక్కడివారు విచారపడుతూ, ఆహారం జాగ్రత్తగా తూచి తింటారు. నిరాశతో నీళ్ళు కొలత చూచి త్రాగుతారు.

[17] అన్నపానాలు కొదువగా ఉండడంచేత ఒకణ్ణి ఒకడు చూస్తూ, నిర్ఘాంతపోతారు, తమ అపరాధాలలో నీరసించి పోతారు.

యెహెజ్కేలు — Chapters