[1] అప్పుడాయన తూర్పు దిశగా ఉన్న ద్వారానికి నన్ను వెంటబెట్టుకుపోయాడు.
[2] ఇస్రాయేల్ ప్రజల దేవుని శోభాప్రకాశం తూర్పు దిక్కునుంచి రావడం నాకు కనిపించింది. ఆయన స్వరం జలప్రవాహాల ధ్వనిలాంటిది. ఆయన శోభాప్రకాశం చేత భూమి ప్రకాశించింది.
[3] నాకు కనిపించిన ఈ దర్శనం, ఆయన నగరాన్ని నాశనం చేయడానికి వచ్చిన సమయాన నాకు కనిపించిన దర్శనం వంటిది. నేను సాగిలపడ్డాను.
[4] యెహోవా శోభాప్రకాశం తూర్పుదిశగా ఉన్న ద్వార మార్గాన వచ్చి దేవాలయంలో ప్రవేశించింది.
[5] అప్పుడు దేవుని ఆత్మ నన్ను ఎత్తి లోపలి ఆవరణంలోకి తీసుకువచ్చాడు. దేవాలయం యెహోవా శోభాప్రకాశంతో నిండిపోయింది.
[6] ఆ వ్యక్తి నాదగ్గర ఇంకా నిలబడి ఉన్నాడు. అప్పుడు దేవాలయంలోనుంచి నాతో మాట్లాడే ఒకరి స్వరం నేను విన్నాను.
[7] ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవపుత్రా, ఇది నా సింహాసన స్థలం, నా పాదపీఠం. ఇక్కడే నేను ఇస్రాయేల్‌ప్రజల మధ్య చిరకాలం నివాసం చేస్తాను. ఇప్పటినుంచి వారు వేశ్యలాగా ప్రవర్తించరు, వారు రాజుల మృతదేహాలకు ఎత్తయిన పూజా స్థలాలను కట్టరు. ఆ విధంగా వారు గానీ వారి రాజులు గానీ మరెన్నడూ నా పవిత్రమైన పేరును దూషణకు గురి చేయరు.
[8] ఇంతకుముందు వారు వారి స్థలాల గడపలను నా గడప దగ్గర కట్టి, వారి అసహ్య కార్యాలచేత నా పవిత్రమైన పేరును దూషణకు గురి చేశారు. అందుచేత నేను కోపగించి వారిని నాశనం చేశాను.
[9] వారు వేశ్యలాగా ప్రవర్తించడం మాని నా సముఖంనుంచి వారి రాజుల శవాలను దూరంగా తీసుకుపోవాలి. అప్పుడు వారి మధ్య నేను చిరకాలం నివాసం చేస్తాను.
[10] “మానవపుత్రా, ఇస్రాయేల్ ప్రజలు తమ అపరాధాల విషయం సిగ్గుపడేలా వారికి ఈ ఆలయాన్ని గురించి వివరంగా చెప్పు. వారు దాని ఏర్పాటు విషయం ఆలోచించాలి.
[11] వారు చేసిన క్రియల కారణంగా వారికి సిగ్గు కలిగితే, ఆలయంయొక్క ఆకారం, ఏర్పాటు, ద్వారాలు, దాని తీరులన్నీ, నియమాలన్నీ, చట్టాలన్నీ వారికి తెలియజెయ్యి. వారి కళ్ళెదుటే వాటిని వ్రాయి.
[12] ఇది ఆ ఆలయం విషయమైన శాసనం: పర్వతంమీద దాని చుట్టూ ఉన్న ప్రదేశమంతా అతి పవిత్రం. ఆలయం విషయమైన శాసనమిదే.
[13] “పెద్ద మూరల కొలతప్రకారం (పెద్ద మూర అంటే మూరెడు, బెత్తెడు) బలిపీఠం కొలతలు ఇవి – దాని అడుగుభాగం ఎత్తు ఒక మూర, వెడల్పు ఒక మూర. దాని అంచుకు ఉన్న చూరు ఒక జేన.
