[1] మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది:
[2] “మానవపుత్రా, తూరు పరిపాలకుడికి ఇలా చెప్పు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, నీవు విర్రవీగి ‘నేనొక దేవుణ్ణి, సముద్రం మధ్య ఒక దేవుడి సింహాసనంమీద నేను కూర్చుని ఉన్నాను’ అనుకొంటున్నావు. దేవునికి ఉన్నంత జ్ఞానం నీకున్నట్టు నీవు అనుకొన్నా దేవుడివి కావు. నీవు మనిషివే.
[3] దానియేలుకంటే నీవు జ్ఞానివి, నీకు గూఢమైనది అంటూ ఏదీ లేదు అని నీ అభిప్రాయం.
[4] “నీవు జ్ఞాన వివేకాల మూలంగా ఐశ్వర్యం చేకూర్చుకొన్నావు. నీ ధనాగారాలలో వెండిబంగారాలు పోగు చేశావు.
[5] వర్తకంలో నీ గొప్ప ప్రవీణతద్వారా నీ ధనాన్ని వృద్ధి చేశావు. నీ ధనం కారణంగా నీవు గర్వించావు.
[6] “అందుచేత యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: దేవునికున్నంత జ్ఞానం నీకున్నట్టు నీవు అనుకొన్నావు గనుక
[7] విదేశీయులు – జనాలలోకెల్లా క్రూరమైన జనం – నీపైన పడేలా నేను చేయబోతున్నాను. వాళ్ళు నీ జ్ఞానశోభకు వ్యతిరేకంగా తమ ఖడ్గాలు ఒరనుంచి తీస్తారు. నీ వైభవాన్ని ధ్వంసం చేస్తారు.
[8] నిన్ను నాశనకరమైన అగాధంలోకి పంపుతారు. సముద్రంలో హతమైన వాళ్ళలాగే నీవు చస్తావు.
[9] “నిన్ను చంపేవాళ్ళ ఎదుట ‘నేను ఒక దేవుణ్ణి’ అంటావా? నిన్ను చంపేవాళ్ళ చేతిలో నీవు మనిషిగానే ఉంటావు గాని దేవుడుగా కాదు.
[10] విదేశీయుల చేతుల్లో నీ చావు సున్నతి లేనివాళ్ళ చావులాగే ఉంటుంది. నేనే ఈ మాట ఇచ్చాను. ఇది యెహోవాప్రభు వాక్కు.”
[11] మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది:
[12] “మానవపుత్రా, తూరు రాజును గురించి విలాపం ఎత్తి అతడికి ఇలా చెప్పు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, ఒకప్పుడు నీవు లోపం లేని విధంగా ఉన్నావు – నీ జ్ఞానం, నీ సౌందర్యం పరిపూర్ణమైనవి.
[13] దేవుని తోట అయిన ఏదెనులో నీవు ఉన్నావు. అన్ని రకాల ప్రశస్త రత్నాలూ నీకు అలంకారంగా ఉన్నాయి – మాణిక్యం, గోమేధికం, వజ్రం, కురువింద రత్నం, మిశ్రమవర్ణ రత్నం, నీలం, పద్మరాగం, పచ్చ. బంగారంలో అవి పొదిగినవి. నిన్ను సృజించిన రోజే అవి నీకు తయారయ్యాయి.
[14] “నీవు కావలివాడుగా అభిషేకం పొందిన కెరూబువు. నేనే నిన్ను నియమించాను. నీవు దేవుని పవిత్ర పర్వతంమీద ఉండేవాడివి, నిప్పు కణాల్లాంటి రాళ్ళమధ్య నడిచేవాడివి.
[15] నిన్ను సృజించిన రోజునుంచి నీలో చెడుతనం కనిపించేవరకు నీ ప్రవర్తన లోపం లేనిది.
[16] అయితే నీ వ్యాపారం అధికం కావడం మూలాన నీవు బలాత్కారంతో నిండిపోయావు. నీవు పాపం చేశావు గనుక దేవుని పర్వతంమీద ఉండకుండా నిన్ను అవమానానికి గురి చేశాను. కావలివాడైన కెరూబూ, నిప్పు కణాల్లాంటి రాళ్ళ మధ్యనుంచి నిన్ను వెళ్ళగొట్టాను.
[17] “నీ సౌందర్యాన్ని చూచుకొని నీకు అహంభావం కలిగింది. నీ వైభవాన్ని చూచుకొని నీ జ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకొన్నావు. అందుచేత నేను నిన్ను భూమిమీదికి పడవేశాను. రాజులకు నిన్ను వింత దృశ్యంగా చేశాను.
[18] నీ అనేక దోషాలచేత, నీ అన్యాయ వర్తకంచేత నీ పవిత్ర స్థలాలు అపవిత్రం చేశావు. అందుచేత నీలోనుంచి మంట వచ్చేలా చేశాను. అది నిన్ను కాల్చివేసింది. నిన్ను చూస్తున్నవాళ్ళందరి ఎదుటే నిన్ను బూడిద చేశాను.
[19] జనాలలో నిన్ను తెలుసుకొన్నవారంతా నిన్ను గురించి నిర్ఘాంతపోయారు. నీవు భయంకరమైన అంతానికి వచ్చావు. నీవు ఇక ఉండవు.”
[20] మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది:
[21] “మానవపుత్రా, నీ ముఖం సీదోను వైపు త్రిప్పుకొని దాన్ని గురించి దైవావేశ పూర్వకంగా ఇలా చెప్పు:
[22] యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, సీదోనూ! నేను నీకు వ్యతిరేకిని. నీ మధ్య నాకు ప్రఖ్యాతి కలుగుతుంది. దానిలో నా తీర్పులు తీరుస్తూ, నన్ను పవిత్రుడుగా కనుపరుస్తూ ఉన్నప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు.
[23] దాని మధ్యకు ఘోరమైన అంటురోగం పంపిస్తాను. దాని వీధుల్లో రక్తపాతం జరిగేలా చేస్తాను. నలుదిక్కులా దానిమీదికి ఖడ్గం వస్తుంది, హతమైనవాళ్ళు దానిలో కూలుతారు. అప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు.
[24] “ఇస్రాయేల్ ప్రజల చుట్టు, గుచ్చుకొనే ముండ్ల కంపల లాగా, నొప్పి కలిగించే గచ్చతీగెలలాగా ఉండి, వారిని ద్వేషించిన జనాలు అప్పటినుంచి ఉండవు. అప్పుడు నేనే యెహోవాప్రభువునని వాళ్ళు తెలుసుకొంటారు.
[25] “యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: జనాలలో చెదరిపోయిన ఇస్రాయేల్ ప్రజలను నేను సమకూర్చేటప్పుడు వారిమధ్య, జనాల కళ్ళెదుటే, నన్ను పవిత్రునిగా కనుపరచుకొంటాను. నా సేవకుడు యాకోబుకు నేనిచ్చిన తమ సొంత దేశంలో అప్పుడు వారు నివాసం చేస్తారు.
[26] వారు దానిలో నిర్భయంగా ఉంటూ, ఇండ్లు కట్టుకొని ద్రాక్షతోటలు నాటుకొంటారు. వాటిచుట్టూ ఉండి వారిని ద్వేషించిన వాళ్ళందరిపట్లా నా తీర్పులప్రకారం జరిగించిన తరువాత వారు నిర్భయంగా నివాసముంటారు. అప్పుడు నేనే యెహోవానూ వారి దేవుణ్ణీ అని వారు తెలుసుకొంటారు.”