[14] నేలమీద ఉన్న అడుగుభాగంనుంచి క్రింది చూరువరకు బలిపీఠం ఎత్తు రెండు మూరలు, వెడల్పు ఒక మూర. ఆ చిన్న చూరునుంచి పెద్ద చూరువరకు దాని ఎత్తు నాలుగు మూరలు, వెడల్పు ఒక మూర.
[15] బలిపీఠం పొయ్యి ఎత్తు నాలుగు మూరలు. దానిమీదనుంచి నాలుగు కొమ్ములు పైకి ఉన్నాయి.
[16] ఆ పొయ్యి నలుచదరంగా ఉంది; పొడవు పన్నెండు మూరలు, వెడల్పు పన్నెండు మూరలు.
[17] దాని చూరు కూడా నలుచదరంగా ఉంది; పొడవు పద్నాలుగు మూరలు, వెడల్పు పద్నాలుగు మూరలు. దాని అంచు వెడల్పు ఒక జేన. దాని అడుగుభాగం వెడల్పు ఒక మూర. దాని మెట్లు తూర్పువైపు ఉన్నాయి.”
[18] అప్పుడాయన నాతో ఇలా అన్నాడు: “మానవపుత్రా, యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, వారు ఈ బలిపీఠం కట్టిన తరువాత దానిమీద రక్తం చిలకరించేటప్పుడు, హోమబలి అర్పించేటప్పుడు ఈ చట్టాలను అనుసరించాలి:
[19] నాకు సేవ చేయడానికి నా సన్నిధానానికి వచ్చే యాజులు లేవీగోత్రంవారై, సాదోకు వంశీయులై ఉండాలి. ఇది యెహోవాప్రభు వాక్కు. నీవు వారికి పాపాలకోసమైన బలిగా కోడె దూడను ఇవ్వాలి.
[20] బలిపీఠానికి ప్రాయశ్చితం చేసి దాన్ని శుద్ధీకరించడానికి నీవు ఆ కోడె రక్తంలో కొంత తీసుకొని బలిపీఠం మీద ఉన్న కొమ్ములమీద, చూరుయొక్క నాలుగు మూలలమీద, చుట్టు ఉన్న అంచుమీద పెట్టాలి.
[21] తరువాత పాపాలకోసమైన బలి కోడెను తీసుకుపోయి దేవాలయం బయట నిర్ణీత స్థలంలో కాల్చివేయాలి.
[22] “రెండో రోజున నీవు పాపాలకోసమైన బలిగా లోపం లేని మేకపోతును అర్పించాలి. కోడెదూడ రక్తంతో బలిపీఠాన్ని శుద్ధి చేసిన ప్రకారం మళ్ళీ శుద్ధి చేయాలి.
[23] శుద్ధి చేసిన తరువాత, లోపం లేని కోడెదూడనూ పొట్టేలునూ అర్పించాలి.
[24] నీవు వాటిని యెహోవా సన్నిధానానికి తేవాలి. యాజులు వాటిమీద ఉప్పు చల్లి హోమబలిగా యెహోవాకు అర్పించాలి.
[25] “ఏడు రోజులు వరుసగా పాపాలకోసమైన బలిగా మేకపోతును సిద్ధం చేయాలి. లోపం లేని కోడెనూ పొట్టేలునూ కూడా సిద్ధం చేయాలి.
[26] ఏడు రోజులు యాజులు బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేస్తూ దాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి. ఈ విధంగా వారు దాన్ని ప్రతిష్ఠించాలి.
[27] ఆ రోజుల తరువాత ఎనిమిదో రోజు మొదలుకొని యాజులు బలిపీఠంమీద మీ హోమబలులూ శాంతి బలులూ అర్పించాలి. అప్పుడు నేను మిమ్ములను స్వీకరిస్తాను. ఇది యెహోవా ప్రభు వాక్కు.”